13-19-గీతా మకరందము
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారికll ఇవ్విధముగ క్షేత్రక్షేత్రజ్ఞుల రెండిటినిగూర్చి తెలిపి, అట్టి విజ్ఞానమువలన కలుగు ఫలితమును వచించుచున్నారు-
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే.
తాత్పర్యము:- ఈ ప్రకారము క్షేత్రము, అట్లే జ్ఞానము, జ్ఞేయముకూడ సంక్షేపముగ చెప్పబడినవి. నా భక్తుడు (నాయందు భక్తిగలవాడు) వీనినెరింగి నాస్వరూపమును (మోక్షమును, భగవదైక్యమును) బొందుట కర్హుడగుచున్నాడు.
వ్యాఖ్య:- "మద్భక్త ఏతద్విజ్ఞాయ' - నాభక్తుడు దీనిని తెలిసికొని అనిచెప్పుట వలన భక్తుడు కానివాడు ఆ జ్ఞానాదుల నెఱుంగజాలడనియు, పైనదెల్పిన జ్ఞానజ్ఞేయాదుల నెఱుంగుటకు పూర్వము ప్రతివారున్ను భక్తుడు కావలసియున్నదనియు స్పష్టమగుచున్నది. భక్తియను పుష్పమునుండి జ్ఞానమనుఫల మావిర్భవించును. కావున ప్రప్రథమమున సర్వేశ్వరునిపై, సద్గురువులపై అచంచలభక్తి కలిగియుండి జపతపపూజసంకీర్తనాదులచే వారిని ఆరాధించువారికి వారు కరుణించి జ్ఞాన, జ్ఞేయముల నెఱుంగగల 'బుద్ధియోగము' నొసంగగలరు. తద్ద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్సాయుజ్యమునకు (‘మద్భావాయ') తగినవారగుచున్నారు. అట్లు కాక భగవద్భక్తిలేనిచో వారెంతటి గొప్పపండితులైనప్పటికిని, భౌతికవిజ్ఞాన కుశలత్వము గలిగియున్నప్పటికిని ఈశ్వరీయ విజ్ఞానము, జ్ఞేయతత్త్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. మరియు జనులు సామాన్యభక్తితో తృప్తిపడక, సాధనాతిశయముచే క్రమముగ జ్ఞాన, జ్ఞేయములను గూడ నెరిగి మోక్షార్హులు కావలసియున్నారనియు విదితమగుచున్నది.
మోక్షమును ఎవరు పొందగలరను ప్రశ్నకు భగవంతు డిచట సూటియైన సమాధానము నొసంగెను. ఈ జ్ఞానజ్ఞేయాది తత్త్వమును బాగుగ తెలిసికొనినవారే మోక్షార్హులని ఇచట వచింపబడినది. ఆ జ్ఞానాదులో భగవద్భక్తికలవారికే అబ్బుననియు తెలుపబడినది.
ప్రశ్న:- భగవత్సాయుజ్యమును (మోక్షమును) ఎవడు బొందగలడు?
ఉత్తరము:- జ్ఞానస్వరూపమును, జ్ఞేయస్వరూపమును బాగుగ తెలిసికొనినవాడు.
ప్రశ్న:- జ్ఞాన జ్ఞేయములను ఎవడు తెలిసికొనగలడు?
ఉత్తరము:- భగవద్భక్తికలవాడు మాత్రమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి