12, జులై 2023, బుధవారం

వివేక హీనుని పతనములు

                    వివేక హీనుని  పతనములు !


             శా:  ఆకాశంబున  నుండి  శంభుని  శిరం , బందుండి  శీతాద్రి ,  సు


                    శ్లోకంబైన  హిమాద్రి  నుండి  భువి ,  భూలోకంబు నందుండి  య


                    స్తోకాంభోధి ,  పయోధినుడి  పవనాంధో లోకముం జేరె, గం


                     గా కూలంకష ,  పెక్కు  భంగులు ,  వివేక భ్రష్ట    సంపాతముల్;


                             భర్తృహరి సుభాషితములు:  ఏనుఁగు లక్ష్మణ కవి;

             


           కఠిన పదములకు అర్ధము:- శీతాద్రి-హిమాలయము; సుశ్లోకము:చక్కగా మెచ్చుకొనే; అస్తోక: అంతులేని; అంబోధి-సముద్రము;

           పవనాంధోలోకము: పాతాళము; కూలంకష:నది; వివేక భ్రష్టులు: తెలివి లేనివారు; సంపాతముల్: పతనములు;


             భావము:  గంగా  భవాని  మొదట స్వర్గలోకంలో  (ఆకాశంలో ) మందాకినీ యనుపేరుతో

పిలువ బడుతూ ఉండేది. అదికాస్తా భగీరధునిప్రార్ధనకు లొంగి  క్రిందకు జారటం మొదలు పెట్టింది. మొదట శివుని శిరస్సు మీదకు జారింది. అక్కడినుండి  హిమాలయాలమీదకు , అటనుండి భూలోకానికీ  అక్కడ నుండి సముద్రం లోకి,  సముద్రమునుండి పాతాళానికి  జారిపోయింది.


                      ఎక్కడో  ఊర్ధ్వ లోకమైన  స్వర్గంలో   ( ఆకాశంలో)   ఉండే గంగ  అక్కడ నుండి  దిగటం  మొదలు పెట్టి  చివరకు అధోలోకమైన  పాతాళానికి   జారిపోయింది. తెలివి లేని  మూర్ఖుల  పతనములు  గూడా యిలాగే  ఉంటాయి. అందుచేత వివేకంతో

పనులు చేసికుంటూ  తనస్థానాన్ని  తాను కాపాడుకోవాలి! అని  మనకు  సందేశం!


                       గంగా నది పతనం  మనకు నిదర్శనం కాబట్టి "  నిదర్శనాలంకారం!


                                                    స్వస్తి!

కామెంట్‌లు లేవు: