*మార్గం చూపిన మహానుభావుడు..*
"గత వారం రోజులుగా ఇక్కడే ఉన్నానండీ..దత్తదీక్ష తీసుకునే వాళ్లకు మీరు మాలవేయడం..దీక్షాధారులు అందరూ మూడుపూటలా క్రమశిక్షణతో స్వామివారి హారతులు తీసుకోవడం..మీరు చేస్తున్న అన్నదానం అన్నీ దగ్గరుండి చూస్తున్నాను..చక్కగా..ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం..నాకూ మరో రెండు రోజులు ఉండాలని ఉన్నది..కానీ ఇంటి దగ్గర పరిస్థితి అనుకూలంగా లేదు..నేను రేపు మా ఊరు వెళ్లాలని అనుకుంటున్నాను..ఈ స్వామివారి మందిరానికి రావడం ఇది రెండోసారి..మూడు నాలుగు నెల క్రితం ఇక్కడికి వచ్చి వెళ్ళాను..ఈ స్వామివారి సమాధి ని దర్శించుకున్న తరువాత నాకు వ్యక్తిగతంగా అనుభవాలు కలిగాయి..నేను మళ్లీ వచ్చినప్పుడు మీతో వాటిని పంచుకుంటాను..ఏది ఏమైనా ఈ వారం రోజులూ..మీరూ..మీ సిబ్బందీ నాకు చాలా సహకారం ఇచ్చారు ..రేప్పొద్దున బైలుదేరుతాను.." అన్నాడా యువకుడు..
అప్పటికి లాక్ డౌన్ ప్రకటించి మూడు రోజులు అయింది..ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది..ఇతనేమో తన ఊరికి వెళ్లాలని అనుకుంటున్నాడు..పోనీ..అదేమన్నా మొగిలిచెర్ల కు దగ్గరలో ఉన్న ఊరు కాదు..అనంతపురం వెళ్ళాలి..అనుకున్న విధంగా వెంట వెంటనే బస్సులు దొరికినా..మొగిలిచెర్ల నుంచి కనీసం 10 గంటల పైగా ప్రయాణం ఉన్నది..ఆమాటే అతనితో చెప్పాను.."మీరు ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు..ఎక్కడి కక్కడ వాహనాలు ఆపేస్తున్నారు..మీరు ముందుగా పామూరు చేరాలి..ఉదయం 11 గంటల లోపే ప్రయాణం చేయాలి..బాగా ఇబ్బంది పడతారు.." అన్నాను..రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ.."మొగిలిచెర్ల దత్తాత్రేయుడు దారి చూపించాలి..రేపు ఉదయం ఇక్కడి నుంచి బైలుదేరుతాను..ఇక స్వామివారే నన్ను మా ఊరు చేర్చాలి.." అన్నాడు..నేనేమీ మాట్లాడలేకపోయాను.."మీ ఇష్టం.." అని చెప్పి.."సాధ్యమైనంతవరకూ జాగ్రత్తగా వుండండి..ప్రభుత్వం వారు మన మంచికోసమే ఈ లాక్ డౌన్ పెట్టారు..అందువల్ల..ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయాల్లోనే మీరు ప్రయాణం చేయండి..మీకూ మంచిది.." అని చెప్పాను.."అలాగే స్వామీ.." అన్నాడు..
ఆ ప్రక్కరోజు ఉదయం 5 గంటల వేళ అతను అనంతపురం వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు..అదే సమయం లో స్వామివారి మందిరం వద్ద దత్తదీక్ష తీసుకున్న ఒక స్వామి..తాను పామూరు వెళుతున్నానని మా అర్చకస్వామితో చెప్పాడు..పామూరు వరకూ ఈ యువకుడిని తీసుకెళ్లమని అర్చకస్వామి అతనిని కోరారు..అలా ఆ యువకుడు మా కందరికీ వీడ్కోలు చెప్పి ..అనంతపురం బయలుదేరాడు.."అయ్యా..ఇతను అనంతపురం రేపటికి చేరతాడేమో..అదికూడా అన్నీ అనుకూలిస్తే.." అని మా సిబ్బంది అన్నారు..ఆ తరువాత మా పనుల్లో మేము ఉండిపోయాము..
ఆరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు స్వామివారికి నైవేద్యం పెట్టి..హారతి ఇచ్చారు అర్చకస్వామి..మందిరం వద్ద ఉన్న దీక్షాధారులు హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రం వైపు వెళ్లారు..ఇంతలో నా ఫోన్ మోగింది.."అయ్యగారూ..నేనండీ..ఉదయం అనంతపురం వెళ్లాలని బైలుదేరానే..అతనిని.." అన్నాడు.."ఏ ఊరు వరకూ చేరారు?.." అన్నాను.."అనంతపురం లోని మా ఇంటి నుండి మాట్లాడుతున్నాను.." అన్నాడు..ఒక్కసారిగా అంతులేని ఆశ్చర్యం వేసింది.."ఎలా సాధ్యమైంది?.." అన్నాను.."అంతా ఆ స్వామి దయ అయ్యగారూ..ఉదయం మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్ద నుంచి పామూరు వరకూ దీక్ష లో ఉన్న స్వామి నన్ను వదిలిపెట్టారు కదా..ఒక్క నిమిషం లోపే మరో అతను నా దగ్గరకు వచ్చి తాను బద్వేలు వెళుతున్నానని..వచ్చేపనైతే తనతో తోడుగా రమ్మని అడిగాడు..బద్వేలు లో వదిలాడు..అక్కడనుంచి పాల కేంద్రం వాళ్ళ బండి ఎర్రగుంట్ల కు వెళుతున్నదట..ఎవరన్నా వస్తారా అని అడుగుతున్నాడు..వెంటనే అది ఎక్కాను..ఎర్రగుంట్ల చేరాను..అక్కడి నుండి మరొకరు నన్ను అనంతపురం చేర్చారు..ఏమిటో అయ్యగారూ..ప్రభుత్వం వారు సూచించిన సమయం 11 గంటల లోపే నేను మా ఇంట్లో వున్నాను..ఏ కష్టం కలుగలేదు..అసలు నాకే నమ్మబుద్ది కావడం లేదు..అంతా స్వామివారి దయ..ఆయనే నాకు మార్గం చూపించారు..ప్రతి ఊరిలోనూ నన్ను ఎక్కించుకొని ఒక్కొక్క చోట వదిలిపెట్టింది కూడా సాక్షాత్తూ మన స్వామివారే..ఆ స్వామికి ఎన్ని దండాలు పెట్టినా సరిపోదు.." అన్నాడు..
అతను స్వామివారిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచాడు..అదే అతనికి శ్రీరామ రక్ష అయింది..మాకు మరొక అనుభవం తెలుసుకునే అవకాశం కలిగింది..
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి వద్ద నిరంతరము మేము ఏదో ఒక రూపం లో అనుభవాలు పొందుతూనే ఉంటాము..ఈరోజు నుంచి స్వామివారి వద్ద భక్తులు పొందిన అనుభవాలు..స్వామివారి లీలలు మరికొన్ని రోజుల పాటు చదువుకుందాము..ఇలా వ్రాసి పోస్ట్ చేయడానికి కూడా స్వామివారి కరుణా కటాక్షణాలే కారణం..అవే లేకపోతే..ఒక్క అక్షరం కూడా వ్రాయలేను..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి