*మూర్తీభవించిన దత్త స్వరూపం..*
"మీ గురించి లోకం ఏమని అనుకుంటున్నదో ఒక్కసారన్నా పట్టించుకున్నారా?..ఎవడో దారినపొయ్యే దిగంబరుణ్ణి "స్వామీ..స్వామీ.." అనుకుంటూ పిచ్చి లో పడ్డారని..మీ మొహాన ఆ మాయగాడు ఏదో మత్తు మందు చల్లాడనీ..లంకెబిందెలు అప్పనంగా మీకు దొరుకుతాయని మీరిద్దరూ అతని చుట్టూ భజన చేస్తున్నారని లోకం కోడై కూస్తున్నది..ఇప్పటికైనా నా మాట వినండి..వాడి మాయలో పడకండి.." అంటూ ఆ వచ్చినావిడ మా తల్లిదండ్రులకు శతవిధాలా నూరిపోస్తున్నది..మా అమ్మా నాన్న శాంతంగా వున్నారు..ఇంత ఉపోద్ఘాతామూ ఎందుకంటే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారిని మా అమ్మానాన్న సాక్షాత్తూ దత్తావతారంగా నమ్మి..ఆయనకు ఆశ్రయం కల్పించే ఆలోచనలో ఉన్నందుకు ఆరోజుల్లో మా బంధువుల్లో ఏర్పడిన అభిప్రాయం తెలియచేసేటందుకు..
శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసుకునే రోజుల్లో మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లే మా తల్లిదండ్రులని నేను పదే పదే చెప్పనక్కరలేదు..పాఠకులకు ఆ విషయం తెలుసు..) పరిచయం అయిన క్షణం నుంచే ..స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదనీ..ఒకానొక సిద్ధపురుషుడో..లేక ఆ త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడో..ఈ రూపంలో అవతరించాడనీ..ప్రఘాడంగా విశ్వసించారు..క్రమంగా శ్రీ స్వామివారితో వీళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడటం..స్వామివారు తన తపోసాధనకు ఆశ్రమం అవసరమని తలచి..అందుకు కావాల్సిన భూమిని మా తల్లిదండ్రులను అడగటం..వారూ సంతోషంగా స్వామివారు కోరినంత భూమిని విరాళంగా ఇవ్వడం..అందులోనే శ్రీ స్వామివారి ఆదేశం మేరకు శ్రీ మీరాశెట్టి గారు ఆశ్రమం నిర్మించి ఇవ్వడం వంటి పరిణామాలు జరిగిపోయాయి..
శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణానికి ముందుగా కొద్దిరోజుల పాటు మా ఇంట్లో విడిది చేసిన విషయం పాఠకులకు గుర్తు వుండే ఉంటుంది..సరిగ్గా ఆ సమయం లోనే..మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన మా బంధువుల ఆవిడ పై విధంగా వ్యాఖ్యానించింది..ఆవిడ మా ఇంటికి రాత్రికి వచ్చే ఆఖరి బస్సులో వచ్చింది..ఆ సమయానికి స్వామివారు తాను ఉంటున్న గది లోకి వెళ్లి ధ్యానం చేసుకోసాగారు..అందువల్ల స్వామివారిని చూసే అవకాశం ఆవిడకు కలుగలేదు..కానీ తాను అనదల్చుకున్న మాటలన్నింటినీ..ఆ రాత్రివేళే..తాను నిద్ర పోకుండా..మా అమ్మానాన్న లను నిద్ర పోనివ్వకుండా..మళ్లీ తానెక్కడ మర్చిపోతానో అన్నట్లుగా గబ గబా చెప్పేసింది..
"అమ్మా..నువ్వు ఇంక పడుకో..మేమూ పడుకుంటాము..రేపుదయం పెందలాడే లేచి పనులు చేసుకోవాలి.." అని మా నాన్నగారు కొద్దిగా విసుగ్గా చెప్పిన తరువాత ఆవిడ నిద్ర పోయారు..
ఉదయం నాలుగు గంటల వేళ..శ్రీస్వామివారు గది నుంచి బైటకు వచ్చారు..గది ముందున్న పారిజాతం చెట్టు వద్ద పది నిమిషాలు నిలబడ్డారు..శీతాకాలంలో పారిజాత పుష్పాలు బాగా పూస్తాయి..పైగా వెన్నెల రోజులు..ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి..మెల్లిగా నడుచుకుంటూ ఆవరణ అంతా తిరుగసాగారు..మొగలిచెర్ల లోని మా ఇంటి వద్ద స్వామివారు ఉన్న ఇరవై రోజుల్లో..కనీసం పది పన్నెండు సార్లు ఈ దృశ్యాన్ని మా అమ్మా నాన్న గార్లతో పాటు పిల్లలం మేమూ చూసివున్నాము..స్వామివారు మా ఇంటి ఆవరణలో తిరిగే సమయం లో ఏదో ఒక స్తోత్రాన్ని..అది విష్ణు సహస్రనామం కావొచ్చు..లలితా సహస్ర నామాలు కావొచ్చు..మధురమైన కంఠంతో ఆలపిస్తూ తిరిగేవారు..అదొక అద్భుత స్వరం..మళ్లీ మళ్లీ వినాలనిపించే గాత్రం..ఆ ప్రభాత వేళ..ఒకరకమైన భక్తి భావం తరంగాల్లా మా యింటి ఆవరణ అంతా వ్యాపించి పోయేది..
అలా స్వామివారు ఆవరణ అంతా తిరిగి తన గదికి పోయేముందు..మా ఇంటి ముందు నిలబడ్డారు..అప్పటికి చీకట్లు తొలగి..వెలుతురు మెల్లిగా వస్తోంది...సరిగ్గా ఆసమయం లోనే..రాత్రి వచ్చినావిడ నిద్ర లేచి..బావి వద్దకు వెళ్లాలని..బైటకు వచ్చింది..స్వామివారు ఎదురుగ్గా నిలబడి వున్నారు..ఆయన ముఖం చిరునవ్వు తో ఉంది..దిగంబరంగా తన కెదురుగ్గా నిలబడి ఉన్న స్వామివారిని చూసినావిడ..ఒక్కక్షణం నిర్ఘాంత పోయింది..అప్రయత్నంగా చేతులు రెండూ జోడించి నమస్కారం చేసింది..ఒక్కసారి కూలబడి నట్లు..నేలమీద కూర్చుని..తన చేతులతో స్వామివారి పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకున్నది.."స్వామీ..స్వామీ.." అనే రెండక్షరాల పదం తప్ప మరో మాట మాట్లాడలేకుండా ఉన్నది..స్వామివారు తన కుడిచేతిని ఆమె నెత్తిన పెట్టి.."పెద్దదానివి అయ్యావు..దైవాన్ని తలుచుకో..నామ జపం చెయ్యి.." అని చెప్పి..వెనక్కు తిరిగి తన గది కి వెళ్లిపోయారు..
మరో రెండు నిమిషాలకు ఆవిడ తెరుకున్నది..వెంటనే మా అమ్మ దగ్గరకు పరుగులాంటి నడకతో వచ్చి.."ప్రభావతీ..స్వామివారు నా నెత్తిన చెయ్యి పెట్టి నామ జపం చేసుకో అని చెప్పారు..మహానుభావుడి దర్శనం పొద్దునే అయింది..గొప్ప యోగి పుంగవుడు మీ ఇంట్లో కాలుమోపాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యం..నా నోటికొచ్చినట్లు వాగాను..తప్పు తల్లీ..మీ నమ్మకమే నిజం..ఆయన దిగంబరుడు కాదమ్మా..సాక్షాత్తూ దత్తాత్రేయుడే..నాకు అలానే కనిపించాడు..దత్తస్వరూపమే మీ ఇంట్లో ఉంది.." అని కన్నీళ్ల పర్యంతం అవుతూ చెప్పింది..
ముందురోజు రాత్రి ఆవిడ మాట్లాడిన మాటలకు..అత్యంత సులభంగా స్వామివారు తానెవరో ఆమెకు నిరూపించి..ఆవిడ వాచాలత్వాన్ని శాశ్వతంగా ఆపడమే కాకుండా..ఆవిడకు మోక్ష మార్గాన్ని కూడా చూపారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా ఆవిడ మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి సమాధి వద్ద నిలబడి..తన నెత్తిమీద చేయిపెట్టి..స్వామివారు చెప్పిన మాటలను మననం చేసుకునేది..ఆవిడ జీవించి ఉన్నంత కాలమూ స్వామివారిని తలుచుకుంటూనే ఉండేది..స్వామివారి నే స్మరిస్తూ తన అరవయ్యో ఏట పరమపదించారు ఆవిడ..ద్వేషం నిండిన మనసులో భక్తిని స్థిరపరచారు స్వామివారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి