నేడు శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం ఒకటే కాదు. మాయమ్మ యోగమాయ జన్మోత్సవం కూడా నేడే. కావున భక్తిశ్రద్ధలతో నేడు ఇరువురుని పూజిద్దాం.. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో శుభోదయం.
శ్రీకృష్ణ
కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.
కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.
శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.
శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం
ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే [1.3.28 ]
ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే.
కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే.
ధర్మ విరోధుల చేత లోకం వ్యాకులం చెందినపుడు. రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.
కొన్ని అవతారాలలో పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది.
శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు
ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం.
రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే.
మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది.
కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి