28, జనవరి 2025, మంగళవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(34వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

           *చిత్రకేతువు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *వృత్రాసురుడు రాక్షసుడు కదా, అతన్ని సంహరిస్తే ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడం ఏమిటి? అన్న సందేహం రాక మానదు.*


*దానికి సమాధానం ఏమిటంటే వృత్రుడు తపస్స్వభావుడు. బ్రహ్మవంశసంజాతుడు. గొప్ప విష్ణుభక్తుడు. అదెలా అంటే అతని పూర్వజన్మ గురించి తెలుసుకోక తప్పదు.*


*పూర్వం శూరసేన దేశాన్ని చిత్రకేతువు పాలించేవాడు. అతనికి కోటి మంది భార్యలు. అంతమంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి పిల్లలు లేరు. దాంతో చిత్రకేతువు చెప్పలేనంత దుఃఖాన్ని అనుభవించసాగాడు. ఆ సమయంలో లోకసంచారం చేస్తూ బ్రహ్మర్షి అంగిరసుడు శూరసేనదేశాన్ని సందర్శించాడు. అంగిరసునికి సకల మర్యాదలూ చేశాడు చిత్రకేతువు. పూజించాడతన్ని. తన మనోదుఃఖాన్ని కూడా విడమరచి చెప్పాడు. సంతతి కలిగే మార్గం చెప్పమని ప్రాథేయపడ్డాడు. జాలి చెందాడు అంగిరసుడు. వెంటనే అతని చేత త్వష్టృయాగం చేయించాడు. యజ్ఞఫలాన్ని చిత్రకేతు పెద్దభార్య కృతద్యుతికి అందజేసి, త్వరలోనే ఆమె ఓ కొడుకుని ప్రసాదిస్తుందని చెప్పి, అక్కణ్ణుంచి నిష్క్రమించాడతను.*


*కృతద్యుతి గర్భవతి అయింది. నవమాసాలూ నిండి ఓ కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుణ్ణి చూసి చిత్రకేతువు ఆనందించాడు. రాజ్యం అంతటా పండుగ చేశాడు. ప్రజలకు అనేక కానుకలిచ్చాడు. బ్రాహ్మణులకూ, మునులకూ భూరిదానాలిచ్చాడు. అందరినీ సంతృప్తి పరిచాడు.*


*ఇంత వరకూ బాగానే ఉంది. పెద్ద భార్య కృతద్యుతికి తప్ప తామెవ్వరికీ సంతానం లేదని, చిత్రకేతువు మిగిలిన భార్యలంతా దుఃఖించసాగారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: