31, ఆగస్టు 2021, మంగళవారం

శాస్త్రము విధించిన అన్ని కర్మలను

 మానవుడు తనకు శాస్త్రము విధించిన అన్ని కర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. కాని ఆ కర్మలు చేసేటప్పుడు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి. ఆ ప్రకారంగా కర్మలు చేస్తే, నా అనుగ్రహము వలన తుదకు శాశ్వతమైన పరమ పదమును పొందుతాడు.


ఇప్పటి దాకా జ్ఞానము భక్తి గురించి చెప్పిన పరమాత్మ కర్మల గురించి కూడా చెబుతున్నాడు. ఇంతకు ముందు పరమాత్మ కర్మలు స్వధర్మనిష్టతో చేయాలి అని అన్నాడు. ఇప్పుడు ఆ స్వధర్మనిష్టకు భక్తి కూడా తోడవ్వాలి. భగవంతుని మీద భక్తి లేనిదే ఏ కర్మ కూడా సఫలం కాదు అని భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.


మానవుడు కర్మలు చేయక తప్పదు. ఏదో ఒక కర్మ చేయాలి. అందుకే మానవులు తమకు నిర్దేశించిన కర్మలను, స్వధర్మపరమయిన కర్మలను ఆచరిస్తూ కూడా, ఎల్లప్పుడూ పరమాత్మయందు మనసును లగ్నం చేసి, పరమాత్మయందు భక్తి కలిగి ఉండాలి. భక్తితో కూడిన కర్మ మాత్రమే కర్మయోగము అవుతుంది. కేవలం యాంత్రికంగా చేసే కర్మలు, శుష్క, కర్మలు అవుతాయి కానీ కర్మయోగము అనిపించుకోవు. అందుకే ఇక్కడ రెండు నిబంధనలు పెట్టారు. ఒకటి ఏ పని చేసినా పరమాత్మను ఆశ్రయించుకొని చేయాలి. పరమాత్మ పరంగా చేయాలి. కరృత్వభావన లేకుండా చేయాలి. ఫలితం ఆశించకుండా చేయాలి. అందుకే మద్వ్యపాశయ: అన్నారు.


తరువాత మత్ ప్రసాదాత్ అంటే నా అనుగ్రహం కూడా ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది. ఆయనను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు. కాబట్టి భగవంతుని ఆశ్రయించడం, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం ముఖ్యం. అప్పుడు అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ బంధనములు అంటవు. సుఖదు:ఖములు ఉండవు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా లోపల భగవన్నామ స్మరణ చేస్తుంటాడు. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. పరమాత్మలో ఐక్యం అవుతాడు. కాబట్టి ఏ కర్మ చేసినా దైవమును స్మరించుకుంటూ చేయాలి. కర్మలను కర్మఫలములను ఈశ్వరార్పణ చేయాలి. ఏ పని సఫలం కావాలన్నా దానికి భగవంతుని అనుగ్రహం తప్పదు. మనకు ఏది లభించినా దానిని భగవంతుని ప్రసాదంగానే భావించాలి కానీ అంతా నా మహిమ వలననే జరిగింది అనుకోవడం అజ్ఞానం.


కాబట్టి ఏ కర్మ చేసినా భగవంతుని తల్చుకుంటూ, భగవంతుని పరంగా చేస్తూ, దాని వలన వచ్చే ఫలితాలను భగవంతునికి అర్పిస్తే, ఎల్లప్పుడూ పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటే, ఆ కర్మలు, కర్మలు చేయగా వచ్చిన కర్మఫలములు అతనిని బంధించవు. అటువంటి వాడికి శాశ్వతమైన, ఎప్పటికీ నాశనము లేని, పరమ పదము అంటే మోక్షము లభిస్తుంది.

.

 #హరేకృష్ణ #కృష్ణంవందేజగద్గురుం #భగవద్గీత #k

కామెంట్‌లు లేవు: