26, నవంబర్ 2023, ఆదివారం

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 98*


అత్యున్నత భావ భూముల్లో 


మఠ నిర్వహణ, కుటుంబ సమస్యలు ఏవీ నరేంద్రుని ఆధ్యాత్మిక అత్యున్నత భావభూములను చలింపజేయలేదు. అతడి మనస్సు సదా అత్యున్నత భావ భూముల్లోనే సంచరించసాగింది. ఒక రోజు సాయంత్రం 4 గంటలు అయ్యుండవచ్చు. ఆ రోజు నరేంద్రుణ్ణి చూడడానికి ఆతడి సోదరుడైన మహేంద్రుడు మఠానికి వచ్చాడు. మెట్లెక్కి మేడ మీది వసారాలోకి వచ్చినప్పుడు అక్కడ నరేంద్రుడు పచార్లు చేస్తూ కనిపించాడు. 


పచార్లు చేస్తున్నాడో లేక ఎవరైనా ఆతణ్ణి నడిపిస్తున్నారో తెలియరాలేదు.. అలాంటి స్థితిలో ఆతడున్నాడు. నిశ్చలమైన కళ్లు, ఊర్ధ్వముఖమైన దృష్టి. - శారీరకస్మృతిలేని ఆకృతి, దివ్య తేజస్సుతో ప్రకాశించే ముఖాకృతి! చెరిగిపోని పరమ ప్రశాంతత ఆ ప్రాంతమంతా ఆవరించి ఉంది.


మహేంద్రుడు చాలాసార్లు నరేంద్రుణ్ణి పిలిచాడు, స్పందన లేదు. అతడు నడుస్తూ తన ప్రక్కకు వచ్చినప్పుడు బిగ్గరగా పిలిచి చూశాడు. అయినప్పటికీ నరేంద్రుని నుండి ఎలాంటి జవాబు లేదు. మహేంద్రునికి భయం వేసింది. వెనుకకు కాస్త దూరం వెళ్లగా అక్కడ రాఖాల్, శరత్ ప్రభృతులు ఏమీ పాలుబోక నిలబడి కనిపించారు. "మధ్యాహ్నం ఒకటిన్నర నుండి ఇలాగే ఉన్నాడు. అతణ్ణి ఈ స్థితిలో మేం ఎన్నడూ చూసింది లేదు. కొన్ని రోజులు జపధ్యానాదులలో బాగా లయించిపోయి ఉన్నాడు. 


సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటూ బాగా లోతైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చింతనలో అతడి మనస్సు అత్యున్నత స్థితులలో నెలకొని ఉన్నది. నువ్వు ప్రయత్నించి అతడి మనస్సును సామాన్య స్థితికి తీసుకురాగలవేమో చూడు. ఇలా అత్యున్నత స్థితులలో మనస్సు నెలకొనే దశలో శరీరం రాలిపోతుందని గురుదేవులు చెప్పేవారు. మా అందరికీ ఎంతో ఆందోళనగా ఉంది" అని వారు మహేంద్రునితో చెప్పాడు.


చీకటి పడసాగింది. మహేంద్రుడు నరేంద్రుని ప్రక్కకు వెళ్లి బిగ్గరగా అతణ్ణి పేరుపెట్టి పిలువసాగాడు. ఫలితం శూన్యం. కాళ్లు యాంత్రికంగా నడుస్తూనే ఉన్నాయి; చూపు ఎక్కడో చూస్తూన్నట్లుగా ఉంది. అతడు మామూలు స్థితికి వచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదు. మహేంద్రుడు కూడా ఎడతెగక బిగ్గరగా పిలవడమేగాక, తిట్టడం కూడా ప్రారంభించాడు. అలా ఏడెనిమిది నిమిషాలు. గడిచిపోయాయి.


 ఆ తరువాత నరేంద్రుడు క్రమక్రమంగా సాధారణ స్థితిలోకి రాసాగాడు. అనంత జ్యోతిర్మయ లోకాన్ని తిలకించిన ఆతడి నేత్రాలు వెలుగు చీకట్లు మారిమారి వచ్చే ఈ లోకాన్ని ప్రప్రథమంగా చూస్తూన్నట్లుగా అనిపించాయి. నూతన లోకాన్ని చూస్తూన్నట్లుగా ఆతడి కళ్లు దేనినీ నిలకడగా చూడలేక పోతున్నాయి. చివరకు అస్పష్ట స్వరంలో, "ఏమిటిది, ఏమిటిది" అనే మాటలు ఆతడి నోటి నుండి వెలువడ్డాయి. చాలాసేపు గడచిన తరువాతే అతడు పూర్తి బాహ్యస్మృతిలోకి రాగలిగాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: