6, మార్చి 2022, ఆదివారం

సంతృప్తితో ఉండాలి

 *ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండాలి*


నాకింకా కావాలనే భావం దురాశవలన కలుగుతుంది. అది లేకపోవడమే సంతృప్తి. ఆరోజుకు, సందర్భానుసారంగా ఏది దొరికితే దానితో సంతృప్తి చెందాలి. రేపటి సంగతి భగవంతుడు చూసుకుంటాడు.


మన పూర్వీకులు ఎలా ఉండేవారు? దానికి సమాధానం ఒక శ్లోకంలో ఉంది. 

*यो मे गर्भगतस्यापि वृत्तिं कल्पितवास् प्रभुः* |

*शेष वृत्ति विधाने तु सुप्तः किन्नु मृतोधवा* ||

ఇప్పుడు నా బుద్దీ, నా శరీరమూ బాగా పనిచేస్తున్నాయి. కాని మాతృగర్భంలో ఉన్నప్పుడు నేను నిస్సహాయుడనుగా ఉండేవాణ్ణి. సరియైన బుద్ధిబలం కూడ లేదు. ఆ సమయంలో ఆహారం సంపాదించుకొనే సామర్థ్యం నాకు ఉండేదా? లేదు. అప్పుడు నన్ను రక్షించినవాడు భగవంతుడేకదా. ఇప్పుడు మాత్రం నేనెందుకు బాధపడాలి? అభగవంతుడు ఇప్పుడు నిద్ర పోతున్నాడా? అలాంటిదేమీ లేదు. అందుచేత నేను నా కర్తవ్యాన్ని చేస్తాను. నాయోగక్షేమం భగవంతుడే చూస్తాడు.


ఈరకమైన భావనతో ప్రతి ఒక్కరూ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఫలితాన్ని భగవంతుని మీద వదిలేసే దృక్పథం అలవరచుకోవాలి. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని తప్పక నిర్వహించాలి. సోమరితనం ఉన్నవానికి పరమేశ్వరుడు ఏమీ ఇవ్వడు. మనుష్యుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని త్రికరణశుద్దిగా చేస్తేనే భగవంతుడు తప్పక ప్రసన్నుడవుతాడు. అందువల్ల ఏ ఆశలేక కర్తవ్యపరాయణుడైన వాడే సంతృప్తితో ఉండగలుగుతాడు. తృప్తిగా ఉంటేనే జీవితంలో సుఖం అనుభవించగలుగుతాడు.


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు*

కామెంట్‌లు లేవు: