7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం -142*

 *తిరుమల సర్వస్వం -142*

 *అలిపిరి మార్గం-13*


*త్రోవ భాష్యకారుల సన్నిధి* 


 "మోకాళ్ళ పర్వతాన్ని" మోకాళ్ళతో అధిరోహించిన వారిలో అగ్రగణ్యుడు శ్రీమద్రామానుజాచార్యుల వారు. ఆ విధంగా పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళకు గాయ మవ్వడంతో, మార్గమధ్యంలో కొంతసేపు విశ్రమించాడు. ఆ విషయం తెలియగానే తిరుమలలో నివసించే, వారి గురువుగారైన తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వార్ పరుగు పరుగున కొన్ని మెట్లు దిగివచ్చి, విశ్రాంతి తీసుకుంటున్న రామానుజాచార్యుల వారిని పరామర్శించి, కొండపైకి స్వాగతం పలికారు. వారు కొండపై నుంచి వస్తూ, కొన్ని ఆమ్రఫలాలను శ్రీవారి ప్రసాదంగా తెచ్చి రామానుజునుకి ప్రసాదించారు. వాటిని అత్యంత భక్తితో స్వీకరించిన రామానుజులవారు, ఉచ్ఛిష్టాన్ని (ఫలం తినగా మిగిలన మామిడి టెంకలు) అక్కడే వదిలివేశారు. కొన్నాళ్ళకు ఆ టెంకలు మొక్కలుగా మొలచి, వృక్షాలై తియ్యటి ఫలాలను ప్రసాదిస్తూ, బాటసారులకు నీడనిచ్చేవి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మామిడి చెట్లు కూడా, ఆ చెట్ల సంతతికి చెందినవే!


 ఆ విషయం తెలుసుకున్న తరువాతి తరాలవారు అక్కడ నమస్కార ముద్రలోనున్న రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో, ఆ ప్రదేశం *"భాష్యకార్ల సన్నిధి"* గా పేరు గాంచింది. కొండకు వెళ్ళే త్రోవలో ఉండటం వల్ల దీన్ని *"త్రోవ భాష్యకార్ల సన్నిధి"* గా కూడా పిలుస్తారు. ఈ మధ్యకాలంలో అక్కడ, 3,260వ మెట్టు వద్ద, రామానుజుల వారికి దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ సన్నిధికి ఎదురుగా ఉన్న శిలపై పాదపద్మాలు చెక్కబడి ఉన్నాయి.

అవి రామానుజులవారు పూజించుకునే *"శ్రీవారి పాదాలు"* అని కొందరు, *"రామానుజుల వారి పాదాలు"* అని మరికొందరు భావిస్తారు.

‌‌ *అమ్మవారి సారె పెట్టెలు*  


 రామానుజుల వారికి నమస్కరించుకుని మరికొన్ని మెట్లెక్కగానే మనకు కుడిప్రక్కగా 3302వ మెట్టుపై; నాలుగు భుజాలతో కోణాలతో తీర్చిదిద్దినట్లున్న, చారలు కలిగిన, పూర్వకాలంలో ఉపయోగించుకునే *"కావడిపెట్టలు (40– 50 ఏళ్ళ క్రితం మనం ఉపయోగించుకున్న ట్రంకు పెట్టెలు)"* లేదా *"భోషాణం పెట్టెల"* ఆకారంలో కొన్ని రాతి శిలలు అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. వీటికి సంబంధించి, ఆసక్తికరమైన కథనాలున్నాయి:


 *ఒక కథనం ప్రకారం:*


 సీతారామలక్ష్మణులు వనవాసానికి వెడలుతున్నప్పుడు కైకేయి, ఏడువారాల నగలు తనతో తోడ్కొని వెళ్ళటానికి సీతమ్మవారిని అనుమతించింది. ఆ నగల పెట్టెలను సీతమ్మవారు వనవాస సమయంలో ఇక్కడ భద్రపరచగా, సీతమ్మవారు వాటిని తిరిగి తీసుకోక పోవడంతో అవే కాలాంతరంలో శిలలుగా మారాయి. అయితే, సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో తిరుమల క్షేత్రానికి వచ్చినట్లు ఏ రామాయణ కావ్యంలోనూ ఉటంకించక పోవటంవల్ల ఈ కథనం సందేహాస్పద మనిపిస్తుంది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: