31, ఆగస్టు 2021, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *31.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*4.1 (ప్రథమ శ్లోకము)*


*యాని యానీహ కర్మాణి యైర్యైః స్వచ్ఛందజన్మభిః|*


*చక్రే కరోతి కర్తా వా హరిస్తాని బ్రువంతు నః॥12301॥*


*నిమి మహారాజు నుడివెను* "యోగీశ్వరులారా! సర్వేశ్వరుడైన శ్రీహరి తనను ఉపాసించినవారి యొక్క భక్తిప్రపత్తులకు వశుడై, లోకకల్యాణార్థము తన ఇచ్ఛానుసారముగా అనేక అవతారములను దాల్చి, వివిధములైన అద్భుతలీలలను ప్రకటించుచుండును. ఇంతవరకును ఆ భగవంతుడు ప్రదర్శించిన లీలలను, ఇప్పుడు చేయుచున్నవాటిని, మున్ముందు నడుపబోవు మహత్కార్యములను గూర్చి వివరింపుడు.


*ద్రుమిల ఉవాచ*


*4.2 (రెండవ శ్లోకము)*


*యో వా అనంతస్య గుణాననంతాననుక్రమిష్యన్ స తు బాలబుద్ధిః|*


*రజాంసి భూమేర్గణయేత్కథంచిత్ కాలేన నైవాఖిలశక్తిధామ్నః॥12302॥*


*ఏడవయోగీశ్వరుడైన ద్రుమిళుడు ఇట్లు నుడివెను* "నిమి మహారాజా! భగవంతుడు అనంతుడు. ఆ స్వామి గుణములు అసంఖ్యాకములు. ఆ ప్రభువుయొక్క గుణములను యథాక్రమముగా పూర్తిగా లెక్కింప బూనుకొనుట మూర్ఖత్వమేయగును. ఏదోవిధముగా ఎంతకాలమునకైనను భూమికణములను లెక్కింప వచ్చునేమోగాని, సమస్తశక్తులకు ఆధారమైన ఆ సర్వేశ్వరుని గుణములను మాత్రము లెక్కించుట అసాధ్యము.


*4.3 (మూడవ శ్లోకము)*


*భూతైర్యదా పంచభిరాత్మసృష్టైః పురం విరాజం విరచయ్య తస్మిన్|*


*స్వాంశేన విష్టః పురుషాభిధానమవాప నారాయణ ఆదిదేవః॥11303॥*


ఆ పరమాత్మ తననుండి పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అనుపంచ మహాభూతములు మొదలగు చతుర్వింశతి తత్త్వములను తానే సృష్టించెను. వాటిద్వారా విరాడ్రూపమైన బ్రహ్మాండమును నిర్మించి, అందు తనయొక్క అంశతో అంతర్యామిరూపమున ప్రవేశించెను. అప్పుడు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు *పురుషుడు* అను పేరుతో ఖ్యాతి వహించెను. ఇది ఆ స్వామియొక్క మొదటీ అవతారము.


*4.4 (నాలుగవ శ్లోకము)*


*యత్కాయ ఏష భువనత్రయసన్నివేశో యస్యేంద్రియైస్తనుభృతాముభయేంద్రియాణి|*


*జ్ఞానం స్వతః శ్వసనతో బలమోజ ఈహా సత్త్వాదిభిః స్థితిలయోద్భవ ఆది కర్తా॥12304॥*


ఈ ముల్లోకములును ఆ పరమాత్ముని శరీరమే. ఆయనశక్తి కారణముననే దేహధారులైన సమస్తప్రాణుల యొక్క జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రూపొందినవి. ఆ స్వామియే ప్రాణులన్నింటిలో అంతర్యామి రూపమున స్థితుడైయున్నాడు. అందువలననే సకలజీవులలో జ్ఞానశక్తి, ప్రాణశక్తి ఏర్పడినవి. ఆ ప్రభువు యొక్క శక్తివలననే అందఱికిని శారీరకశక్తి, మానసికశక్తి, క్రియాశక్తి సమకూరినవి. ఆదికారణుడైన శ్రీమన్నారాయణుడు సత్త్వ, రజ, స్తమోగుణములద్వారా ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను జరుపుచుండును. ఇది ఆ పరమాత్ముని లీలావిలాసము.


*4.5 (ఐదవ శ్లోకము)*


*ఆదావభూచ్ఛతధృతీ రజసాస్య సర్గే విష్ణుః స్థితౌ క్రతుపతిర్ద్విజధర్మసేతుః|*


*రుద్రోఽప్యయాయ తమసా పురుషః స ఆద్య ఇత్యుద్భవస్థితిలయాః సతతం ప్రజాసు॥12305॥*


ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడే మొట్టమొదట రజోగుణముద్వారా బ్రహ్మరూపమున విశ్వమును సృజించెను. యజ్ఞములకు అధిపతియైన శ్రీహరి ద్విజులయొక్క వర్ణాశ్రమాను గుణధర్మములను నిలుపుటకై సత్త్వగుణముద్వారా విష్ణురూపమున విశ్వమును రక్షించుచుండును. ఆ ఆదిపురుషుడే రుద్రరూపమున తమోగుణముద్వారా విశ్వమును లయమొనర్చును. ఈ విధముగా ఈ విశ్వముయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు శ్రీమన్నారాయణుడే కారకుడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: