28, జనవరి 2025, మంగళవారం

12-20-గీతా మకరందము

 12-20-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ-అధ్యాయాంతమున ఫలశ్రుతిని చెప్పుచున్నారు-


యే తు ధర్మ్యామృతమిదం 

యథోక్తం పర్యుపాసతే 

శ్రద్ధధానా మత్సరమా 

భక్తా స్తే౽తీవ మే ప్రియాః


తా:- ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి {నాయందాసక్తిగలవారై), ఈ అమృతరూపమగు (మోక్షసాధనమైన) ధర్మమును (ఇప్పడు) చెప్పబడిన ప్రకారము  అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.


వ్యాఖ్య:- పైన తెలుపబడిన ధర్మములను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించువారికి కలుగు ఫలితమును వచించుచున్నారు, ఏదియైన ధర్మమును బోధించునపుడు దాని ఫలితమునుగూడ చెప్పినచో ఆచరించువారికి దానిపై పరమవిశ్వాస మేర్పడుచుండును. అందువలననే కాబోలు భగవానుడు భక్తునిలక్షణములను పేర్కొని పేర్కొని కట్టకడకు వాని ననుష్టించుటవలన కలుగు గొప్పఫలితమును చెప్పివైచిరి. ఆ ఫలితమేమి? "తే అతీవ మే ప్రియాః' - భగవంతునకు పరమప్రీతిపాత్రులగుటయే. ఇంతకుమించిన ఫలము జీవుల కేమి కావలయును? అదియున్నచో అన్నియు లభించినట్లే, అది లేనిచో తక్కినవి యెన్నియున్నను నిరుపయోగములే. భగవత్కృపకు మించిన వస్తువు ముల్లోకములందును మరియొకటి లేదు. ఏలయనగా, అట్టి కృప మోక్షమునకు దారితీయును. ఎట్లనిన భగవదనుగ్రహముగలవారికి బుద్ధియోగము (తత్త్వవిచారణాశక్తి) సంప్రాప్తించును. (దదామి బుద్ధియోగమ్) దానిచే నతనికి మోక్షము సన్నిహితమగును.


" ధర్మ్యామృతమ్' - పైన తెలుపబడిన ధర్మములు అమృతరూపమున వర్ణింపబడినవి. ఎందువలననగా,

జననమరణములనుండి తప్పించగల సామర్థ్యము వానియందు గలదు. జీవుని అమరునిగ చేయగలశక్తి వానియందు గర్భితమైయున్నది. భగవానుడు కరుణతో అమృతవర్షమును కురిపించిరి. వారివారి బుద్ధియనుపాత్ర నిండుగ ఆ అమృతమును పట్టి తనివితీర త్రాగుట జీవులధర్మము. ఎవరట్లుచేయరో వారు ఆ అమృతమును త్రావు సౌభాగ్యమును చేతులారా జారవిడుచుకొనినవారే యగుచు సంసారదాహపీడితులై దుర్భరయాతనల ననుభవించవలసివచ్చును. అయితే ఆ ధర్మముల నేప్రకారమనుష్టించవలెను?


"శ్రద్ధధానా" - శ్రద్ధతో ననుష్టించవలెనని చెప్పబడినది. ఒకతూరికాదు, రెండుతూర్లుకాదు, భగవాను డనేకతూర్లు ఈశ్రద్ధయొక్క ఆవశ్యకతను గీతయందు పేర్కొనుచుండుట గమనింపదగియున్నది. మరియు "మత్పరమాః" - పరాత్పరుడే పరమగతియని నమ్మి వారిని ధ్యానించుచు ఆయా సుగుణములను, ధర్మములను అనుష్ఠింపవలెను. "అతీవ మే ప్రియాః" అని చెప్పుటవలన, ఆ ప్రకారమాచరించువారు తనకు మిక్కిలి ప్రియులని గీతాచార్యులభావమైయున్నది. పాఠశాలలో ఉపాధ్యాయునకు ప్రీతిపాత్రుడైయుండు విద్యార్థియొక్క భవిష్యద్విద్యాభివృద్ధివిషయమై ఏలాటి సంశయ మెట్లుండదో, తండ్రి యొక్క అభయహస్తము క్రిందనున్న చంటిపిల్లవానియొక్క యోగక్షేమములవిషయమై ఏ సందేహమున్ను ఎట్లుండదో, అట్లే భగవంతునకు మిక్కిలి ప్రీతిపాత్రుడై యుండు జీవునియొక్క మోక్షవిషయమై ఏ సందియమున్ను ఉండదు. ఆతడు కడతేరినట్లేయగును. కాబట్టి ముముక్షువులు త్వరబడి భగవత్ప్రోక్తమగు ఈ ధర్మ్యామృతమును తనివితీర పానముచేసి కృతార్థులగుటకై యత్నింపవలయును, "యే తు" - అని యచ్ఛబ్ద ప్రయోగము చేయుటవలన ఎవరైననుసరియే వానిని శ్రద్ధతో అనుష్ఠించినచో మోక్షభాగులు కాగలుగుదురని భావము.

ప్ర:- శ్రీకృష్ణమూర్తి బోధించిన ఈ ధర్మములెట్టివి? 

ఉ:- అమృతరూపములు. జననమరణములనుండి తప్పించి జీవుని అమరునిగ (ముక్తునిగ) చేయగలిగినవి.

ప్ర:- ఈ ధర్మముల నేప్రకార మాచరించవలెను? 

ఉ:- శ్రద్ధతో, భగవంతునియెడల అపారమైన భక్తితో.

ప్ర:- అట్లాచరించినందువలన కలుగు ఫలితమేమి? 

ఉ:- వాని నాచరించువాడు భగవానునకు మిక్కిలి ప్రీతిపాత్రుడు కాగలడు.


ఓమ్ ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగోనామ ద్వాదశో౽ధ్యాయః 


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు భక్తియోగమును పండ్రెండవ అధ్యాయము.

ఓమ్ తత్ సత్

కామెంట్‌లు లేవు: