16, అక్టోబర్ 2023, సోమవారం

పరమేశ్వరానుగ్రహమే



జ్ఙానోపార్జనకు  మూలం పరమేశ్వరానుగ్రహమే!


            "  ఏవేదంబు  పఠించె  లూత ; భుజగం బేశాస్త్రముల్   నేర్చె ;తా


                నేవిద్యా  భ్యసనం బొనర్చె  కరి ;  చంచే  మంత్ర  మూహించె  ; బో


                 ధావిర్భావ  నిధానముల్  చదువులయ్యా?  కావు ;  నీపాద    సం


                 సేవాభాగ్యమెగాక,  జంతు తతికిన్    శ్రీ  కాళహస్తీశ్వరా! 


                      శ్రీ కాళ హస్తీశ్వర శతకము:  మహా కవి  ధూర్జటి .


                  

               అధ్యాత్మిక  జ్ఙాన సంపత్తికి  చదువులతో  పనే లేదు. దానికి పరమేశ్వరారాధనమే సాధనమని  మహాకవి ధూర్దటి యభిప్రాయము. పరమేశ్వరుని పాదములను భక్తితో  సేవించిన వారికి  జ్ఙానము  తదనుగ్రహముచేతనే  కలుగునని ధూర్జటి

యభిప్రాయము. 


                 పరమ శైవుడైన ధూర్జటి లోకజ్ఙుడు. తన లౌకిక జ్ఙాన మంతయు రంగరించి  లోకోపకృతికై యతడు  రచించిన శతకము

శతక వాఙ్మయమునకు శిరోభూషణమై  యలరారు చున్నది. తగుమోతాదు మందుతో  వైద్యుడు రోగికి రోగముడిపినట్లు. భవరోగమును నివారించుటకు తగిన యాధ్యాత్మిక  ఔషధ గుళికలై శ్రీ కాళహస్తీశ్వర శతకములోని పద్యములు  భక్తులకు సాయపడుచున్నవి. ఆదిశంకరుల భజగోవింద శ్లోకములవలె  లౌకిక విషయ మిళితములై  యీపద్యములు జిజ్ఙాసువులకు

కర్తవ్య బోధను చేయుచు ఆధ్యాత్మికమార్గ విహరణమునకు  తోడ్పడుచున్నవి. 


                     ప్రస్తుత పద్యమున  భక్తి యొక్కటే ముక్తికి సాధనము. అదియే సమస్తమైన  జ్ఙానమునకు మూలము. అనేవిషయాన్ని సోదాహరణంగా ప్రతిపాదిస్తున్నాడు.


                 పరమేశ్వరానుగ్రహమువలన , అమేయ భక్తివలన  ,సాలెపురుగు ,పాము , ఏనుగు , తిన్నడను బోయ మోక్షము నందినారుగదా! దానినే దృష్టాంతముగా చూపుచున్నాడు.


                    సాలెపురుగు  ఒకచిన్నక్రిమి. అది యేవేదం చదివిందీ? వేదాలు జ్ఙానసంపత్తిని యిచ్చేవి. అయితే అవేవీ చదివే అవకాశమే 

ఆక్రిమికిలేదు. అయినా దానిమోక్షమార్గానికి  అది అడ్డంకాలేదు. నిరాటంకంగా మోక్షమందుకొన్నది.


                            పాము: ఇదీ సరీసృపము. దీనికిగూడా  చదివే అవకాశమే పూజ్యం. అందుకే కవియంటున్నాడు,పాము  యేశాస్త్రాలు

చదివిందీ? పాపం  దానికి అవేవీ తెలియవు. అయినా పరమేశ్వర భక్తితో మోక్షం సుగమం చేసికొంది.


                           ఏనుగు  చేసిన విద్యాభ్యాస మేమిటి? కేవలము అహంకారమే మూర్తీభవించిన రీతిగా అడవిని దిరుగు ఏనుగునకు

విద్యనేర్పువారెవ్వరు? అదిసాధ్యము గానిపనిగదా! అయిననూ  విద్యావిహీనత  దాని మోక్షమార్గమునకు ఆటంకము కాలేదు. పరమేశ్వరుని పాదభక్తియే దానికి పరమపద సోపానమైనది.


                  ఇక బోయ!  వాడు పుట్టుకతోనే మృగ సమానుడు. వానికి  మంత్ర తంత్రములేవియు దెలియవు. తెలిసినదంతయు ఒక్కటే, 

వేటాడుట, ఎఱచిఁ దెచ్చి నివేదించుట.పుక్కిట బట్టి తెచ్చిన జలముల నభిషేకించుట. శంకరుని కంటి కి వైద్యముగా  కన్నుకు బదులు తన కన్నర్పించుట. ఈసమర్పణాగుణమే పరమేశ్వరానుగ్రహమునకు కారణమై  మోక్షమార్గమునకు నడిపినది.  కావున దైవారాధనకు చదువులతో  పనిలేదు భక్తి కలిగిన చాలును. అదిలేనిచో  నెంత చదివినను వ్యర్ధమే!


                                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💄🌷

కామెంట్‌లు లేవు: