3, డిసెంబర్ 2024, మంగళవారం

మొగలిచెర్ల అవధూత మంత్రోపదేశం

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*

 

*మంత్రోపదేశం ..ఆశ్రమ నిర్మాణ కర్త ఆగమనం..*


*(ఇరువై ఒకటవ రోజు)*


ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారనీ..మీరేమీ ఆలోచించవద్దనీ శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియచెప్పి..


"అమ్మా!..నీ దేవీపూజ కోటి పూర్తి అయిందా?.." అని ప్రభావతి గారిని అడిగారు..


"నాయనా..నా పదమూడో ఏట, మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను..అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవమంత్రమూ జపిస్తున్నాను..లెక్క పెట్టుకోలేదు.." అన్నారు ప్రభావతి గారు..


"అయితే..నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవమంత్రం ఉపదేశిస్తాను.. దీక్షతో చేయి  తల్లీ!..శ్రీధరరావు గారూ మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించనా?..లేక వైష్ణవమంత్రమా?.."అన్నారు నవ్వుతూ..


"స్వామీ!..నాకు ఏ మంత్రాలూ వద్దు..నేను ఈ దీక్షలు చేయలేను..అదేదో ఆవిడకు బోధించండి..తపనతో చేస్తూ ఉంటుంది..నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను...మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..మీ తపస్సు, దాని ఫలితాలు..నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను..అందుకు నేను దోహదకారిగా వుంటాను..అంతే కాని..ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు!.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామి వారు పక పకా నవ్వారు.."చూసావా అమ్మా!..శ్రీధరరావు గారు మంత్రోపదేశం వద్దన్నారు..పోనీలే అమ్మా..నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను..కొనసాగిద్దువు గానీ.." అని..మళ్లీ కూడా ఆ ఇద్దరికీ ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి, ఆశీర్వదించి పంపించివేశారు..దంపతులిద్దరూ తేలిక పడ్డ మనసుతో మొగలిచెర్ల చేరారు..


ప్రక్కరోజు ఆదివారం.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధరరావు గారింటికి వచ్చారు..రాగానే, శ్రీధరరావు గారికి నమస్కారం చేసి.."అయ్యా..నా పేరు బొగ్గవరపు చిన మీరా శెట్టి..ఇతను నా మిత్రుడు!..మాది, వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం.." అన్నాడు..


శ్రీధరరావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి..వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు..


"నేను..మాలకొండ లో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో వున్నాను..ఆ విషయమై మీతో మాట్లాడాలని వచ్చాను.." అన్నారు..శ్రీధరరావు గారికి ఒక్కక్షణం తాను ఏం వింటున్నానో అనే సందేహం కలిగింది..వెంటనే ప్రభావతి గారిని పిలిచారు..ఇద్దరూ కూర్చున్న తరువాత, చిన మీరాశెట్టి గారు మళ్లీ అదేవిషయం..తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలచానని చెప్పారు..


నిన్న శనివారం  సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు..ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు..దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు..


చిన మీరాశెట్టి గారిని..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు..


శ్రీ స్వామివారు  ఎర్రబల్లె గ్రామం లో ఉన్నప్పటి నుంచీ తెలుసుననీ.. శ్రీ స్వామివారు వ్యాసాశ్రమం వెళ్లి వచ్చిన తరువాత కూడా ఒకటి రెండు సార్లు తాను, తన భార్యా శ్రీ స్వామివారిని కలిసామని..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన కు వెళ్లిన తరువాత ఆయనతో కలవడం కుదరలేదనీ..మీరాశెట్టి గారు చెప్పారు..


నిన్నరాత్రి తనకు స్వప్నంలో కనిపించి..ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని..ముందుగా మిమ్మల్ని కలువమని కూడా ఆజ్ఞాపించారని కూడా మీరాశెట్టి గారు చెప్పారు..శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల చేరారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఇదంతా కలలా ఉంది..దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి..తాము నమ్మిన ఆ లక్ష్మీనృసింహుడే..ఇదంతా నడిపిస్తున్నాడనీ..లేకుంటే..ఒకానొక సాధకుడు, తన తపోసాధనకు తమ సహకారం కోరి..తమ జీవితాలకు ఒక అర్ధం కల్పించడం..లీల కాక మరేమిటి?..


మీరాశెట్టి గారిని, వారి స్నేహితుడిని..ఆ రాత్రికి తమ ఇంటిలోనే వుండమని చెప్పి, తెల్లవారగానే మాలకొండకు వెళ్లి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు శ్రీధరరావు గారు..మీరాశెట్టి గారూ అందుకు అంగీకరించారు..


అందరూ సోమవారం నాడు ఉదయాన్నే..మాలకొండకు బయలుదేరి వెళ్లారు..


ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..బావి లో జలకళ..రేపు..



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: