26, నవంబర్ 2023, ఆదివారం

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 88*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*పదం తే కీర్తీనాం ప్రపద మపదం దేవి విపదాం*

*కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులామ్ l*

*కథం వా బాహూభ్యా ముపయమనకాలే పురభిదా*

*యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా ‖*

*కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా* 


శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము 43 వ నామము. అనగా అమ్మవారి మోకాళ్ళు తాబేటి డిప్ప వలె కొద్దిగా ఉబ్బివున్నాయి అని. ఇది మంచి సౌభాగ్య లక్షణము. ప్రపదములనగా ప్రజ్ఞానం బ్రహ్మ మొదలుగా కల నాలుగు మహావాక్యములని కూడా భావించవచ్చు. అలాగే ఉపమానంగా చూపిన తాబేటి డిప్ప అంటే క్షీరసాగరమధనంలో తన డిప్పపై మందర పర్వతాన్ని నిలిపి సహకరించిన కూర్మావతార శ్రీమహావిష్ణువు యొక్క సమస్త లోకములను ఉద్ధరించగల పాదములని గ్రహించవచ్చు.


ఇక్కడ శంకరులు అంటున్నారు అమ్మ


పదం దేవి విపదాం = అన్ని విపత్తులను తొలగించగలిగిన నీ పాదములు


పదం తే కీర్తీనాం ప్రపదమ్ = శోభాయమానమని కీర్తింపబడే నీ దివ్య పాదములు


 కథం నీతం సద్భిః కఠినకమఠీ కర్పరతులామ్ సద్భిః = పండితులు అంటే వశిన్యాది వాగ్దేవతలు సహస్ర నామములను అమ్మవారి అనుజ్ఞపై పలికినవారు. నీ సుకుమారమైన మీగాళ్లను కఠినమైన తాబేటి డిప్పతో ఎలా పోల్చారమ్మా? 


పురభిదా = త్రిపురారి అయిన శివుడు


బాహుభ్యా ముపయమనకాలే దయమానేన మనసా = నీ వివాహ సమయమందు జాలి పడినవాడై తన రెండు చేతులతో 


కథం వా యదాదాయ న్యస్తం దృషది = నీ పాదమును సున్నితముగా సన్నికల్లు ( దృషది)  పైన ఉంచాడమ్మా. అంటే నీ పాదములు సున్నితమైనవి కాని, కఠినమైనవి కావని శంకరుల వాక్కు.


సనాతన ధర్మ సంప్రదాయములో వివాహములో ఆశ్మారోహణము అనే కార్యక్రమం ఉంటుంది. ఇది స్థాళీపాక సందర్భంగా చేయిస్తారు వధూవరుల చేత. హోమకుండమునకు ఉత్తర దిశలో సన్నికల్లును ఉంచి, వరుడు వధువు కుడి అరచేతిని పట్టుకొని ప్రదక్షిణముగా వచ్చి తన ఎడమ చేతితో ఆమె కుడి పాదము బ్రొటనవేలును పట్టుకొని, ఆ సన్నికల్లు రాతి పైన ఆమె కుడి పాదమును ఉంచి మంత్ర పూర్వకముగా చెప్తాడు జీవితములో ఎట్టి ఒడిదుడుకులు కలిగినా ఈ రాయి వలె దృఢముగా ఉండవలసినది అని. మళ్ళీ అగ్నిహోత్రము వద్దకు వెళ్లి హోమము చేస్తారు వారు. ఆ విధముగా మూడుసార్లు చేసాక వధువు పాదముల రెండవ వ్రేలికి సౌభాగ్య చిహ్నముగా వెండి మట్టెలు తొడుగుతాడు వరుడు. 


ఈ సందర్భాన్ని చెపుతూ శంకరులు అన్నారు అమ్మా శివుడు నీ సుకుమారమైన పాదములు కందిపోతాయోమోననే భయముతో నీ పాదమును జాగ్రత్తగా పట్టుకొని సన్నికల్లు పైన నిదానముగా ఉంచాడమ్మా అని. 


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే 

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ🙏🏻


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: