26, నవంబర్ 2023, ఆదివారం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *33వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*గురుగ్రహ జననం - 4*


తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది.


నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. *"గురు గ్రహం అనబడే బృహస్పతి జన్మ వృత్తాంతం ఆలకించారు. ఆ బృహస్పతికి సమకాలికుడూ , సముడూ అయిన శుక్రుడి జన్మ గాథ వినండి.*


*"నవ గ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్రుడు బ్రహ్మ మానస పుత్రులలో ప్రముఖుడైన భృగుమహర్షి కుమారుడు. 'శుక్రుడు' అన్నది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఒక మహత్తరమైన కారణంతో ఆయనకు 'శుక్రుడు' అనే సార్ధక నామధేయం ఏర్పడింది..."* అంటూ ఆగాడు నిర్వికల్పానంద.


*"ఈ రహస్యం మాకు తెలీదు ! శుక్రుడు - 'శుక్రుడే' అనుకుంటున్నాం ! ఆ పేరు రావడానికి కారణం ఏమిటి గురువు గారు ?"* సదానందుడు అడిగాడు.


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *“అంత తొందర ఎందుకు , సదానందా ! శుక్రుడి చరిత్రను సంపూర్ణంగా ఆకర్ణిస్తారు గదా ! ఆ క్రమంలో ఆ 'రహస్యగాథ' తెలుస్తుందిలే ! శుక్రుడి తండ్రి భృగుమహర్షి అని చెప్పాను కదా ! ఆయన భార్య పులోమ. ఆమెను పౌలామి అని కూడా అంటారు. పులోమ అసుర వంశానికి చెందింది. భృగు మహర్షిని వివాహం చేసుకున్నాక , ఆమె గర్భవతి అయింది. మొదటి నుంచీ ఆమె మీద మనసు పడిన రాక్షసుడు (పులోముడు) భృగువు లేని సమయంలో సూకర రూపం ధరించి , పులోమిని అపహరించుకుపోయాడు. ఆ రాక్షసుడు పరిగెడుతున్న సమయంలో నిండు చూలాలైన పులోమకు ప్రసవం జరిగిపోయింది. పురుష శిశివు ఆమె గర్భం లోంచి నేల మీదకు పడిపోయాడు. ఆ శిశువే చ్యవనుడు...”* కథ చెప్తున్న నిర్వికల్పానంద ఆగాడు.


*"చ్యవనుడంటే... సుకన్య భర్త. చ్యవన మహర్షేనా గురువు గారూ ?"* చిదానందుడు అడిగాడు.


*“ఔను... ఆ చ్యవనమహర్షి గాథ అటుంచి ఆ భృగుపత్ని పులోమను గురించి వినండి. ఆమె మహామహిమ కలిగిన వనిత. ఆమోఘమైన తపశ్శక్తి ఆమెది. భృగుపత్నిగా ఆమె అలవరచుకున్న పతిభక్తి ఆమె శక్తిని ఇతోధికంగా పెంచింది. భూపతనమై జన్మించిన చ్యవనుడు తపస్సులో నిమగ్నుడైపోయాడు. తదనంతరం పులోమా , భృగు దంపతులకు 'వజ్రశీర్షుడు', 'శుచి', 'ఔర్వుడు' అనే కుమారులు కలిగారు. అయితే ఆ పుత్రుల సాధారణ మేధోశక్తీ , సాత్వికతా పులోమను సంతోష పెట్టలేక పోయాయి. మహాశక్తి సంపన్నుడూ , కత్తివాదర లాంటి బుద్ధికుశలత కలిగిన వాడూ , కార్యదక్షతా , పట్టుదలా కలిగిన వాడూ , ముఖ్యంగా తాను ఏ కులంలో ఉద్భవించిందో , ఆ అసురకులం పట్ల చెరగని పక్షపాత ధోరణి కలిగినవాడూ అయిన అసాధారణ పుత్రుడు కావాలన్నది పులోమ చిరకాల వాంఛ...”* అంటూ వివరించ సాగేడు నిర్వికల్పానంద.


_*రేపటి నుండి శుక్రగ్రహ జననం ప్రారంభం*_


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: