బాధ్యత - బరువు
శ్రీవారికి 1938 ప్రాంతాలలో కాశీయాత్ర ముగించి వచ్చినప్పటి నుండి పీఠబాధ్యతల నుండి వైదొలగి ఏ చెట్టునీడలోనో, గోపురపు ఛాయలలోనో జీవిస్తూ పరివారపు కట్టడిలేని స్వేచ్ఛా జీవనాన్ని గడపాలని ఉండేది. శిష్యస్వామికై ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆదిశంకరుల అభిప్రాయం వీరు బహుకాలం పీఠంలో ఉండి ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలన్నది కావచ్చు. 1954 దాకా శిష్యస్వామివారు దొరకలేదు. యాభైయేళ్ళ పీఠాధిపత్య నిర్వహణానంతరం 1957లో మఠ బాధ్యతలన్నీ చట్టపూర్వకంగా శిష్యస్వామివారికి ఈయబడినాయి. అయితే అత్యంత గురుభక్తితో శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారు మహాస్వామివారి మార్గదర్శకత్వం కావాలని ప్రార్థించి పీఠం నుండి వెలికిపోనీయలేదు. శిష్యస్వామి వారితో కూడా విజయయాత్ర చేస్తూ 1969లో కంచికి తిరిగి వచ్చారు. నిదానంగా పూజ, ఇతర వ్యవహారములు జయేంద్రుల వారికి అప్పగించారు.
ఒకరోజు స్వామివారు హఠాత్తుగా కంచిమఠం ప్రాంగణం సింహద్వారం బయటకు వచ్చి నిలచి తనవెంట వస్తున్న పరివారమునుద్దేశించి పీఠములో జీతం తీసుకొంటున్న వారెవరూ తనతో రావడానికి వీలులేదని కట్టడి చేశారు. అతొ కొద్దిమంది అశుల్కదాసులు వెంటరాగా కాంచీపురం పొలిమేరలో ఉన్న సర్వతీర్థం చేరారు. అక్కడ కాశీవిశ్వనాథుని దేవాలయం ఒకటి పురాతనమైనది ఉన్నది. దాని ముఖమంటపంలో స్వామివారు మకాం చేశారు.
అప్పటినుండి 1983లో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు పీఠానికి రాగా - శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ప్రార్థనను అంగీకరించి ప్రవేశించేంతవరకూ మఠం లోనికి అడుగు పెట్టలేదు. పీఠబాధ్యతలు లేవు. ఆదిశంకరులనుండి అనూచానంగా అర్చించబడుతున్న చంద్రమౌళీశ్వరుడు క్రియాశీలక పీఠాధిపత్యం నెరుపుతున్న శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారిచేత మహాస్వామివారేర్పరచిన సంప్రదాయాల అనుసారం పూజ అందుకొంటున్నారు. అయినప్పటికి శ్రీవారు తాము సన్యాసాశ్రమ స్వీకరం నుండి కొనసాగిస్తూ వచ్చిన ఒక గంట జపము తప్పక చేసేవారు.
--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి