🙏 నమకం విశిష్టత🙏
నమకానికి రుద్రం అనీ, రుద్ర ప్రశ్న అనీ, శత రుద్రీయం అనీ, రుద్రోపనిషత్ అనీ ఇలా అనేక పేర్లు ఉన్నాయి. రుద్రాన్ని మించిన మంత్రరాజము లేదు. బ్రాహ్మణులు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్త, సన్యాస నాలుగు ఆశ్రమాలవారు రుద్ర పారాయణము చేయవచ్చు.ధర్మశాస్త్రం సన్యాసులకు వేదపారాయణ నిషేధం చెప్పింది. వారికి ఓం అనే ప్రణవమే జపించాలి. అని ధర్మ శాస్త్రం చెప్పినమాట. కాని సన్యాసులు రుద్రనమకం మాత్రం నిత్య పారాయణము చేయవచ్చు. వేదంలో కర్మకాండ, జ్ఞాన కాండ, ఉపాసన కాండ ఉన్నాయి. రుద్ర నమకానికి ఉన్న విశిష్టత ఏమిటంటే నమకములో కర్మకాండ జ్ఞాన కాండ, ఉపాసన కాండల లోని అన్ని విషయాలు ఉన్నాయి. ఇందులో రుద్రతత్త్వం, రుద్ర రూపాలు రుద్ర నామాలు , అంతకుమించి ఉపాసనా జ్ఞానములు సంపూర్ణముగా ఉన్నవి. అందుకే రుద్ర నమకాన్ని రుద్రోపనిషత్ అన్నారు.
పరమేశ్వరుణ్ణే రుద్రుడు అని అంటారు. అయితే రుద్ర నామానికి అర్థం ఏమిటి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. . రుద్రుడు అంటే రోదనము కలిగించువాడు, కరిగించువాడు, నమస్కరించే వారి దుఃఖం పోగొట్టేవాడు అని అర్థం. రోదనము కలిగించడం ఏమిటి? అల్లా చేస్తాడా? అంటే మనకు జన్మలు ఇవ్వడమే రోదనము కలిగించడం పుట్టుకయే దుఃఖ కారణం. ఇంక కరిగించువాడు అంటే పాపములను హరించి జన్మ రాహిత్యం కలుగజేయువాడు ( జన్మలు లేకుండా మోక్షం ఇచ్చేవాడు ) అని అర్ధం
జన్మలు ఇచ్చేవాడు, జన్మలు తీసేవాడు కాబట్టే రుద్రుడు అయ్యాడు
రుద్ర నామానికి పైన చెప్పుకున్న అర్థమే కాకుండా తత్త్వపరమైన అర్థం కూడా ఉంది. రుద్రుడు అనే పేరులో… 'ర'కారం అగ్ని బీజం కదా , ఇది అన్నిటికీ మూలం అయిన చిదగ్ని, అగ్ని అంటే అమ్మవారే 'ద'కారం సోమ తత్త్వం, అంటే శివుడు (రు అంటే అమ్మవారు ద్ర అంటే శివుడు శివ శక్తుల కలయిక ) వెరసి అమ్మ, అయ్యా కలిపితే రుద్ర తత్త్వం.
రుద్ర శబ్దానికి మరొక అర్ధం ఏమిటంటే దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టువాడు
రుద్ర శబ్దములో ఉన్న రెండు రకారాలు ( రు లో రకారము, ద్ర లో రకారం సూచిస్తాయి ఇవి రెండు అగ్ని బీజాలు )
రుద్ర మంత్రం :" ఓం నమో భగవతే రుద్రాయ " నమకము చేయలేకపోయినా ఈ మంత్రం ఒక్కటి జపించిన విశేష ఫలితం వస్తుంది. ఇది సత్యము.
నమకం పఠనం వలన లేదా శ్రవణం వలన ప్రధాన ప్రయోజనం : పాపాలను పోగొట్టి, శివుని యొక్క అనుగ్రహం పొందేటట్టుగా చేసి, క్షామం, భయం పోగొట్టి , ఆహారము , గోసంపద సమృద్ధి గావించి, ఇతర జంతువుల నుండి, అనారోగ్యము ( రోగాలు )నుండి కాపాడుతుంది. చెడుకర్మ, గ్రహనక్షత్రముల యొక్క చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.చివరకు మోక్షం ప్రసాదిస్తుంది
మాకు నమకము రాదు నేర్చుకోలేదు ఎల్లగా? అనుకోవద్దు. నమకము శ్రవణము కూడా విశేష ఫలితమే.. భక్తి శ్రద్దలతో వినండి చాలు.అలాగే శివ కవచం పారాయణం చేయవచ్చు. స్వరముతో పనిలేదు ఫలితం ఒక్కటే ఈశ్వరానుగ్రహం తప్పకుండా కలుగుతుంది..
ఏకాదశ రుద్రులు చూద్దాము
నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః ॥
వీరు మన శరీరంలో జ్ఞానేంద్రియ పంచక, కర్మేంద్రియ పంచక మనస్సు రూపాలతో ఉన్నారు.
కొందరు ఎన్ని పారాయణములు చేసినా పరిస్థితి మారలేదు అనుకుంటారు. దానికి సమాధానం మన పూర్వ జన్మకర్మ పరిపక్వమునకు రాలేదు చెడు అంత తీవ్రముగా ఉంది అని అర్ధం చేసుకోని మరింత పట్టుదలతో, శ్రద్ధతో పారాయణం చేయడమో, వినడమో తప్పక చేయాలి. అప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగితీరుతుంది. ఇది సత్యము
రుద్ర నమకము యొక్క అర్ధం ఒకటి రెండు ఒకటి రెండు అనువాకములు చూద్దాము.
నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.
ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము.నీ బాణములకు నమస్కారము. నీ ధనుస్సుకు నమస్కారము నీ బాహువులకు నీ కోపము. నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తింపజేయుము.
యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః.
శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ.
ఓ రుద్రుఁడా! నీ యీ శరము, నీ ధనుస్సు,. నీ యమ్ములపొది పరమ శాంతమైన దానినిగా జేయుము. శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను అనందింప.జేయుము
ఓం నమశ్శివాయ
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి