24, జనవరి 2023, మంగళవారం

*కాశీ ఖండం - 7*

 *కాశీ ఖండం - 7*


🎈🎈🎈🎈🎈🎈🎈🎈 


 యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం‘’ అనే మహాగ్రంధం నామాన్ని స్మరించేవారికి కూడా, పునర్జన్మ ఉండదు అని, విష్ణు దూతలు, శివశర్మకు చెప్పినట్లు, అగస్త్య ముని, లోపాముద్రకు, తెలియ జేశాడు. 


 అక్కడి నుండి విష్ణు దూతలు, శివశర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్య లోకానికి, తీసుకొని వెళ్లారు.  ఆ లోకాల వివరాలు తెలుసుకొందాం



 *అప్సరస, సూర్యలోక వర్ణన*



విష్ణు దూతలు, శివశర్మను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు .అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు, రసజ్ఞులు అయిన ఆడవారుంటారు.  సమస్త భాషలలో వారు కోవిదులు . క్షీరసాగర మధనంలో జన్మించినవారు.  మన్మధుని త్రిభువన విజయాస్త్రాలు వారే.


 ఊర్వశి, మేనక, రంభ, చంద్రలేఖ, తిలోత్తమ, వపుష్మతి, 

కాంతిమతి, లీలావతి, ఉత్పలావతి, అలంబుష, గుణవతి, స్థూలకేశి, కళావతి, కళానిధి, గుణనిధి, కర్పూరతిలక, ఉర్వార, అనంగతిలక, మదన మోహిని, చకోరాక్షి, చంద్రకళ, ముని మనోహర,  గవద్రావ, 

తపోద్వేష్టి, చారునాన, సుకర్ణిక, దారు సంజీవని, సుశ్రీ, క్రమ శుల్క, శుభానన, తపస్శుల్క, హిమావతి, పంచాశ్వమేదిక, రాజసూయార్ధిని, అష్టాగ్ని హోమిక, వాజపేయ శతోద్భవ, మొదలైనవారు అప్సరస గణం. వీరి సంఖ్య 6,000.  


 ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు. వీరంతా లావణ్యంతో, నిత్య యవ్వనంతో, దివ్యామ్బరాలతో ఉంటారు. వీరందరూ స్వైరుణులు, సుసంపన్నులు. కోరిక తీర్చే వ్రతాలు చేసి, ఉద్యాపనాలు చేసినవారు. అప్సరసలోకానికి చేరుకొంటారు. వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు. వీరిని దేవ వేశ్యలని అంటారు. సూర్యసంక్రమణం నాడు దానం చేసిన వారు, ’’మొదాత్‘’ అనే మంత్రాన్ని అనుష్టించి, దానాలిచ్చిన వారు, ఇక్కడికి చేరుకొంటారు. 


 తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివశర్మ . సూర్యలోకము తొమ్మిది యోజనాల విస్తీర్ణం కలది. విచిత్రాలైన ఏడు గుర్రాలు, ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధిగా, సూర్యుడు, నిత్య సంచారం చేస్తూంటాడు. క్షణకాలంలోనే ఆవిర్భావ, తిరోభావాలను పొందే సూర్యుడు, ప్రత్యక్ష వేద పురుషుడు. ఆదిత్యుడే సాక్షాత్తు బ్రహ్మ. సూర్యుని వల్లనే, సకల జీవరాశులు, ఆహారాన్ని సంపాదిoచు కొంటున్నాయి. ప్రత్యక్ష సాక్షి , కర్మసాక్షి.  గాయత్రీ మంత్రంతో సకాలంలో వదలబడిన అర్ఘ్యం నశించదు, అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది. సూర్యోపాసన చేసేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మిత్ర , పుత్ర, కళత్రాలు, అష్టవిధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి. 


 ఆష్టాదశ విద్యల్లో, మీమాంస గొప్పది. దాని కంటే తర్కం, దానికంటే పురాణం గొప్పవి.  వీటికంటే ధర్మ శాస్త్రం, వాటికంటే వేదాలు, వేదం కంటే ఉపనిషత్తులు, వీటికంటే గాయత్రీమంత్రం, గొప్పవి. అది ప్రణవ సంపుటి. గాయత్రి మంత్రం కంటే అధికమైన మంత్రం, మూడు లోకాలలోనూ లేదు. గాయత్రి వేదజనని. గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక, గాయత్రి అని పేరు. సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు, గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం. 


 గాయత్రి మంత్రం చేత, రాజర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి అయాడు. గాయత్రియే, విష్ణువు, శివుడు, బ్రహ్మా. అమ్శుమాలి అని పిలువబడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు. అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి.

 ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా. తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త. పడమర దిశలో సర్వతోముఖుడై, 

కనిపిస్తాడు. ఉత్తరాయణ, దక్షిణాయణ పుణ్యకాలాలలో, షడతీతుల్లో, విష్ణుపంచకంలో ఎవరు మహా దానం చేస్తారో, పితృక్రియలు నిర్వ హిస్తారో, వారు సూర్య సమాన తేజస్కులై , సూర్యలోకంలో  నివసిస్తారు. ఆదివారం, సూర్య గ్రహణం నాడు దానం చేస్తే, ఉత్తమ లోక ప్రాప్తి. 

హంసుడు, భానుడు, సహస్రాంశువు, తపనుడు, తాపనుడు, రవి, వికర్తనుడు వివశ్వంతుడు, విశ్వకర్మ, విభావనుడు, విశ్వ రూపుడు, విశ్వకర్త, మార్తాండుడు, మిహిరుడు, అంశుమంతుడు, ఆదిత్యుడు, ఉష్నగుడు, సూర్యుడు, ఆర్యముడు, బ్రద్నుడు, ద్వాదశాదిత్యుడు, సప్తహయుడు, భాస్కరుడు, ఆహస్కరుడు, ఖగుడు, శూరుడు,

ప్రభాకరుడు, శ్రీమంత్రుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోక సాక్షి, తమోరి,

శాశ్వతుడు, శుచి, గభస్తి, హస్తాంషుడు, తరణి,

సుమాహారిణి, ద్యుమణి,

హరిదాశ్వుడు, అర్కుడు,

భానుమంతుడు, భయనాశనుడు, చందోశ్వుడు, వేదవేద్యుడు, భాస్వంతుడు, పూషుడు, వృషాకపి, ఏక చక్రధరుడు, మిత్రుడు, మందేహారి, తమిశ్రఘ్నుడు, దైత్యఘ్నుడు, పాపహర్త, ధర్ముడు, ధర్మప్రకాశకుడు, హీళి, చిత్రభానుడు, కలిఘ్నుడు, తార్ష్యవాహనుడు, దిక్రుతి, పద్మినీనాభుడు, కుశేషయకారుడు, హరి, ఘర్మరశ్మి, దుర్నిరీక్షుడు, చందాంశువు, కశ్యపాత్మజుడు, అనే డెబ్బదిరెండు పేర్లుసూర్యునికి ఉన్నాయి. 


 ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ఉచ్చరిస్తూ, సూర్యుని చూస్తూ నమస్కరిస్తే, సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా, నిర్మల మైన జలాన్ని నింపి, మోకాళ్ళపైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు ,రక్త చందనం, గరిక, అక్షతలు ఆ పాత్రలో ఉంచి సూర్యుడిని ధ్యానిస్తూ, ఫాలభాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని, స్తిరచిత్తంతో, పైన చెప్పిన 72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ, సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చేవాడెప్పుడు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతాడు. వ్యాధులు నశిస్తాయి’’. అని శివశర్మకు, విష్ణుదూతలు వివరించారని, భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు.


 *కాశీఖండం సశేషం..*

🎈🎈🎈🎈🎈🎈🎈🎈

*🅰️🅿️SRINU*

కామెంట్‌లు లేవు: