23, జూన్ 2021, బుధవారం

*మోక్ష మార్గాలు.... (మొదటి భాగం)*

 *మోక్ష మార్గాలు.... (మొదటి భాగం)*


 *జ్ఞాన మార్గము..*

 

శుద్ధ బ్రహ్మాన్ని జ్ఞానం తో తెలుసుకోవడం తప్ప మరొక విధంగా  తెలుసుకో లేము.  ఇంద్రియా లను, మనసును, లోపలి వైపుకు తిప్పి మన లోపలి ఆత్మను ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత మన లోపలి ఆత్మ యే పరమాత్మ అని   తెలుసుకోవాలి. 


పరమానందయ్య శిష్యుల హాస్య కథ ఒకటి ఉంది. 10 మంది శిష్యులను ఏదో పని మీద గురువు గారు పక్క ఊరికి పంపిస్తారు. మధ్యలో ఏరు దాటే టప్పుడు చేతులు చేతులు పట్టుకొని దాటండి లేకపోతే మీలో ఎవరైనా ఏటిలో కొట్టుకుపోతే కష్టము అని చెప్పి పంపారట గురువుగారు. ఏరు దాటిన తర్వాత శిష్యులందరూ సరిగ్గా చేరామా లేదా అని చూసుకుంటారు. ప్రతివాడు మిగిలిన తొమ్మిది మందిని లెక్క పెట్టి తొమ్మిది మందిమే ఉన్నాము పదో వాడు ఏట్లో కొట్టుకుపోయాడు అని ఏడవడం మొదలు పెట్టారట. దారిన పోయే వాళ్ళు వీళ్ళను చూసి విషయం తెలుసుకుని వాళ్ళ చేత సరిగా లెక్కపెట్టించి, వాళ్ళల్లో ప్రతి వాడికీ ఆ తప్పి పోయిన పదో వాడివి నువ్వే అని చెప్పి వాళ్ళ దిగులు తీరుస్తారు.  అక్కడితో ఆ కథ అయిపోతుంది.


వేదాంతులు చెప్పేది కూడా ఇదే. ప్రతివాడు పరమాత్మ కోసం బయటంతా  వెతికి దొరకలేదని నిరాశ పడుతుంటారు. ఆ పదో వాడు మన లోపలనే ఉన్నాడు అని తెలుసుకోగలిగలగాలి.  దీనినే ఇంద్రియా లను, మనసును, లోపలి వైపుకు తిప్పడం అంటారు. అది జరిగేదాకా మనమందరము కూడా పరమానందయ్య శిష్యులమే.  పరమాత్మ ను బయట వెతుకుతూ ఉంటాము. పరమాత్మ లోపలే ఉన్నాడు అనే జ్ఞానాన్ని తర్కం ద్వారా వేదాంత విషయాలను నిరంతరం మననం చేయడం ద్వారా సాధించుకోవాలి. "బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో దేవో సనాతనః" అనేది జ్ఞానయోగం లో  ప్రధానమైన విషయము. 


కానీ పుస్తకాలు చదివి చదివి ఊరికనే నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అంటూ ఉండటం బ్రహ్మజ్ఞానం కాదు. రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇద్దరూ కూడా వారి శరీరాలను దూరంగా వదిలి పెట్టి తమ తమ చైతన్యంతో ఆ శరీరాలను చూసి ఓహో నేను వేరు ఈ శరీరం వేరు అని అనుభవం ద్వారా గ్రహించగలిగారు. అటువంటి అనుభూతి సాధించిన తర్వాతే పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దీన్ని అపరోక్షానుభూతి అంటారు. ఇది కేవలం పుస్తకాలు చదివితే రాదు. ముందు జ్ఞానం సంపాదించి దాన్ని అనుభవంలోకి లోకి తెచ్చుకోవాలి.


చాలామంది,  ఇందులో ఒక ఇబ్బంది ఉన్నది అంటారు. విషయం తెలుసుకుంటే గాని అనుభవం రాదు అనుభవిస్తేగానీ విషయం తెలియదు. పెళ్లి కుదరడం పిచ్చి కుదరడం సామెత లాగా అన్నమాట. నిజానికి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం వేరు నమ్మకం కలగడానికి అవసరమైన జ్ఞానం వేరు. అనుభవానికి  (ఆత్మసాక్షాత్కారానికి) ముందు ఉండేది అవసరమైన జ్ఞానం. అనుభవం తర్వాత వచ్చేది పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం. 


గురువుల మాట మీద ఉపనిషత్తుల మీద నమ్మకం ఉంచి సాధన చేస్తూ చేస్తూ చేస్తూ జీవితం గడపాలి. అలాగ గడిపే ఒక లక్ష మందిలో లేదా కోటి మందిలో ఒకరికి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. గురువులూ ఉపనిషత్తులూ పదేపదే చెప్పే ఇంకో మాట ఏమిటంటే జీవుడు సాధన చేస్తూ ఉంటే ఒక జన్మలో కాకున్నా కొన్ని జన్మల తర్వాతనైనా ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని. దీన్ని జ్ఞాన మార్గం అంటారు. భగవద్గీతలో సాంఖ్య యోగం అని చెప్పింది కూడా ఇదే. ఇది కాస్త కష్టమైన మార్గం. 



*పవని నాగ ప్రదీప్* 

.......

కామెంట్‌లు లేవు: