20, మే 2021, గురువారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఆచారవ్యవహారాల పై వివరణ..*


*(ముప్పై మూడవ రోజు)*


శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారితో విపరీతమైన అనుబంధం ఏర్పడింది..ఆ దంపతుల ఇంట్లో రమారమి 21 రోజుల పాటు శ్రీ స్వామివారు బస చేశారు..ఎన్నో బోధలు చేశారు..అలాగే శ్రీధరరావు గారి తల్లిగారు సత్యనారాయణమ్మ గారికి కూడా శ్రీ స్వామివారి పై అచంచల విశ్వాసం కుదిరింది..రోజూ శ్రీ స్వామివారు చెపుతున్న విషయాలకు ఆవిడగారు విపరీతంగా ఆనందపడేవారు.."నాయనా!..నువ్వు ఇక్కడికి రాకపోతే..నాకెవరు ఇన్ని సంగతులు చెపుతారు?.." అనేవారు వాత్సల్యంతో..


"అమ్మా..మృత్యువు పెద్దపులిలా పొంచివుంది..ఎప్పుడూ రామనామం జపిస్తూ వుండు!.." అని చెప్పారు శ్రీ స్వామివారు..శ్రీధరరావు దంపతులతో కూడా అదే మాట చెప్పారు ఆవిడ గురించి..ఎక్కువ సమయం లేదని కూడా అన్నారు..


ఈలోపల ప్రభావతి గారు బహిష్టు అయ్యారు..ఇప్పుడు ఆ ఇంట్లో సమస్య వచ్చి పడింది..శ్రీ స్వామివారికి ఏర్పాట్లు, వంట ఎలా జరగాలి?..ఆయన యోగి..సిద్ధ పురుషుడు..అలాంటి వారికి మైల తో కూడిన ఆహారం పంపకూడదు..శ్రీధరరావు గారు కూడా మధనపడుతూ.. నేరుగా శ్రీ స్వామివారిని కలిసి..సమస్య చెప్పి.."మీకు అపవిత్రత జరుగుతుందేమో..మిమ్మల్ని ఈ నాలుగు రోజులూ మాలకొండలో ఉండేవిధంగా ఏర్పాటు చేస్తాను..ఐదవ రోజు ప్రభావతి స్నానం అయ్యాక..మిమ్మల్ని మరలా ఇక్కడికి పిలిపిస్తాను..కొద్దిగా సహకరించండి.." అన్నారు ప్రాధేయపూర్వకంగా..


శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు.."అమ్మ ఎక్కడుంది?.." అన్నారు..


"పెరట్లో కూర్చుని ఉంది..అక్కడే భోజనం చేస్తుంది..అక్కడే పడుకుంటుంది..మీకేమీ ఇబ్బంది ఉండదు..ఈపూటకు మీ స్నానానికి నీళ్లు అవీ పని వాళ్ళ చేత నేను పెట్టిస్తాను.." అన్నారు..


"అమ్మ దగ్గరకు పోదాం పదండి.." అంటూ శ్రీధరరావు గారిని వెంటపెట్టుకుని..ప్రభావతి గారున్న చోటికి వచ్చారు..కూర్చుని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్టు లేచి నిలుచున్నారు..


"అమ్మా!..నెలసరి అయితే..మీ పనులు మీరు చేసుకోకుండా..నాకేదో అపవిత్రం జరుగుతుందని..చాటుగా వెళ్లి కూర్చున్నావా?..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..నీవు స్వయంగా నా పనులు చేయవద్దు..ఈ సమయంలో అది మంచి నిర్ణయం..కానీ నీవు నాకుఎదురుపడినా..నీవు సహజంగా చేసుకునే ఇంటిపనులు చేసుకుంటున్నా..నాకు అపవిత్రం అని ఎవరన్నారు?..నీకెవరు చెప్పారు?..ముందు ఇంట్లోకి వెళ్లి..నీవు చేసుకునే అన్ని పనులూ చేసుకో..ముందుగా మీకు ఈ అజ్ఞానం వదిలించాలి.."అన్నారు నవ్వుతూనే..


శ్రీధరరావు గారు..ఆయన వెనుకాల ప్రభావతి గారూ..వారిద్దరి కంటే ముందు శ్రీ స్వామివారు..ఇంట్లోకి వచ్చారు..అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చుని వున్నారు..ఆవిడ కూడా శ్రీ స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమో నని భయపడుతూ వున్నారు..


ముందుగా వస్తున్న శ్రీ స్వామివారిని చూసి.."అమ్మాయి దూరంగా వుంది నాయనా!.." అని చెప్పబోతున్నారు..శ్రీ స్వామివారు చేయెత్తి ఆవిడను వారించి.."అమ్మా!..ఆ విషయాలే చెబుదామని వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఇక్కడకు వచ్చానమ్మా.." అన్నారు..


శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని..కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు..కళ్ళు తెరచి..ఆ ముగ్గురిని నిశితంగా చూసారు..ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది..ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు..ధ్యానముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు..


"అమ్మా!..అందరూ శ్రద్ధగా వినండి.." అంటూ..మొదలుపెట్టారు..


ఋతుక్రమం..ఊర్ధ్వ అధో లోకాలు..అజ్ఞాన నివృత్తి..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: