🌹🌹🌹🌷🌷🌹🌹🌹
28 ఏప్రిల్ 1963 నాటి పత్రికలో దాశరథి రంగాచార్యకు విశ్వనాథ సన్మానం అనే వార్త ... ఆ తరువాత సభ విశేషాలు:
.... "వాడున్నాడు చూడు, దాశరథి, వాడు నీకు అన్నయ్యా, తమ్ముడా?" అడిగారు విశ్వనాథ.
"అగ్రజులండీ"
"వాడి వలన నువ్వేమన్నా ఎక్లిప్స్ అవుతున్నావా?"
"గురువుగారూ, నాకు ప్రతిభ మీద విశ్వాసం. ప్రతిభకు గ్రహణం ఉంటుందనుకోను!"
"ఎందుకడిగానంటే, నా తమ్ముడు వెంకటేశ్వర్లు నాకన్నా ప్రతిభావంతుడు. నా వలన రాణించలేకపోతున్నాడు!"
ఇంతలో సభ ప్రారంభమయింది. మంచి వెన్నెల. లైట్లు లేవు. మైకు కూడా లేదు.
విశ్వనాథవారు అధ్యక్షత వహించారు. నేను రామాయణము గురించి గంటన్నర ఉపన్యసించాను. రాముని వాల్మీకి నరునిగానే చెప్పాడు అన్నాను. వాల్మీకే లేకుంటే రాముడు ఉండేవాడు కాదన్నాను.
విశ్వనాథవారు ఉపన్యాసం ప్రారంభించారు. నా గుండె దడదడలాడింది.
"రంగాచార్యులు చెప్పిన వాటిలో దేనితోనూ నేను ఏకీభవించను. రామునిది భగవదవతారము. ఆయన కరుణా కటాక్షము వల్లనే వాల్మీకి రామాయణము రచించ గలిగాడని నమ్ముతాను నేను. మా ఉభయులవి భిన్న దృక్పథములు. అయినాను రంగాచార్యుల ఆలోచనా విధానము వంటిది అవసరమని నాకు తోచుచున్నది" అనడముతో సభలో చప్పట్లు మారుమ్రోగాయి. విశ్వనాథవారు 90 నిముషాలు రామాయణం మీద మాట్లాడారు. ఎక్కడా నన్ను నిరసించలేదు. పైగా అశీర్వదించారు.
అనంతరం ఆయన నాకు శాలువా కప్పి సన్మానించారు. అది నా అదృష్టం. అప్పుడు విశ్వనాథవారు నన్ను కౌగిలించుకున్నారు. చెవిలో మెల్లగా అడిగారు - "రంగాచార్యులూ, నీకు రామాయణం అర్థం అయిందా?"
"ఏమీ అర్థం కాలేదు గురువుగారూ!"
"దానిమీద ముఫ్ఫై యేళ్ళు యేడిచిన ముండావాడిని, నాకే అర్థం కాలేదు. నీకేమి అర్థం అవుతుంది" అంటూ నన్ను భుజం మీద చెయ్యి వేసి మెట్లు దింపారు.
అవి నాకు అమృత ఘడియలు. విశ్వనాథ ఆకాశమంత ఎత్తై కనిపించారు.
నేను వారికి పాదాభివందనము చేశాను. వారు నన్ను లేవనెత్తారు. కారులో కూర్చుండబెట్టారు. మా ఇంటిని పావనము చేశారు. మా కమలను, పిల్లలను ఆశీర్వదించారు.
ఆయనకి జ్ఞానపీఠ ప్రకటన జరిగిన నాడు నేను హైదరాబాదు ఆకాశవాణిలో ఉన్నాను. పన్యాల రంగనాథ రావు పరుగెత్తుకుని వచ్చి పొంగిపోతూ చెప్పాడు "గురువుగారికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది, నేనే ఆ వార్త చదువుతాను"
"గురువుగారికి జ్ఞానపీఠ పురస్కారం అక్కరలేదు. అయినా అది తెలుగువారికి గర్వకారణం" అన్నాను.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ పురస్కారం వలనగాని, పీవీ నరసింహ రావు గారి వేయిపడగల అనువాదం వలనగానీ అమరులు కారు.
"జయన్తితే సుకృతినో
రససిధ్ధా: కవీశ్వరా:
నాస్తి తేషాం యశః కాయే
జరామరణజం భయం!"
[దాశరథి రంగాచార్యులవారి "అక్షర మందాకిని" నుండి]
సేకరణ: వాట్సాప్ సందేశం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి