31, ఆగస్టు 2021, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అంకమ్మ భక్తి..*


"అమ్మా..వయసురీత్యా పెద్దదానివి..ఇంటిపట్టున కూర్చొని కృష్ణా..రామా..అనుకోరాదూ..వారం మార్చి వారం బస్సెక్కి ఇంతదూరం రాకపోతే.." అని మా సిబ్బంది ఆమెతో హాస్యానికి అంటూ వుంటారు.."నాకేం ఇబ్బందీ లేదు..అన్నింటికీ ఆ దత్తాత్రేయుడే వున్నాడు..నాకే భయమూ లేదు..అన్నీ ఆ స్వామే చూసుకుంటాడు.." అని నిర్మలంగా నవ్వుతూ కందుకూరు నుంచి క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చే అంకమ్మ గారు తరచూ చెప్పే మాట ఇది..ఆమె విషయం లో అది నిజం కూడా..


శ్రీ స్వామివారు సిద్ధిపొందినది 1976 వ సంవత్సరం మే నెల 6వ తేదీ నాడు..ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంకమ్మ గారు మొదటిసారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వచ్చారు.."నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు జబ్బు చేసింది..అప్పట్లో ఇంత వైద్య సౌకర్యాలు లేవు..అప్పటికీ మా వాళ్ళు డాక్టర్ల కు చూపించారు కానీ పెద్దగా ప్రయోజనం కనబడలేదు..చుట్టుప్రక్కల వాళ్ళు ఈ స్వామి దగ్గరకు తీసుకెళ్లండి..ఏదైనా గాలి చేష్ట వున్నా బైట పడుతుంది..ఆరోగ్యం బాగు పడుతుందని చెపితే..ఇక్కడికి తీసుకొచ్చారయ్యా..మూడు వారాల్లోనే నేను మామూలు మనిషినయ్యాను..నువ్వు అప్పుడు ఇక్కడ లేవు..మీ నాన్నా..అమ్మా..నన్ను కన్నా బిడ్డలా చూసుకున్నారు..ఈ దత్తాత్రేయుడి దయ లేకుంటే..అప్పుడే నేను పోయేదాన్ని.." అని మొగలిచెర్ల శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ నాకు చెపుతూ వుంటారు..


ఆనాటి నుంచీ నేటి దాకా అంకమ్మగారు ఏ కష్టమొచ్చినా..సుఖం కలిగినా..నేరుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ఆ స్వామివారి సమాధి ముందు నిలబడి విన్నవించుకొంటారు..తన బిడ్డల వివాహాలు ఇక్కడే చేశారు..ఆ తరువాతి తరం వాళ్ల వివాహాలు కూడా ఇక్కడే చేశారు..అంకమ్మ గారితో పాటు ఆమె సంతానమూ.. వారి సంతానం కూడా శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..ఇప్పుడంటే వార్ధక్యం కారణంగా అంకమ్మ గారు కేవలం శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి పరిమితం అయ్యారు గానీ..అంతకుముందు ఆవిడ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సేవ చేస్తూనే ఉండేది..


పిల్లల కు చెప్పుకొని.. శ్రీ స్వామివారి మందిరం వద్ద..వచ్చి పోయే భక్తుల సౌకర్యం కోసం.. ఒక గది కూడా కట్టించారు..ప్రస్తుతం అంకమ్మ గారి వయసు సుమారు ఎనభై సంవత్సరాలు.. ఇప్పటికీ తన శక్తి కూడగట్టుకొని వారం మార్చి వారం (ఆదివారాల్లో) శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూనే వుంటారు..ఏనాడూ ఉత్త చేతులతో మందిరానికి రాదు..పళ్ళూ..కూరగాయలూ..బియ్యమో..ఏదో ఒకటి తీసుకొని వస్తారు..అంకమ్మ గారు శ్రీ స్వామివారిని దర్శించుకునే పద్దతి చిత్రంగా ఉంటుంది..ఆవిడ మందిరం లో గడిపే నాలుగైదు గంటల సమయంలో..కనీసం తొమ్మిది పది సార్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి వస్తుంటారు.."అయ్యా..అక్కడ ఖాళీగా ఉంది..భక్తులెవరూ లేరు..ఒక్కసారి స్వామి దాకా వెళ్ళొస్తా నాయనా.." అని ప్రాధేయపూర్వకంగా అడుగుతారు..మేమూ కాదని చెప్పము.. ఎందుకంటే..ఒక్కొక్కసారి భక్తుల తాకిడి ఎక్కువగా వున్నప్పుడు..ఆవిడే గమనించుకుని ఒక ప్రక్కగా నిలబడి వుంటారు తప్ప..వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళరు..తన పరిమితులు దాటి వేరే విధంగా ప్రవర్తించే అలవాటు లేని మనిషి అంకమ్మ గారు..


"మనకు కష్టమొచ్చినప్పుడే స్వామి దగ్గరకు వచ్చి..మనకు సుఖం కలిగితే అది మన గొప్ప అనుకోకూడదయ్యా.. ఏ కాలానికి ఏది మనకు ప్రాప్తమో దానిని అనుభవించాలి..ఇప్పటి వరకూ అన్ని విషయాల్లో ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని చల్లగానే చూసాడు..కష్టాలు లేకుండా ఎవ్వరి జీవితమూ ఉండదు..చిన్నదో పెద్దదో కష్టం వచ్చి తీరుతుంది..స్వామిని నమ్ముకుంటే..ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గిస్తాడు..నువ్వు చూపే విశ్వాసం..భక్తీ..ఆ రెండే ఆ స్వామి చూసేది..నీ దగ్గరున్న ధన రాశులు ఆయన చూడడు..ఆ స్వామి దయ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేను నేను..ఇట్లా తిరుగుతూ వున్నపుడే నాకు మరణం ప్రసాదించే వరమివ్వు నాయనా..అని కోరుకుంటానయ్యా నేను.." అంటూ ఎల్లప్పుడూ చెప్పుకుంటూ వుంటారు అంకమ్మ గారు..ఆవిడ మాటల్లో అంతర్లీనంగా వేదాంత ఛాయలు ఉంటాయి..శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు అంకమ్మ గారు ఏదో తెలియని ఆనందంతో పొంగిపోతూ వుంటారు..ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి..


అంకమ్మ గారు నిష్కల్మష భక్తి కి ప్రతిరూపంగా వుంటారు..ఆవిడ గారు చెప్పినట్టు భక్తీ విశ్వాసాలే ఆ భగవంతుడు చూస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: