నిత్యావ్వేషణ:
వ్యాసుడు జన్మించిన నాడే గురుపౌర్ణిమ చేసుకోవడం వెనుక విశేషం ఏమిటి? హిందూ మతంలో ఎందరో మహర్షులు ఉండగా వ్యాసునికే ఈ గౌరవం ఎందుకని?
ఎందుకంటే వ్యాసుడి స్థాయి మిగతవారికంటే ఎక్కువ కాబట్టి..!
వ్యాసుడు జన్మించినది ద్వాపరయుగంలో.! అయితే వ్యాస జననం ప్రతీ కల్పంలో జరుగుతూనే ఉంది. వ్యాసుడు ఒకవ్యక్తి కాదు, అదొక స్థానం అనీ ప్రస్తుత వ్యాస స్థానంలో ఉన్నది కృష్ణ ద్వైపాయనుడు 28వ వారు అనీ ఒకమాట పండిత ముఖతః వస్తూ ఉంటుంది.
వ్యాసుడికి ఉన్న గొప్పతనం చూద్దాం.!!!
మన భూమిమీద కొన్నివేల మంది మహర్షులు సత్య దర్శనం చేసారు. వారు దర్శించినవి ముందు తరాలకు అందించారు. అయితే అవన్నీ ఒక స్థాయి వరకు మనిషిని చేర్చేట్లుగా ఉన్నాయి తప్ప మనిషిని అంతిమదర్శనం ఏది ఉందో అవి చేయించలేకపోయాయి. (అయితే ఆ ఋషులు వారి దర్శనం ద్వారా జీవన్ముక్తులు ఐనారు అనేది ఇంకో విషయం.)
అయితే వ్యాసుల వారు చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యం. మొత్తం రాశీభూతంగా ఉన్న వేదాన్ని విభజితం చేసి అవి తమ శిష్యుల ద్వారా లోకానికి అందించారు. కల్పాల యందు జరిగిన సంఘటనలను ఒక్కదగ్గర చేర్చి సనాతన ధర్మ వైభవాన్ని పురాణాల రచన ద్వారా సుప్రతిష్ఠితం చేశారు.
ఈనాడు మనం ఆచరిస్తున్న సర్వవిధములైన పూజా విధులను, కలాపాలను అందించినది, ఆగమోక్త దేవతామూర్తులకు సంబంధించిన సమస్త స్తోత్ర, పూజా వాఙ్మయం మనకు అందించినదీ, సమగ్ర హోమ, యాగ క్రియలను వివిధ పురాణాల ద్వారా మనకు అందించినది ఆ మహనీయుడే.!
ధర్మగ్రంథమైన భారతమును, భగవత్కథ, విశ్వ రహస్యాలకు ఆలవాలమైన భాగవతమును మోక్షవిద్యగా మనకు అందించారు.
ఇవన్నీ ఒకెత్తు, ఋషులందరూ చెప్పిన, వారు దర్శించిన సత్యములు అన్నీ కలిసేది అన్నింటికీ పరిపూర్ణత ఏర్పడేది ఉపనిషత్ ప్రతిపాదితమైన పరబ్రహ్మమును తెలుసుకోవటం వల్లనే.! కాబట్టి వేదముల చివర ఉండే సర్వ ఉపనిషత్తుల సారాన్ని ఒకచోట చేర్చి బ్రహ్మసూత్రాలను రచించి లోకానికి అందించారు.
ఆ బ్రహ్మసూత్రాలకే ఆది శంకరులు భాష్యమును రచించారు, వ్యాసులవారు వాటిని ఆమోదించారు.
ఇప్పుడు నేను తెలిపిన విషయాలు అతి స్వల్పమైనవి, వ్యాస వైభవాన్ని చెప్పే శక్తి నాకులేదు.
ఇన్ని కారణాల వలన వ్యాస పౌర్ణమి అనగా వ్యాసజన్మదినం అత్యంత ప్రశస్తమైనది, దీనినే ప్రస్తుతం గురు పౌర్ణమి అని వ్యవహరిస్తున్నారు. కానీ నేటి రోజున వ్యాసుడిని విడిచి కనీసం గురు పరంపర కూడా లేని వాళ్ళను గురుపౌర్ణమి రోజు పూజిస్తున్నారు. అది వ్యాసుడికి చేస్తున్న ద్రోహమే.!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి