31, ఆగస్టు 2021, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*402వ నామ మంత్రము* 31.8.2021


*ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః*


విద్య (జ్ఞానము, ఏకత్వం), అవిద్య (అజ్ఞానం, నానాత్వ భావము) - ఈ రెండిటి స్వరూపమై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలీ *విద్యాఽవిద్యా స్వరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును, *ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి అజ్ఞానులకు జ్ఞానము, అద్యైతభావన, జ్ఞానులకు కైవల్యమును ప్రసాదించును.


'విద్యను, అవిద్యను తెలిసికొనినవాడు అవిద్యచే మృత్యువును తరించి, విద్యచే అమృతత్వమును, మోక్షమును పొందును' అని ఈశాన్యోపనిషత్తులో చెప్పబడినది. విద్య, అవిద్య అను రెండిటిని గ్రహించవలెను. అందుచే విద్యా, అవిద్యల స్వరూపమైన పరమేశ్వరిని ఉపాసించవలెను. విద్య అనగా స్వాత్మారూపజ్ఞానము అనియు, అవిద్య అనగా చరమవృత్తి జ్ఞానము అనియు అందురు. అనగా అద్వైతభావనతో తననే పరమాత్మగా తెలిసికొనుట విద్య అని చెప్పబడితే, జీవాత్మ, పరమాత్మలను వేరు వేరుగా చెప్పడమనేది అవిద్య. దేనిలో భేదవృత్తితో చరమవృత్తి రూపజ్ఞానము ఉండునో అది అవిద్య, దేనిలో వృత్తిరాహిత్యముతో ఆత్మైక్యానుభూతి కలుగునో అది విద్య. ఇటువంటి విద్య-అవిద్యల రెండిటి స్వరూపము తనదిగా విరాజిల్లుచున్నది పరమేశ్వరి గనుకనే ఆ తల్లి *విద్యాఽవిద్యా స్వరూపిణీ* యని అనబడినది.


విద్యాస్వరూపము తెలిసికొనిన జ్ఞాని ముక్తుడగును. అవిద్యారూపమును తెలిసినవాడు సంసారబంధమును పొందును. విద్యా-అవిద్యలు రెండూ అవసరమే ఎందుకంటే ఆ రెండు స్వరూపాలు కూడా పరమేశ్వరియే గనుక. విద్య-అవిద్యలు రెండూకూడా సమానంగానే ఉపాసన చేయవలసి ఉంటుంది. అవిద్య వల్ల శరీరాన్ని వదలి విద్యతో జన్మరాహిత్యం పొందవలెను. జ్ఞానం లేకుండా ఉపాసన చేయుట వలనగాని, ఉపాసన లేని జ్ఞానం వలన గాని సద్గతి లభించదు. విద్యను ఉపాసించడం వలన దేవలోకము, అవిద్య వలన పితృలోకము ప్రాప్తిస్తాయి. 'భ్రాంతి, విద్య, పరము అనునవి మూడును శివస్వరూపములు. వేరువేరుగా పదార్థములను తెలిసికొనుట భ్రాంతి, అంతయు ఆత్మస్వరూపముగా తెలిసికొనుట విద్య, వికల్పములులేని కేవల పరతత్త్వాకారము పొంది ఉండుట పరము' అని లింగపురాణమున గలదు. విద్య-అవిద్యలు పరమేశ్వరి స్వరూపాలు గనుక, ఆ తల్లి *విద్యాఽఅవిద్యా స్వరూపిణి* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విద్యాఽవిద్యాస్వరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: