🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 114*
'ఇంకా ముడివెయ్యబడని శిఖతో' జడలు విరబోసుకున్న దెయ్యంలా అడుగులు వేసుకుంటూ వచ్చాడు చాణక్యుడు. రాక్షసుడు విభ్రాంతితో ఆర్యుని ముఖంలోకి చూశాడు. ఆర్యుని ముఖమండలం ప్రశాంతంగా, భావరహితంగా గోచరిస్తోంది.
"చెప్పు... రాక్షసా...! ఆ మార్పులేవో నువ్వే చెయ్యవచ్చుగదా....?" రెట్టించాడు చాణక్యుడు గంభీరంగా.
"నేనా .... ?" తెల్లబోయాడు రాక్షసామాత్యుడు.
"అవును... నువ్వే.... రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేసే అధికారం మహామాత్యులకే ఉంటుంది... మగధకి నువ్వేగదా, మహామంత్రివి...."
"నేనా.... మహామంత్రినా ...." విస్తుబోయాడు రాక్షసుడు.
"మరి.... నేనా ....?" రెట్టిస్తూ చాణక్యుడు ఫక్కున నవ్వి "మహామాత్య పదవినించి నిన్ను ఎవరైనా తొలగించారా ? లేదే ... ? పోనీ నువ్వు నీ పదవికి రాజీనామా సమర్పించావా ? అదీ లేదే... ? నువ్వు ఏదో కారణం చేత కొంతకాలం పాటు నీ విధులకు దూరమైతే పరిపాలనా సంక్షోభం సంభవించకూడదని అనధికారికంగా విధులకు ఈ బాధ్యత నేను స్వీకరించాను. అనధికార అధికారులు పెత్తనం చెలాయించడం ఎంత చేటో నా అర్థశాస్త్రంలో భాష్యం చెప్పాను కూడా ! ఇకనైనా నీ బాధ్యతను నువ్వు స్వీకరించి నన్ను బంధ విముక్తిడిని చేస్తే సంతోషిస్తాను" అని చెప్పాడు.
ఆర్యుని మాటల్లోనే అంతర్యాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ "చచ్చిన పాముని ఇంకా చంపుతున్నావా చాణక్యా....? అన్నాడు రాక్షసుడు పశ్చాత్తాపంతో.
"లేదు. ధర్మానికి సరియైన, సరికొత్త నిర్వచనం చెబుతున్నాను. నందులు అధర్మవర్తనులని, సింహాసనార్హత వాళ్లకు లేదని తెలిసీ వాగ్దానధర్మానికి కట్టుబడి ఇంత చేశావు నువ్వు. అపాత్రులకి ఇచ్చిన 'వాగ్దానధర్మం' విస్మరించి అయినా ధర్మవర్తునులకు అండగా ఉండాలని, అదే అసలు సిసలు ధర్మమని ప్రతిపాదించాను నేను... అపాత్రదానం చెయ్యకూడదని నువ్వు నమ్మిన ధర్మశాస్త్రాలే ఘోషిస్తున్నాయి. మగధ సామ్రాజ్యాధిపతులైన మహానందుల వారిని వంచించి, వెన్నుపోటు పొడిచిన మహాపద్ముడూ, మహానందుల వారి మృతికి కారకులైన నందులు ఏ ధర్మాననుసరించి సింహాసనానికి అర్హులయ్యారు ? మహానందుల వారి రక్తం పంచుకు పుట్టినవాడూ, ధర్మనిరతుడూ, సర్వసమర్ధుడూ, సుక్షత్రీయుడూ అయిన చంద్రగుప్తుడు ఏ ధర్మశాస్త్రాననుసరించి సింహాసనానికి అనర్హుడని నువ్వు భావించావు ? ఆలోచించు... నువ్వే ఆలోచించు...." అన్నాడు చాణక్యుడు గంభీరంగా.
రాక్షసమాత్యునికి సర్వం అవగతమైంది. అతని కన్నులలో కన్నీళ్లు గిర్రునతిరిగాయి. పశ్చాతాపంతో చాణక్యుని చేతులు పట్టుకుని "ఆచార్య ! నీకున్నంతపాటి దూరదృష్టి, విశాలహృదయం నాకు లేకపోయింది. నన్ను క్షమించు, నేను ఓడిపోయాను" అన్నాడు గద్గదస్వరంతో.
చాణక్యుడు ఆతని భుజం తట్టి "ఇందులో గెలుపోటముల ప్రసక్తే లేదు. అర్షధర్మ పరిరక్షణకే నేనింత నాటకం ఆడాను. సువిశాల హిందూ సామ్రాజ్య స్థాపన జరిగి చంద్రగుప్తుని పాలనలో, నీ అమాత్యత్వ మార్గదర్శనంలో, నా అర్థశాస్త్ర ఫలాలను ఈ భారతజాతి అనుభవించుట కన్న నాకు కావలసినదేమీ లేదు. సత్వరమే నీ అమాత్య పదవిని మరల స్వీకరించి మీ మిత్రుడు చందనదాసును కాపాడుకో... ఆలస్యమైతే నా శిష్యులు అతనిని ఉరికంభమెక్కించక మానరు" అని చెప్పాడు నవ్వుతూ.
"ఆ...! ఈ తలారులు మీ శిష్యులా...!?" నివ్వెరపోయాడు రాక్షసామాత్యుడు.
చాణక్యుడు నవ్వి "ఆహా ! నిన్ను నట్టేటముంచిన జీవసిద్ధి కూడా నా శిష్యుడే, పేరు ఇందుశర్మ .... ఈ నాటకములన్నీ నిన్ను కల్మషరహితుడిగా మార్చి భావి మౌర్య మహాసామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా చేయుటకొరకే..." అని చెప్పాడు.
"ఇప్పుడు నిజంగా నీకు తలవంచుతున్నాను చాణక్యా... సర్వమత హితము కోరి హైందవ సామ్రాజ్యస్థాపనే ధ్యేయంగా... నిందలను, అవమానాలనూ లెక్కచేయక... ధర్మపరిరక్షణమే లక్ష్యంగా భావించిన నీ సువిశాల హృదయానికీ, ఆ హృదయంలో నాకింత చోటిచ్చిన నీ వాత్సల్యానికి ఇప్పుడు మనస్ఫూర్తిగా తలవంచుతున్నాను... మన స్నేహానికి గుర్తుగా... ఆనాడు ధర్మశాలలో ప్రతిజ్ఞా సందర్భాన విడివడిన నీ శిఖను... ఈ శుభతరుణాన.... నీ ప్రతిజ్ఞా పాలనమునకు గుర్తుగా నేను... నేను ముడివేస్తాను..." అని రాక్షసామాత్యుడు స్వయంగా, స్వహస్తాలతో చాణక్యుని శిఖని మడచి ముడివేశాడు.
చాణక్యుని సమక్షంలో నిండు పేరోలగంలో మౌర్య సామ్రాజ్య పరిరక్షణకు తన జీవితాంతము వరకూ పాటుపడతానని ప్రకటించాడు రాక్షసామాత్యుడు. రాక్షసుని అభ్యర్థన మేరకు మలయకేతుని చెర నుంచి విడుదల చేసి అతనిని తన సామంతునిగా చేసుకొని గౌరవించాడు చంద్రగుప్తుడు.
చంద్రగుప్త - రాక్షసులకు రాజ్యాంగ బాధ్యతలు వదిలిపెట్టి తన నివాసానికి పరిమితమయ్యాడు ఆర్యుడు. ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ తన జీవిత లక్ష్యాలలో ఒకటైన "కామసూత్రాలు" గ్రంథరచనము ఉపక్రమించాడు.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి