28, జనవరి 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*271 వ రోజు*


*యుద్ధారంభం*


సూర్యోదయం కాగానే పాండవులు సేనాసమేతులై రణముకు బయలుదేరారు. సేనకు ముందు భాగంలో శిఖండిని నిలిపారు. ఇరువైపులా భీమార్జునులను, వెనుక వైపు అభిమన్యిని, ద్రౌపదీ పుత్రులను, వారికి ఇరువైపులా చేకితానుడు, సాత్యకి వారి వెనుక ధృష్టద్యుమ్నుడు మొదలగు పాంచాలకుమారులను నిలిపారు. నకుల సహదేవులను ఇరివైపులా నిలువగా ధర్మరాజు వీరందరిని పరిరక్షిస్తూ విరాటరాజు, ద్రుపదుడు మొదలగు రాజులు, కేకయరాజులు, ధృష్టద్యుమ్నుడు మొహరిస్తున్నారు. భేరి తూర్య నాదములు మిన్నంటగా యుద్ధం ఆరంభం అయింది. ఇరుపక్షాలు తీవ్రంగా పోరాడుతూ దేవదానవ యుద్ధాన్ని తలపింపి చేస్తుంది. నకుల సహదేవులు చెలరేగి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. భీమార్జునులు కౌరవ సేనను ఊచకోత కోస్తున్నారు. మోత్తం పాండవసేన విజృంభించి కౌరవ సేనను ధ్వంశం చేయ సాగింది. ఇది చూసిన భీష్ముడు కల్పాంతంలో విజృంభించిన రుద్రిడిలా పాండవ సేనపై శరవర్షం కురిపిస్తున్నాడు. రధాశ్వములు, గజములు, కాలబలం నేల కూలుతూ ఉన్నాయి. శిఖండి భీష్మునిపై మూడు బాణములు వేసాడు. భీష్ముడు " నిన్ను బ్రహ్మ స్త్రీగా సృంష్టించాడు. నీవు మధ్యలో పురుషత్వం పొందావు. నీవు నా మీద శరవర్షం కురిపించినా నేను నీ మీద కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతోనే నిలబడతాను కాని నీతో యుద్ధం చేయను " అన్నాడు. అది విన్న శిఖండి " భీష్మా ! ఎంతో మంది రాజులను గెలిచావు. పరశురామునితో పోరి నిలిచావు. నీ శౌర్యం నాకు చూపవా ! నీవు నాతో యుద్ధం చేయకున్నా నేను మాత్రం నిన్ను వదలను క్రూరశరములు వేసి నిన్ను చంపుతాను. నేను ఎవరైతే ఎందుకు నాతో యుద్ధం చెయ్యి " అని కవ్వించాడు శిఖండి. ఇది చూసిన అర్జునుడు " నేడు శిఖండి వైఖరి వింతగా ఉంది. భీష్ముడు పడిపోవుటకు సమయం ఆసన్నమైనట్లు కనపడుతుంది. అందుకే దైవ ప్రేరితుడై శిఖండి ఇలా ప్రవర్తిస్తున్నాడు " అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు " శిఖండీ ! ఇన్ని మాటలాడి ఊరకున్న లోకం నిన్ను చూసి నవ్వుతుంది. నీ వెనుక నేను ఉన్నాను నిర్భయంగా భీష్ముని మీద నీ వాడి శరములు వేసి హతమార్చు " అన్నాడు. కాని గాంగేయుడు " అక్కడి నుండి తొలగి పోయి పాంచాల సైన్యమును తనుమాడుతున్నాడు. అర్జునుడు తన సైన్యముతో భీష్ముని ఎదుర్కొన్నాడు. అర్జునిని ధాటికి కౌరవ సేన నిలువలేక పారి పోయింది. సుయోధనుడు అది చూసి " పితామహా ! మీరు చూస్తుండగానే సేనలు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా " అన్నాడు. ఆ మాటలకు నొచ్చుకున్న భీష్ముడు " సుయోధనా నేను పది రోజులకు పది వేల మందిని చంపుతానని మాటిచ్చాను. పదివేల మందిని చంపి నీ రుణం తీర్చుకున్నాను. ఈ రోజు యుద్ధంలో నన్ను పాండవులో వారిని నేనో చంపడం తధ్యం. కాని నేను మానవమాతృడను వారు దైవాంశ సంభూతులు కనుక నా చేతిలో వారు మరణించుట అసాధ్యం అయినా నా శక్తి వంచన లేక యుద్ధం చేస్తాను " అని భీష్ముడు బదులిచ్చి తరువాత భీష్ముడు సైన్యమును వెంటబెట్టుకుని పాండవ సైన్యాలను నిర్మూలించ సాగాడు. భీష్మునికి సాయంగా నీ కుమారులు అక్కడ నిలిచి పోరాడుతున్నారు. ఇది చూసిన పాండవులు మత్స్య, పాంచాల, కేకయ, పాండ్య, యాదవ రాజులు తమ సైన్యాలతో వచ్చి ఒక్కుమ్మడిగా భీష్మునిపై లంఘించారు. సమరం సంకులమైంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: