22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

రామాయణమ్ 332

 రామాయణమ్ 332

...

వారు వానరులు ! 

వారి శరీరములు ఒక్కొక్కరిది ఏనుగంత ! 

.

కోట్లకొలదిగ ఉన్న వానరసైన్యం రివ్వుమంటూ గగనతలంలో మెరిసింది !

.

ఎగిరేవారు కొందరు ,

చెట్లమీద దూకేవారు కొందరు గర్జించెవారుకొందరు ! 

శత్రువును 

నిర్జిస్తామని కొందరు సింహనాదాలు చేసుకుంటూ కోలాహలంగా బయలుదేరారు.

.

పళ్ళగుత్తులతో వున్న చెట్లు పెకిలించి మోసేవారుకొందరు !

.

తేనెటీగలు చెదరగొట్డి పెద్దపెద్దతుట్టెలు మోసేవారు కొందరు!

.

మధుభక్షణం చేస్తూ కొందరు! ఫలభక్షణం చేస్తూ కొందరు!

పరస్పరము పైకి ఎత్తి పడవేస్తూ కొందరు!

భుజస్ఫాలనములు చేసుకుంటూ కొందరు ..

.

అందరూ కదిలారు !

అవనిజ సీతమ్మచెర విడిపించడానికి!

.

పదికోట్ల సైన్యము శతబలి రక్షణలో ఉన్నది!

.

కేసరి,పనసుడు,గజుడు,అర్కుడు వీరు నూరుకోట్ల సైన్యపర్యవేక్షణ చేయుచుండిరి!

.

వలీముఖుడు,ప్రజంఘుడు,

జంభుడు,రభసుడు వీరు నలుదిక్కులా తిరుగుతూ సేనను ఉత్సాహపరుస్తూ తొందరపెట్టుచూ ముందుకు నడిపించుచుండిరి.

.

అది వానర సైన్యమా ! 

లేక అరణ్యములో చెట్ల పైభాగముమీద కదులుతున్న సముద్రమా ! 

.

వారి నడక శత్రుభీకరము !

వారు చేసే కోలాహలము సముద్రఘోష!

వారి కదలిక ఉత్తుంగ కడలితరంగం!

.

సేన కదిలేవైపు అనుకూలంగా అనిలుడు వీస్తున్నాడు!

.

పక్షులన్నీ మధురస్వరంతో ధ్వని చేస్తున్నాయి.

.

సూర్యుడు నిర్మలంగా ఉన్నాడు.

.

అనుకూల శకునాలు విజయతీరం చేరుతారు మీరు! 

అచిరకాలంలోనే!

అని పలుకుతున్నట్లుగా ఉన్నాయి!

.

వానరులు దారిలో కనపడిన ప్రతిసరస్సులో స్నానమాడారు 

ప్రతి చెట్టును పట్టుకొని వేళ్ళాడారు

ప్రతి తేనెతుట్టెనూ లేపారు!

.

కలియదిప్పని సరస్సు గాని

విరగ గొట్టని చెట్టుగానీ

రాళ్ళు పడదోయని గిరులు గానీ

ఎగురగొట్టని కొండగానీ

 మిగులలేదు !

.

పిమ్మట వారు మహేంద్ర పర్వత సానువులు సమీపించిరి

.

అక్కడనుండి ప్రళయతరంగ ఘోషలతో ఉన్న అపారపారావారమును కనుగొంటిరి.

.

సుగ్రీవా ! ఇదుగో సముద్రము దీనిని దాటుట ఎట్లా? అని రామచంద్రుడు పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: