*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*985వ నామ మంత్రము* 31.8.2021
*ఓం అంబాయై నమః*
సకల జగత్తులకు మరియు గుణత్రయమునకు జనని అయిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అంబా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం అంబాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సర్వకాల సర్వావస్థలయందును కాపాడుచు వారికి సకల సంపదలు, శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును.
ఇంతకు ముందు నామములో (984వ నామమంత్రములో) జగన్మాతను *త్రిగుణా* యని స్తుతించాము. *సత్త్వరజస్తమో* గుణములు గలదిగా అమ్మవారిని ప్రస్తుతించాము. ఆ గుణములు కలిగియుండుట మాత్రమేగాక, అట్టి గుణములు వ్యక్తమగుటకు ఆ తల్లియే కారణము. గనుకనే అమ్మవారు *అంబా* (త్రిగుణాంబా) యని అనబడినది. సకలజగత్తులకు ఏవిధముగా జనని అయినదో, అలాగే గుణత్రయమునకు కూడా ఆ పరమేశ్వరి జనని.
సృష్ట్యాదియందు పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరి అవ్యక్తమై, తాను మాత్రమే యున్నది. అట్టి పరబ్రహ్మ తత్త్వం నుండి సత్త్వము, రజస్సు, తమస్సులనెడి త్రిగుణములతోగూడిన మూలప్రకృతి ఉద్భవించెను. ఆ మూలప్రకృతియందు ఏర్పడిన సంక్షోభకారణముగా మహత్తత్త్వము ఉత్పన్నమాయెను. దానినుండి సూత్రాత్ముడైన హిరణ్యగర్భుని ఉత్పత్తి జరిగెను. ఈ సూత్రాత్మ నుండి జీవులకు ఉపాధియగు (కార్యరూపమైన) అహంకారము, మనస్సు, ఇంద్రియములయొక్క అధిష్ఠానదేవతలు, ప్రాణములు, ఇంద్రియములు, అట్లే శబ్ధాది విషయములు ఉత్పన్నములయ్యెను. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ తత్త్వములన్నింటిలో ప్రవేశించెను. ఈ విధముగా అన్ని రూపములలోను అనంతశక్తి స్వరూపమైన ఆ పరమాత్మ మాత్రమే ప్రకాశించుచుండెను. గుణత్రయమునకు కారణభూతురాలు కనుకనే పరమేశ్వరి *అంబా* యని అనబడినది. ఈ విషయాన్ని మంత్రశాస్త్రములో మంత్రజీవమని చెప్పడం జరిగినది. తేజోమూర్తులకు, శక్తిమూర్తులకు, సకల జగత్తులకును కారణము గుణత్రయము. అటువంటి గుణత్రయమునకు కారణమైన పరమేశ్వరి *అంబా* (త్రిగుణాంబా) యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అంబాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి