3, డిసెంబర్ 2024, మంగళవారం

మొగలిచెర్ల అవధూత ఆహారపు పద్దతి.

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*

 

*శ్రీ స్వామివారి ఆహారపు పద్దతి..*


*(పంతొమ్మిదవ రోజు)*


ఫకీరు మాన్యం భూమి ని చూసివచ్చిన తరువాత శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటికి తిరిగివచ్చేశారు..వెంటనే ఆయన ధ్యానం చేసుకోవటానికి వెళ్లిపోయారు..ప్రభావతి గారు వంట పని మొదలెట్టి..తమ ఇంటికి సిద్ధపురుషుడు వచ్చాడని సంబరపడుతూ..రెండు రకాల కూరలు, పప్పు, పులుసు, పచ్చడి పాయసం వగైరాలతో చిన్నపాటి విందుభోజనం వండిపెట్టారు..


కొద్దిసేపటి తరువాత శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు.."నాయనా..భోజనం వడ్డించమంటారా?.." అడిగారు ప్రభావతి గారు.."అన్నం పెట్టు తల్లీ..త్వరగా వెళ్లిపోతాను!.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీ స్వామివారు పీట మీద కూర్చున్నారు..ఆయన ముందు విస్తరి వేసి, అందులో తాను చేసిన కూరలు, పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై నెయ్యి కూడా వేసి ఆయన వైపు చూసారు ప్రభావతి గారు..ఆ ప్రక్కనే శ్రీధరరావు గారు కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారు విస్తరిలో వడ్డించిన పదార్ధాల వైపు ఒక్కసారి తేరిపారా చూసి..


"అమ్మా!..ఇంకా ఏమైనా ఉన్నాయా ?..వుంటే అవికూడా వడ్డించమ్మా.." అంటూనే..అప్పటిదాకా విస్తరిలో ఉన్న పదార్ధాలన్నీ అన్నంలో ఒకటిగా కలిపేశారు.."అమ్మా!..ఆ పెరుగో..మజ్జిగో..అదికూడా తీసుకురామ్మా.."అన్నారు..


ప్రభావతి గారు నొచ్చుకున్నారు..ప్రక్కనున్న శ్రీధరరావు గారు మౌనంగా చూస్తున్నారు.."అది కాదు నాయనా..మీకోసమని రుచిగా, శుచిగా చేసాను..మీరు..ఇలా.." ఆవిడ మాట పూర్తికాకముందే..


"అమ్మా..నేను సన్యాసిని..మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లీ!..అలా రుచికి అలవాటు పడితే..జిహ్వ అదే రుచి..అంతకంటే ఇంకా మంచిదేదన్నా వుంటే..ఆ రుచి కావాలని కోరుకుంటుంది..ఇప్పుడు నువ్వు చేసావే..ఈ బెండకాయ కూర బాగుందనుకో.. ప్రభావతమ్మ చేసిన బెండకాయకూర బాగుంది..మరోసారి తినాలనిపిస్తుంది..ఇంకొకరు చేసిన చారు మహత్తరంగా ఉందని దానినీ కోరుకుంటుంది..అందుకనే యోగులు, సిద్ధులు.. సాధకులూ..సన్యాసులూ..తమ అహాన్ని చంపుకొని..నాలుగైదు ఇళ్లలో "భిక్ష" స్వీకరించి..దానిని ఒకే ముద్దగా చేసుకొని ఆహారంగా తీసుకుంటారు..జిహ్వ ను అరికట్టటం సాధకుల మొదటి లక్షణం..ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని ..నీవు చేసిన ప్రతి పదార్ధాన్నీ విడి విడిగా రుచి చూస్తూ భుజిస్తే...రేపటినుండి ఈ నాలుక నా మాట వింటుందా?..వేసేయ్ తల్లీ..నీవు చేసిన అన్ని పదార్ధాలూ ఒకేసారి వడ్డించు!.." అన్నారు..


ప్రభావతి గారు ఇక చేసేదేమీ లేక..తాను చేసిన పాయసం..కూడా తెచ్చి, పెరుగు తో సహా విస్తరిలో వడ్డించారు..శ్రీ స్వామివారు అన్నీ కలిపేసి తినేశారు..


ఆ తరువాత శ్రీధరరావు గారు, "ప్రభావతీ నీకు గుర్తుందా?..మనం కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య గారి గురించి విని వున్నాము..వారు కూడా ఇలాగే జిహ్వ ను అదుపులో పెట్టుకోవడానికి..ఒకసారి గోమయంతో తమ నాలుకను శుద్ధి చేసుకున్నారు.. ఆ అనుభవాన్నే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము..మన అదృష్టమేమిటంటే..ఒకానొక సాధకుడీకి కొంతకాలం పాటు ఆశ్రయం ఇచ్చి సేవ చేసుకోగలగడం!.."అన్నారు..ప్రభావతి గారు కూడా మనసులో సమాధాన పడ్డారు..


శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించిన తరువాత, ఈ దంపతులను పిలచి.."మీకు లభ్యమైన శివలింగం పూజాపీఠం లో ఉందన్నారు కదా?..ఒకసారి  చూపించండి"అన్నారు..శ్రీధరరావు దంపతులు, శ్రీ స్వామివారిని తమ పూజగదిలోకి తీసుకొని వెళ్లి, పూజా పీఠం లో ఉన్న శివలింగాన్ని చూపారు..శ్రీ స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని..దానిని తన హృదయానికి ఆనించుకొని ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్లారు..సుమారు పది పదిహేను నిముషాల పాటు శ్రీ స్వామివారు అలా నిశ్చలంగా ఉండిపోయి..తిరిగి జాగ్రత్తగా పూజాపీఠం లో యధాస్థానంలో ఉంచారు..


"మీఇంటికి ఈశ్వరుడొచ్చాడు..నేనూ వచ్చాను..అమ్మా!..నీది వైష్ణవ భక్తి..ఆ లక్ష్మీనృసింహుడినే కొలుస్తున్నావు..ఇక ఆలస్యం చేయకుండా..ఉదయం మనం చూసిన పొలంలో బావి  త్రవ్వించే కార్యక్రమం చేద్దాము..మీరే మొదలు పెట్టాలి.." శ్రీ స్వామివారు అప్పుడు మాట్లాడిన మాటల్లో శ్రీధరరావు ప్రభావతి గార్లకు పొంతన ఉన్నట్లు అనిపించలేదు..సగం సగం మాట్లాడేరేమో..అని సరిపెట్టుకొని.."బావి ఎక్కడ త్రవ్వించాలి నాయనా?.." అని మాత్రం ప్రభావతి గారు అడిగారు..


"రేపుదయాన్నే స్థల నిర్ణయం చేసి, నేను తిరిగి మాలకొండ వెళ్లిపోతాను..గృహస్తుల వద్ద ఎక్కువకాలం మాలాటి సన్యాసులు ఉండరాదు.."అన్నారు..అన్నవిధంగానే.. మరుసటిరోజు పొద్దున్నే..బావి త్రవ్వడానికి స్థలాన్ని చూపారు..


"స్వామీ!..ఈ పొలంలో నీటి లభ్యత తక్కువ!..జల పడదేమో?.." అన్నారు శ్రీధరరావు గారు..


"పాతాళ గంగ కూడా పైకి వస్తుంది శ్రీధరరావు గారూ..మీరు పని మొదలుపెట్టండి..అన్నీ సమకూరుతాయి!.." అన్నారు నవ్వుతూ.."ఇక నేను మాలకొండ వెళతాను.." అన్నారు..


శ్రీధరరావు దంపతులు సరే నని చెప్పి..శ్రీ స్వామివారిని మాలకొండకు తమ బండిలో పంపారు..మళ్లీ ఆ దంపతుల మనసులో సందేహం మొదలైంది.."స్వామివారికి స్వంత పొలం వుందికదా..మన భూమి అడిగి, అందులో మనచేత బావి త్రవ్వించి..ఆశ్రమ నిర్మాణం చేయడమెందుకు?.." ఈసారి ఆయనను కలిసి ఈ సందేహనివృత్తి చేసుకుందామని అనుకొని ఇంటికొచ్చేశారు..


సందేహనివృత్తి...రేపు..



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: