14, జనవరి 2023, శనివారం

అల్లం ముక్క

 వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ


దోరగా వేగిన పెసరట్టు కొరికితే -  జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ


మిర్చిబజ్జి ఆబగా తినబోతే -  నాలిక సుర్రుమన్నట్టూ


పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ


పచ్చి మిరపకాయలు తగిలించి -  రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ


మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ


పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ


దిబ్బరొట్టె మొత్తం - 

నేనే తినేసినట్టూ


వేపచెట్టు కింద మడతమంచమెక్కి - 

చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ


చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ


పప్పుచారులో గిన్నెడు -  చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు


రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ


కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ


చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ


నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ


పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ


చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ


సావిట్లో గేదెలతో పోటీపడి -  తేగలు తెగ తినేసినట్టూ


దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ


తిరుపతి లడ్డూ మొత్తం -  అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ


పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ


పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ


టమాటా పప్పుకి తోడు -  ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ


మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ


బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు


వేడి వేడి బెల్లం జిలేబీ , 

రోడ్ మీద కొనీ కొనగానే - 

కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు


బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు -  ఒలుచుకు తిన్నట్టూ


లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ -  స్టార్ బక్స్ లో దొరికినట్టూ


బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు -  పటపటమని నమిలేసినట్టూ


అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు -  తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ


సినిమా హాల్ లో పాప్కార్న్ -  ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ


చిన్నా పెద్దా తేడాలేకుండా -  రసాలు గుటకలేసినట్టూ


కొబ్బరి బూరెల కోసం చేసిన -  చలివిడి కొట్టేసి తిన్నట్టూ


బిడ్డనెత్తుకొచ్చిన సారెలో -  పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ


కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ


మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ


కిస్మిస్ లని -  కేజీల్లో మాయం చేసేసినట్టూ


దోర జాంకాయాలు  చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని -  పరపరా నమిలేసి తిన్నట్టూ


సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు -  ఘుప్పుమన్నట్టూ


వానాకాలంలో పకోడీల వాసన -  గాలిలో తేలి వచ్చినట్టూ


తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ


పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ


పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ


దోరగా పండిన చింతకాయ -  చిటుక్కున చేతికి అందినట్టూ


పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ


చిన్నుసిరికాయల చెట్టు -  స్కూలుకెళ్ళే దారిలో  కొమ్మజాపి రమ్మన్నట్టూ


ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ


వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ


కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ


మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ


సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ


ఎర్రని సీమతుమ్మకాయలు -  కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ


గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ


వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ


విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ 


బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ


వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 


వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ


భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని -  పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ


ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ


పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ


ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ


గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు


పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ


దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ


ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ


కమ్మని కలలు కంటూ మాంచిగా నిద్రలో  ఉంటే,  కుళ్ళుమోతు అలారం  పీడకలొచ్చినట్టు  మోగిచచ్చింది!


ఇదంతా ఎందుకంటే .....


ఈ రోజుల్లో ఇవిదొరకటం,దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!😍😍

నిజమైతే బాగుంటుందనిపించే కల😇😍

కామెంట్‌లు లేవు: