20, నవంబర్ 2023, సోమవారం

అవధూత అభయం

 *అవధూత అభయం..*


"మొగలిచెర్ల గ్రామంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నదని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి భక్తుల రాకపోకలు నిషేధించారని మీరు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ చూశానండీ..మా దంపతులము గురుపౌర్ణమి రోజు మీరు ఆనవాయితీగా నిర్వహించే దత్తహోమములో  పాల్గొనాలని ఎంతగానో ఆశపడ్డాము..కానీ పరిస్థితుల ప్రభావం వల్ల దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది..సరే గురువుగారూ..మరలా మీరు ఎప్పుడు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారో ముందుగా తెలిపితే..మేము ఆరోజుకు అక్కడికి వస్తాము..ఒకరోజు ఆ స్వామి సన్నిధిలో నిద్ర చేయాలి..ఆ దత్తయ్య ఏరోజు మాకు వీలు కల్పిస్తాడో..అంతవరకూ ఎదురు చూస్తాము..ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే..అందుకు ఆ అవధూత దత్తాత్రేయుడే కారణం..ఆ స్వామి కృప చూపబట్టే..మేము సమస్యల నుంచి బైట పడ్డాము..మరలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు..స్వామివారి దర్శనానికి ఎప్పుడు వీలుకుదురుతుందో ముందుగా తెలియచేయండి..మా తరఫున స్వామివారి పాదాలకు నమస్కారాలు తెలియ చేయండి.." అంటూ..దాదాపుగా దుఃఖం తో కూడిన స్వరంతో మూర్తిగారు ఫోన్ లో తెలిపారు..


2017 వ సంవత్సరం గురుపూర్ణిమ నాడు మూర్తిగారు తన భార్యతో కలిసి మొదటిసారి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆనాటికి మూర్తిగారికి స్వామివారి గురించి పెద్దగా అవగాహన లేదు..ప్రకాశం జిల్లా లో ఒక పల్లెటూరు సమీపం లో ఒక అవధూత మందిరం ఉన్నదట..అక్కడికు వెళ్లి భక్తి విశ్వాసాలతో ఆ అవధూత సమాధి వద్ద మొక్కుకుంటే..కోర్కెలు తీరుతాయట..అని కొందరు చెపుతుంటే..ఆలకించి..ఒకసారి వెళ్లి వద్దాము..అనే ప్రయత్నం తో వచ్చారు..కాకుంటే..మూర్తిగారు రావడమూ...ఆరోజు తిధి ప్రకారం గురుపౌర్ణమి కావడమూ.. కేవలం కాకతాళీయంగా జరిగింది...గురుపూర్ణిమ సందర్భంగా ఆరోజు స్వామివారి మందిరం ఉదయం నుంచే కోలాహలంగా ఉంది..ఒక ప్రక్క దత్తహోమము లో పాల్గొనే భక్తులు సంప్రదాయానుసారంగా దుస్తులు ధరించి కూర్చుని వున్నారు..మరోప్రక్క హోమగుండాల వద్ద పురోహితులు సామాన్లు సర్దుకుంటున్నారు..


ఈ హడావుడి చూసిన మూర్తిగారు నా వద్దకు వచ్చి.."అయ్యా..ఇక్కడేదో హోమము నిర్వహిస్తున్నారు..వివరాలు తెలుపుతారా"? అని అడిగారు..ప్రతి గురుపౌర్ణమి నాడు దత్తహోమము నిర్వహిస్తామని..ఆ ప్రకారమే ఇప్పుడూ జరుపుతున్నామని చెప్పాను..భార్యతో కలిసి ఒక ప్రక్కకు వెళ్లి ఓ ఐదు నిమిషాలు మాట్లాడి వచ్చారు.."మేము తీవ్రమైన సమస్యల్లో వున్నాము..ఆ సంగతి మళ్లీ తమరికి చెప్పుకుంటాము..ఈరోజు మేము కూడా ఈ హోమములో పాల్గొనే అవకాశం ఉందా?.." అని అడిగారు..మా ప్రధాన అర్చక స్వామిని పిలిచి అడిగాను..ఈ దంపతులను కూడా హోమము వద్ద కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయమని..అర్చకస్వామి నా వైపు చూసి..ఒకే ఒక్క హోమగుండం ఖాళీ ఉంది..నిజానికి నెల్లూరు నుంచి వస్తామన్న రెడ్డిగారు ఇంట్లో ఇబ్బంది వల్ల రాలేకపోతున్నాను..అన్నారు..వారి స్థానంలో ఈ దంపతులకు అవకాశం ఇద్దాము.."అన్నారు.."మీ అదృష్టం అండీ.." అని చెప్పాను..దంపతులిద్దరూ సంతోషంగా హోమములో పాల్గొన్నారు..హోమ కార్యక్రమం పూర్తి అయిన తరువాత..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చారు..


ఆరోజు సాయంత్రం ఆరుగంటల వరకూ స్వామివారి మందిరం వద్దే వున్నారు..ఆరుగంటల బస్సుకు తిరిగి వెళ్లేముందు నా వద్దకు వచ్చి.."ఏదో చాలా చిన్న గుడికి వెళుతున్నాము..అక్కడ ఏర్పాట్లేవీ ఉండవు..కనీసం మనకు భోజనం పెట్టె దిక్కు ఉందొ లేదో.."అని నా భార్యతో అన్నానండీ.."వెళ్ళేది దత్తుడి దగ్గరకు..అన్నీ ఆయనే చూస్తాడు.." అని నాతో ఆవిడ చెప్పింది..ఇంతమాత్రపు గుడి అని అనుకోలేదు..స్వామివారు తనకోసం సరైన స్థలమే ఎన్నుకున్నారు..చాలా తృప్తిగా ..సంతోషంగా వుందండీ..మాకున్న బాధలన్నీ మర్చిపోయాము..మనసారా మొక్కుకున్నాము..ఈ అవధూత పాదాల వద్ద మా సమస్య చెప్పుకొన్నాము..ఈ అవధూత స్వామి అభయం ఇచ్చాడనే నమ్మకం తో వెళుతున్నాము.." అని చెప్పి వెళ్లిపోయారు..


సరిగ్గా ఏడు మాసాల తరువాత..మూర్తిగారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..ఆ దత్తుడే మాకు దారి చూపాడండీ..ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న మా ఆస్తి సమస్య పూర్తిగా తీరిపోయి..మా ఆస్తి మాకు కలిసి వచ్చింది..స్వామివారు కరుణించారు.." అని ఉద్వేగంతో చెప్పారు..ఆ ప్రక్కవారమే ఆ దంపతులు తమ ఆస్తి కాగితాలు తీసుకొచ్చి..స్వామివారి సమాధి వద్ద పెట్టి నమస్కారం చేసుకొని వెళ్లారు..ఆ తరువాత వరుసగా రెండేళ్లు గురుపౌర్ణమి కి ఆ దంపతులు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడిని దర్శించుకొని..దత్తహోమము లో పాల్గొని..ఆ తరువాత గురువారం నాడు అన్నదానం చేయించి వెళ్లేవారు..ఈ సంవత్సరం ఆ అవకాశం కలుగలేదని బాధపడ్డారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380..మరియు..99089 73699).

కామెంట్‌లు లేవు: