🙏పోతన --భాగవతము 🙏
రెండవ భాగం
ఎవ్వని భద్ర గుణములు వర్ణించలేక బ్రహ్మాదులు ఆతని అనంతుడని, అనంత పద్మనాభుడనీ కీర్తింతురో అట్టి శ్రీ భూనీలా సమేత శ్రీమన్నారాయణుని వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించి పరవశించే గాథలున్న గ్రంథం - భక్త పోతన భాగవతం
ఎవ్వాని పదాంబుజ చారు రజో వితానము(పాదపద్మపరాగము, పాద ధూళిని) తమ కిరీటములందు అలంకరించుకొని బ్రహ్మరుద్రాదులు గర్వముతో పరవశించిపోవుదురో అటువంటి శ్రీమహావిష్ణువు, శ్రీహరి పాదారవిందముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించే మహా కావ్యం - భాగవతం
ఏ దేవు పదయుగంబు ఏప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మికమల ఎవ్వాని పాదకమలంబు సేవించు కౌతుకమున కమలాదేవి సుకుమారంగా ఒత్తినంతనే కమలనాభుడైన శ్రీహరి పాదకమలములు కందిపోతున్నాయని విలవిల్లాడిపోయే మహా భక్తుల భాధలు వివరించి, అటువంటి అతి సౌకుమార్యమైన శ్రీమన్నారాయణుని పాదపద్మముల వైభవాన్ని గురించి అదే సమయమున భక్త జనులను కరుణించి రక్షింప యుగయుగముల తరబడి వజ్ర సదృశమైన పాదములతో వేంకటాచలపతియై, విఠలుడై నిలబడినట్టి అట్టి శ్రీహరి, శ్రీకృష్ణుని శ్రీచరణముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించునట్టి మహా కావ్యం - భాగవతం
ఏ దేవదేవుని పాదపద్మములు దర్శింప, మునులు యుగయుగముల తరబడి తపింతురో ఏ దేవదేవుని పాదకమలములు వీక్షింప,జనులు కల్పముల తరబడి కలవరింతురో అటువంటి శ్రీహరి శ్రీచరణముల వైభవాన్ని పరిపూర్ణంగా కీర్తించే మహా కావ్యం - భాగవతం
బ్రహ్మ ఎవ్వాని పాదములు కడుగంగ జలములు ఆకాశగంగలై, ఆ విశ్వాత్ము కీర్తి ప్రభలై, ఆ విష్ణు దేవుని పదనదీ జలములై, సమస్త తీర్థ సారములై, లోక పావన జలములై గగనసీమలలో ప్రవహించిన గాథలు తెలిపే గ్రంథం - భాగవతం
బ్రహ్మ ఎవ్వాని పాదములు కడుగంగ జలములందు మునుగంగ గౌరీశుండు ఉత్సాహపడి శిరమున దాల్చగా పరవశాన శిరసున గంగ ధరకు జారెనా శివగంగ అన్నట్లుగా ఎవ్వాని పదనదీ జలములు శిరస్సున దాల్చగా పరమశివుడు ఆ రీతిగా పరవశించెనో ఆ విష్ణు దేవుని పాదపద్మముల నుండి ఉద్భవించిన ఆకాశగంగ జలముల వైభవాన్ని వర్ణించే గాథలు తెలిపే గ్రంథం - భాగవతం
భగవంతుణ్ని పట్టి తీసుకురాగలిగిన మహా గ్రంథం భాగవత గ్రంథం భగవంతుణ్ని నిలబెట్టగలిగిన మహా గ్రంథం
శ్రీమన్నారాయణుని, శ్రీ మహావిష్ణువుని, భక్తులు తమ భక్తి పాశాలతో కట్టివేసిన భక్తుల గాథలు తెలిపే గ్రంథం
ఇందీవరున్ని ఇటుక మీద నిలబెట్టగలిగిన మహాభక్తుల గాథలు తెలిపే గ్రంథం
యశోదాదేవి వాత్సల్య భక్తికి లొంగి ,పొంగి శ్రీ కృష్ణపరమాత్మ రోటికి కట్టివేయబడిన లీలలు తెలిపే గ్రంథం - భాగవతం
ముక్తినిచ్చె ముకుందున్ని నిలబెట్టగలిగిన గ్రంథం
నన్ను రక్షించకుండ నిన్ను పోనిచ్చెదనా సీతారామా అని నిలదీసిన భక్తుల గాథలు తెలిపే గ్రంథం
శ్రీమన్నారాయణుని భక్తుల గాథల భక్తి సముద్రం-భాగవతం
నారాయణా అని ఆర్తితో పిలిచిన భక్తుల పిలుపులు సమస్త బ్రహ్మాండాలు నిండి, ఆ వైకుంఠ వరదుని, వరాలు వరదలా కుమ్మరించే ఆ వరదరాజుని కదిలించి తీసుకువచ్చిన మహా భక్తుల గాథలు తెలిపే గ్రంథం
పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థాలసారం అని తెలిపే గ్రంథం
పరమ భాగవతులైన హరిదాసుల పాదాలు కడిగిన జలాలు నింపుకున్న అరచేతుల్లో అమృతం ఉంటుందని తెలిపే గ్రంథం
పరమాత్ముడైన హరిపట్టపురాణి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఇవ్వగలిగిన గ్రంథం
హరి భక్తులతో మాటలు ధర నెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అని తెలిపిన గ్రంథం
అచ్చమే దేవుని నారాయణ నామమే గతి చచ్చేటి వారికి, సన్యాసము వారికి అని తెలిపే గ్రంథం
పరమ పురుషుడు గోపాల బాలుడై వచ్చి, గోవులు కాసిన లీలలు తెలిపే గ్రంథం - భాగవతం
రామ భక్తిని పోతపోస్తే వచ్చిన పోతన్న రచించిన మహా గ్రంథం భాగవతం
కృష్ణ భక్తిని కణ కణంలో నింపుకున్న పోతన్న రాసిన మహా గ్రంథం
తన నర నరాల్లో నారాయణున్ని, నారసింహుని నింపుకున్న పోతన రాసిన మహా కావ్యం
గుండెల నిండా గోవిందున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
తన శ్వాస శ్వాసలో శ్రీనివాసున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
తన మనస్సు నిండా మాధవుణ్ణి నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
తన రోమ రోమాల నిండా రామున్ని నింపుకున్న పోతన రాసిన మహా గ్రంథం
ఇలలో మరియు కలలో కూడా ఆ కమలనాథుని,కమలాపతి స్మృతులే నింపుకున్న పోతన్న రాసిన మహా గ్రంథం - భాగవతం
చిత్త శుద్ధి, చిత్త శాంతి, మనశ్శాంతి, ఆత్మ శాంతి ప్రసాదించగలిగిన గ్రంథం
మరణ భయం తొలగించగలిగిన గ్రంథం
ధర్మబద్దమైన కోరికలు తీర్చగలిగిన గ్రంథం
గొప్ప రక్షణ ప్రసాదించే గ్రంథం - భక్త పోతన్న భాగవతం
భాగవతంలోని మరికొన్ని పద్యాలు చూద్దాము తరిద్దాము
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా;
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై;
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నాపరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ;
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ;
బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు,
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
భావము:- భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశ మైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి;
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి;
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు;
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి;
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి, మహోత్తరునకు,
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు..
భావము:- భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన ఙ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రఙ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.
యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొండెఱుఁగక స
ద్యోగవిభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.
భావము:- యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
సర్వాగమామ్నాయ జలధికి, నపవర్గ;
మయునికి, నుత్తమ మందిరునకు,
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ;
దనయంత రాజిల్లు ధన్యమతికి,
గుణలయోద్దీపిత గురు మానసునకు, సం;
వర్తితకర్మనిర్వర్తితునకు,
దిశలేని నా బోఁటి పశువుల పాపంబు;
లడఁచువానికి, సమస్తాంతరాత్ముఁ
డైవెలుంగువాని, కచ్ఛిన్నునకు, భగ
వంతునకుఁ, దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు..
షడ్గుణైశ్వర్యములు 1మహాత్మ్యము 2ధైర్యము 3యశస్సు 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము
భావము:- పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూప మైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయ మైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మ యై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.
వరథర్మకామార్థ వర్జితకాములై;
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు? ;
రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక;
భద్రచరిత్రంబుఁ బాడుచుందు?
రామహేశు, నాద్యు, నవ్యక్తు, నధ్యాత్మ
యోగగమ్యుఁ, బూర్ణు, నున్నతాత్ము,
బ్రహ్మమయిన వానిఁ, బరుని, నతీంద్రియు,
నీశు, స్థూలు, సూక్ష్ము నేభజింతు.
భావము:- ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర మైన చరిత్రను కోరికలేమి లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహా దేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ ఙ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతమైనవాడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అట్టువంటి ఆ పరాత్పరుని నేను సేవ చేయుదును.
పావకుండర్చుల, భానుండు దీప్తుల;
నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు
రాక్రియ నాత్మకరావళిచేత బ్ర;
హ్మాదుల, వేల్పుల, నఖిలజంతు
గణముల, జగముల, ఘన నామ రూప భే;
దములతో మెఱయించి తగ నడంచు,
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన;
యై,గుణ సంప్రవాహంబు నెఱపు,
స్త్రీనపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
భావము:- అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.
కలఁడందురు దీనుల యెడఁ,
గలఁడందురు పరమయోగి గణముల పాలం,
గలఁడందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
భావము:- దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నాకడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
భావము:- నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నేభజియింతున్."
భావము:- ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.
"లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవేతప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే!యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
భావము:- దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు
హరియశస్సుదాబ్ది (హరికీర్తి అనే పాలసముద్రం) నుండి ఎగిసిన పాల తుంపరలే ఆకాశములో మెరసే తారలు అని హరికీర్తి వైభవాన్ని, హరిభక్తులైన ధ్రువ తారల కీర్తి వైభవాన్ని అనంతంగా వర్ణించే మహా కావ్యం - భక్త పోతన భాగవతం
తెలుగు వారందరికీ నిత్య పారాయణ గ్రంథం - భాగవతం
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి