28, జనవరి 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం -132*

 *తిరుమల సర్వస్వం -132*


 *అలిపిరి మార్గం-3*



 *అలిపిరి అంటే?* 


 తిరుమలకు మెట్లదారి మరియు కొండపైకి వాహనాలు వెళ్ళే ఘాట్ రోడ్డు, రెండూ ఒకే ప్రదేశంలో, అంజలి ఘటిస్తూ సమున్నతంగా నిల్చొని ఉన్న గరుత్మంతుని విగ్రహం వద్ద ఆరంభ మవుతాయి. ఆ ప్రదేశాన్నే *"అలిపిరి"* గా పిలుస్తారు. దానికా పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి -


 *"ఆదిపడి"* అనే తమిళ పదబంధంలో - "ఆది" అనే పదానికి "మొట్టమొదట" అని, "పడి" అనే పదానికి "గట్టు" లేదా "ద్వారము" అని అర్థం. తిరుమల కొండకు చేరుకునే మొట్టమొదటి "మెట్టు" ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి *"ఆదిపడి"* అనే నామం ఏర్పడి, అదే కాలక్రమంలో *"అలిపిరి"* గా ఆంద్రీకరించబడింది.


 మరో కథనం ప్రకారం, తిరుమలకు ఉన్నట్లుగా చెప్పబడే అనేక మార్గాల్లో, చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకూ, ఇదే ప్రప్రథమ మార్గం. అందువల్లనే దీనిని "ఆదిపడి" లేదా "అలిపిరి" అని పిలుస్తారు.


 ఈ ప్రదేశంలో, శ్రీవైష్ణవులు పరమ పవిత్రంగా భావించే, శాఖోపశాఖలు కలిగిన "చింతచెట్టు" ఉండేది. చింతచెట్టు తొర్రలో నుండే తమిళుల ఆరాధ్య దైవమైన నమ్మాళ్వారుల వారు ఉపదేశం చేశారని ప్రతీతి. తమిళంలో – చింతచెట్టును "పులి" గానూ (చింతపండుతో చేసే పులి హోరను గుర్తుకు తెచ్చుకుందాం!), పర్వతపాదాన్ని "అడివారం" గానూ వ్యవహరిస్తారు. అందువల్ల, పర్వత ప్రారంభంలో ఉండే ఈ చింతచెట్టును "అడివారపు పులి", లేదా "అడిపులి" గా పిలిచేవారు. అదే, కాలక్రమాన "అలిపిరి" గా రుపాంతరం చెందింది.


 "అలిపిరి" అంటే, "సూక్ష్మరూపం కలిగిన" అనే మరో అర్థం వస్తుంది. ఇక్కడ శ్రీనివాసుడు "సూక్ష్మరూప ధారి" గా కొలువై ఉంటాడనే నమ్మకం ఉండటం చేత, ఆ ప్రదేశానికి "అలిపిరి" అనే పేరు వచ్చింది.


 శ్రీవెంకటేశ్వరుని మహిమను సాక్షాత్కరింప జేసే మరో అద్భుతమైన, చారిత్రాత్మక కథనం కూడా ఉంది. అదేంటంటే.


 *నాటి "అలీఫిరే!" నే - ఈనాటి అలిపిరి* 


 'అలిపిరి' కి ఆ పేరు రావడం వెనుక, ఒక అజ్ఞాతభక్తుడు విరచించిన *"వేంకటాచల విహారశతకము"* అనే గ్రంథంలో మరో కథనం కూడా ఉంది. దాని ప్రకారం.....


 పదిహేడవ శతాబ్దం ద్వితీయార్థంలో, ఢిల్లీలో మొఘలు చక్రవర్తుల పరిపాలన నడుస్తోంది. దక్షిణాన శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసితంగడి, తళ్ళికోట యుద్ధాల తరువాత విజయనగర రాజుల ప్రాబల్యం క్షీణించడంతో; మొఘలు చక్రవర్తులకు సామంతునిగా ఉన్న నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించి, హిందూ దేవాలయాలపై అత్యాచారాలు చేయసాగాడు. 


 ఆ శతాబ్దపు చివరి దశకంలో, ఢిల్లీకి ఆజ్ఞాబద్ధుడైన నిజాంనవాబు "అలీ" అనబడే కరుడుగట్టిన మహమ్మదీయ ఛాందసవాది ఆధ్వర్యంలో తన అపరిమిత సైన్యాన్ని తిరుమల దేవాలయంపై దండయాత్రకు పంపాడు. హైందవమతానికి ఆయువుపట్టైన శ్రీవేంకటేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేయండా ద్వారా హిందూమతాన్ని నిర్వీర్యం గావించి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడమే గాకుండా; అంతకు ముందు శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారికి సమర్పించిన అమూల్య ఆభరణాలను తస్కరించటం కూడా ఈ దండయాత్ర లక్ష్యం. నవాబు ఆదేశం మేరకు తిరుపతి చేరుకున్న అలీ సైన్యానికి పట్టణ ప్రజలందరూ ఎదురై తమ ఊరిలోని స్త్రీలందరి వద్దనున్న బంగారు ఆభరణాలు స్వీకరించి తిరిగి వెళ్ళిపొమ్మని, స్వామివారి జోలికి వెళ్లవద్దని అభ్యర్థించారు. తాళిబొట్లతో సహా గ్రామస్తుల అందరి ఆభరణాలను చేజిక్కించుకున్నా, విశ్వాసఘాతకుడైన "అలీ" ఒప్పందాన్ని ధిక్కరించి, ముందుగా రచించుకొన్న పథకం ప్రకారం తిరుమలపై దండయాత్రకు ఉపక్రమించాడు. 


 శేషాచల పర్వతపాదం వద్ద, అంటే సరిగ్గా ఇప్పుడు "అలిపిరి" గా పిలువబడే ప్రాంతంలో, అలీకి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వరాహరూపంలో సాక్షాత్కరించిన స్వామివారు అలీ సైన్యాన్ని నిలువరించారు. అయినా ఆ ముష్కరులు వెనుకకు తగ్గకపోవడంతో, శ్రీవారి ఆగ్రహం వల్ల "అలీ" దృష్టివిహీను డయ్యాడు. గాఢాంధకారంలో అలమటిస్తూ, దిక్కుతోచక విలపిస్తున్న అలీకి తక్షణమే వెనుదిరిగ వలసిందిగా స్వామివారి హెచ్చరిక వినబడింది. కనువిప్పు కలిగిన అలీ వెంటనే శ్రీవారిని క్షమాభిక్ష నర్థించి నేత్రదానం చేయమని వేడుకొన్నాడు. శాంతించిన స్వామివారి ఆదేశానుసారం అక్కడి నుండి "బతుకు జీవుడా!" అనుకుంటూ అలీ నిష్క్రమించడంతో – అక్కడున్న సిపాయి లందరూ, మహమ్మదీయ మతస్తులతో సహా, అంతులేని ఉద్వేగానికి లోనై, "అలీ ఫిరే!" అంటూ నినాదాలు చేశారు. ఈ ఉత్తరభారత పదబంధానికి "అలీ తోక ముడిచాడు" అని అర్థం. ఈ ఉదంతాన్ని పరిసర ప్రాంతాలలోని సంస్థానాధీశు లందరూ సంబరంగా జరుపుకుని, "అలీ ఫిరే!" అంటూ దండోరా వేయించారు. సాక్షాత్తు స్వామివారు సాక్షాత్కరించిన ఆ ప్రాంతానికి, తండోప తండాలుగా భక్తులు తీర్థయాత్రకు తరలి వెళ్ళేవారు. "అలి ఫిరే!" అన్న నానుడి తదనంతర కాలంలో ఆంద్రీకరించబడి, "అలిపిరి" గా స్థిరమైంది. ఎలా వచ్చినప్పటకీ, వినసొంపైన "అలిపిరి" పేరు వినగానే ముప్పిరిగొనే ఆధ్యాత్మిక భావోద్వేగంతో మనసు తనువు

పులకరించి పోతాయి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: