5, సెప్టెంబర్ 2023, మంగళవారం

భాగం 10/12 ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం


                    భాగం 10/12 


ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం) 


                ----------------------- 


          9.  సాంకేతిక విజ్ఞానం 


    ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి పేరుతో మారుతూ ఉంటుంది. 

    రేడియోతో మొదలై, టేపురికార్డరు, TV, వీడియో ప్లేయరు, రికార్డరు, DVD, చరవాణితోపాటు మరిన్ని వైజ్ఞానిక పరికరాలూ, ఒకదాని తరువాత మరొకటిగా ఒకవైపు కనబడతాయి. 

    మరొకవైపు బొగ్గుబస్సు, డీసెల్/ గ్యాసు ఆధారితాలూ, విద్యుత్తుతోనూ సౌరశక్తితోనూ నడిచేటటవంటి దశలూ కనబడతాయి. 

    పరిశోధన, కొత్త విషయం అనేవి నిరంతరం జరుగుతూంటాయి. 


      శ్రీమద్రామాయణంలోని అనేక విషయాలు పరిశీలిస్తే, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మనలని అబ్బురపరుస్తుంది. 

    దానిలో భాగంగా కొన్ని పరిశీలిద్దాం. 


అ) నీటిలో భవనం 


    అరణ్యకాండలో, 

      మాండకర్ణి పంచాప్సర తీర్థంలో తన అప్సరస భార్యలకోసం, పైకి కనబడకుండా, సరస్సులోనీటిలోనే ఉండే గృహం నిర్మించాడని పేర్కొనబడింది. 

    క్రీడిస్తుంటే, గీత వాద్య ధ్వనులు మనోహరంగా బయటకు వినబడేవట. 


ఆ) వారధి 


    నదులమీద మాత్రమే మనం వంతెలని చూస్తుంటాం. 

    రామేశ్వరం వద్ద పంబన్ రైలు వంతెన, సాధారణ రవాణాకి మరో వంతెనా, 

    కలకత్తాలో హౌరా వంతెన మధ్యలో ఏ ఆధారం లేకుండా నిర్మించబడడం మనకు తెలిసిందే! 

    నీటి క్రింద నేల కోసుకుపోతుంటే ఆధారం నిలువని ప్రదేశాలలో అనుసరించే పద్ధతి అది. 


    కానీ రాముడు లంకకి వందయోజనాలు పొడుగు వంతెనని ఆధారంతో సముద్రంపై నిర్మించడం, 

    ప్రస్తుత మానవ సమాజంలో ఊహకు కూడా అందనిది. 

    ఏనుగంత ప్రమాణంగల రాళ్ళనీ, పర్వతాలనీ, హఠాత్తుగా సముద్రంలో వేయడంతో అవి ఆధారంగా లోపలికెళ్ళాయి. 

    అనేకరకాల వృక్షాలని ఉపయోగించారని కూడా తెలుపబడింది. 

    మొదటిరోజు 14యోజనాలు, 

    రెండవరోజు ఇరవై, 

    మూడవరోజు ఇరవై ఒకటి, 

    నాల్గవరోజు ఇరవైరెండు, 

    ఐదవరోజు ఇరవైమూడు యోజనాలు కట్టి, వంద యోజనాల వారధిని ఐదురోజుల్లో నిర్మించారు.  

    ఆధారముకలిగీ, 

    పైన తేలే విధంగా వృక్షాలూ, 

    సరిహద్దులూ, 

    అలంకరణలతో కూడిన నిర్మాణం 

  - వానరులతో  

  - అతి తక్కువ కాలంలో నిర్మింపబడడం ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. 


ఇ) పుష్పక విమానం 


   విమానం కనుగొన్నది ఇరువదవ శతాబ్దంలో రైటు సోదరులు అని మనకి తెలుసు. 

    కానీ 1895లో శివరాం బాపూజీ తల్పాడే అనే పండితుడు, భరద్వాజ మహర్షి అందించిన మన శాస్త్రం ఆధారంగా, సౌరశక్తి - పాదరసంతో నడిచే విమానం బొంబాయి చౌపతీ సముద్ర తీరంలో, బరోడా మహారాజు సమక్షంలో 1500 అడుగుల ఎత్తున గగన తలంలో పయనించి, మెల్లగా క్రిందికి దిగింది - అనేది ఎంతమందికి తెలుసు? 

    

    శ్రీమద్వాల్మీకి రామాయణంలో పుష్పక విమానం అత్యంత ఆశ్చర్యకరమైనది. అది 

  - వాయుమార్గమైన అంతరిక్షాన నిలబడగలిగియుండేదీ, 

  - సూర్యుని గమన మార్గమును సూచిస్తూ ప్రకాశించేదీ, 

  - యజమాని మనసు కోరిన చోటికి శీఘ్రంగా ప్రయాణం చేసే సామర్థ్యం కలిగినదీ, 

  - వాయువేగం గలదీ అయినది ఆ పుష్పక విమానం మరిన్ని ప్రత్యేకతలు కలిగియున్నది. 


       ఇటువంటి విషయాలనుబట్టి సాంకేతిక విజ్ఞానాన్ని శ్రీమద్రామాయణం

ఎంత చక్కనైన ఆదర్శంగా తెలియజేస్తుందో అర్థమవుతుంది.


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: