3, డిసెంబర్ 2024, మంగళవారం

ఊర్మిళాదేవి వింత కోరిక

 *ఊర్మిళాదేవి వింత కోరిక🪷🌹🙏*


🌹🪷శ్రీరామ చంద్రుడు శివ ధనుర్భంగం చేసి సీతా దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత… జనకుడు తన రెండో కూతురు అయిన ఊర్మిళా దేవిని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.ఈ తర్వాత సీతా రామ లక్ష్మణులు వన వాసానికి పోయినన్ని రోజులు… ఊర్మిళా దేవి నిద్రపోయిందని చెబుతుంటారు.


🌹🪷దాదాపు 14 సంవత్సరాలు నిద్ర పోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు.కానీ ఆమె అన్ని రోజులు ఎందుకలా నిద్ర పోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


🌹🪷సీతా రాములతో లక్ష్మణుడు కూడా వన వాసాలకు పోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.వనవాస సమయంలో లక్ష్మణుడు.శ్రీరామ సంరక్షణార్థం నిద్ర పోకుండానే ఉండిపోయాడట. ప్రతి రోజూ అంటే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్ర పోకుండానే ఉన్నాడట.


🌹🪷భర్త నిద్ర పోకుండా ఉండటం వల్ల… ఆయనలో సగ భాగం అయినా ఊర్మిళా దేవి ఈ 14 సవంత్సరాల కాలం నిద్రపోయిందని పురాణాలు చెబుతున్నాయి.అంతే కాదండోయ్ ఈ కాలంలో ఎక్కువ సేపు నిద్రపోయే వారిని ఊర్మిళా దేవితో పోలుస్తారు.


🌹🪷రావణసంహారం జరిగి పోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.


🌹🪷14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.ఆ మాటలు విన్న రాములవారు ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు.అని అన్నాడు.


🌹🪷అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలనీ తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.


🌹🪷రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.


🌹🪷అప్పుడు రాములవారు ''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలుగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని ప్రసాదించారట.


🌹🪷ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: