సదాచార సంపన్నులు
శ్రీ గోపాల అయ్యర్ శ్రీమఠంలో పనిచేసేవారు. పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. దిండిగల్ దగ్గర్లోని సిరుమలైలో ఉన్న శ్రీమఠం తోట నుండి తిరిగొస్తూ 500 మలై రకం అరటిపళ్ళు పట్టుకొచ్చారు. వాటిని మహాస్వామి వారి ముందు పెట్టారు.
”ఈ పళ్ళు మన శ్రీమఠం ఎస్టేట్ లోనివి పెరియవ. మీకోసమనే వీటిని తీసుకుని వచ్చాను” అని చెప్పారు. మహాస్వామివారు మొత్తం పళ్ళంన్నింటిని ఒకసారి పరికించి కేవలం ఒక్క పండును మాత్రం తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారు.
అక్కడున్న భక్తులంతా ఆ పళ్ళను ప్రసాదంగా ఇస్తారు కాబోలు అని అనుకున్నారు. కాని మహాస్వామివారి ఆలోచనలు ఎవరికి అందనంత స్థాయిలో ఉంటాయి. పరమాచార్య స్వామివారు ఉంటున్న ప్రాంతం నుండి 300 అడుగుల దూరంలో ఒక కురవల (గ్రామాలు తిరిగే సంచారి జాతుల) శిబిరం ఉంది. వారికి నివసించడానికి ఒక ఇల్లు ఉండదు. చెట్ల నీడ క్రింద బ్రతుకుతుంటారు. అక్కడే తినడడం, పడుకోవడం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మహాస్వామివారు మేనేజరును పిలిచారు.
”చూడు, ఈ అరటిపళ్ళను అన్నింటిని తీసుకో. అలాగే అన్ని పళ్ళు, కొబ్బరికాయలు, కమలా పళ్ళు భక్తులు తెచ్చిన పళ్ళను అన్నింటిని తీసుకొని అక్కడున్న కురవలకు ఇచ్చెయ్” అని స్వామివారు ఆదేశించారు. అక్కడ నిలుచున్న భక్తులందరూ విస్మయం చెందారు. అప్పుడు శ్రీమఠంలోనే ఉంటున్న అనంతాననంత స్వామివారు పరమాచార్య స్వామిని, “ఏమిటి ఈ కొత్త పద్ధతి? పళ్ళన్నీ వారికి ఇవ్వాలా?” అని అడిగారు.
అందుకు మహాస్వామివారు పరమ ప్రశాంతంగా ఇలా చెప్పసాగారు. “మనమందరమూ మన సంస్కృతిని మార్చుకుని చక్కగా క్రాపు చేయించుకుని, పాంట్లు చొక్కాలు తొడుక్కుంటున్నాము. బయట ఎంగిలి హోటళ్లలో, టి కొట్లలో తినడం కూడా మొదలుపెట్టాము. అంటు, ముట్టు, మైల వదిలేసాము. ఇంకా కొందరు విదేశాలకు కూడా వెళ్తున్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తుడిచెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. కాని ఆ కురవలు ఇప్పటికి పేదలే. వాళ్ళని చూడు వారి ఆహార వేషభాషలు ఏవీ మారలేదు. క్రాపు చేయించుకోరు. తరతరాలుగా వారు పూసలు, పిన్నులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకరి సొమ్ము దొంగిలించరు. వాళ్ళ కులంలోనే వివాహాలు చేసుకుంటారు. మరుసటి రోజు గురించి వారికి దిగులు లేదు. అక్కడైనా సరే వండుకుని తిని పడుకుండిపోతారు. ఏవిధమైన రాజకీయాలకు కుట్రలకు దిగరు. స్వార్థము, చెడ్డ బుద్ధి ఎరుగరు. ఆరోజుకు కావలసిన సరుకు మాత్ర6 కొనుక్కుని మరుసటి రోజుకు ఏదీ దాచుకోకుండా జీవనం సాగిస్తారు. పాతకాలంలో ఋషులు, మునుల వంటి జివనం సాసిఅతూ, నిజమైన సనాతన సంస్కృతిని ఖచ్చితంగా పాటిస్తున్నది వారే”
పరమాచార్య స్వామివారు సనాతన ధర్మం నశించిపోతోందని ఉద్ఘాటించి, ఒక చిన్న సమూహం దాన్ని ఎలా నిలబెడుతోందో చెప్పారు. ఇది మహాస్వామివారి గొప్పతనం. ఎవరూ ఇష్టపడని ఆ కురవ జాతిలోని మంచితనాన్ని స్వామివారు గుర్తించారు. మహాస్వామివారు ఆ గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు ఆ కురవలు కూడా వీడ్కోలు పలకడానికి వచ్చారు. స్వామివారు వారినందరిని ఆశీర్వదించి పంపారు.
--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి