20, నవంబర్ 2023, సోమవారం

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 04*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *4. మెయ్ పొరుళ్ నాయనారు*


తిరుక్కోవలూరును రాజధానిగా చేసుకొని మెయ్పిరుళ్ నాయనారు

చేదినాడును న్యాయవర్తనుడై పాలిస్తూ వచ్చాడు. శివాలయాలన్నింటిలోనూ

రోజూ ఆరుకాలాల్లో పూజలు జరిగేలా కట్టడి చేశాడు.

అటువంటి మెయ్పిరుళ్ నాయనారును జయించి అతని రాజ్యాన్ని

ఆక్రమించుకోవాలని ముత్తనాథుడనే శత్రురాజు చేదినాడుపై యుద్ధాన్ని

ప్రకటించాడు. ఆ యుద్ధంలో ముత్తనాథుడు పరాజితుడై అవమానంతో

పారిపోయాడు. 


ఈ విధంగా సర్వస్వమూ కోల్పోయిన ముత్తనాథుడు

యుద్ధంలో మెయ్పిరుళ్ నాయనారును జయించడం అసాధ్యమని

తెలుసుకొన్నాడు. నాయనారుకు శివ భక్తులపై గల ప్రీతిని తెలుసుకొని

తాను ఒక శివ భక్తునివలె, మెప్పొరుళ్ నాయనారును జయించాలనే

ఆలోచనతో తిరుక్కోవలూరుకు వచ్చాడు. ముత్తనాథుడు మాయా తాపసి

వేషంతో ఒక కరవాలాన్ని తాళపత్ర గ్రంథమున్న సంచిలో దాచుకొని నాయనారు భవనాన్ని సమీపించాడు. 


రాజుగారి పడక గదిముందున్న

దత్తుడు అనే రక్షకభటుడు “ఇప్పుడు రాజుగారు నిద్రపోతున్నారు” అని

చెప్పాడు. దానిని విన్న ముత్తనాథుడు “నేను రాజుగారికి జ్ఞానబోధ

చేయడానికి వచ్చాను, నీ విక్కడే ఉండు" అని చెప్పి లోపలికి వెళ్లాడు.


అక్కడ రాజుగారు నిద్ర పోతుండగా పక్కనే ఉన్న రాజుగారి భార్యను

చూశాడు. నాయనారు భార్య మాయ తాపసిని చూసి తన భర్తను లేపగా రాజు మేలుకొని పరమేశ్వరుని భక్తుడితడు అంటూ లేచి ముత్తనాథునికి

భక్తితో నమస్కరించాడు. ముత్తనాథుడు నాయనారుతో “ఈ భూమండలంలో

మరెక్కడా లేనటువంటి ఒక శైవాగమశాస్త్రాన్ని మీకు చెప్పడానికి వచ్చాను.

నీ భార్యను ఇక్కడినుండి వెళ్లమని చెప్పు. మనిద్దరం ఏకాంతంగా ఒకచోట

 ఆసీనులం కావాలి" అని చెప్పాడు. 


నాయనారు తన భార్యను అంతఃపురానికి వెళ్లమని ఆజ్ఞాపించి, తాను ప్రాంజలియై నేలమీద కూర్చొని ఇక

శైవాగమ శాస్త్రాన్ని పఠించండి" అని ప్రార్ధించాడు. ముత్తనాధుడు తాళపత్ర

గ్రంథాన్ని విప్పే వాడిలాగ నటిస్తూ మెప్పొరుళ్ నాయనారు తనకు

నమస్కరిస్తున్న సమయంలో కరవాలాన్ని తీసుకొని నాయనారు శిరసును

ఖండించాడు. 


ఆ సమయంలో రాజుగారి అంగ రక్షకుడైన దత్తుడు పడకగది

లోనికి ప్రవేశించి తన కరవాలంతో ముత్తనాథుని ఎదుర్కొన్నాడు. అప్పుడు

నాయనారు తన శరీరమంతా రక్తధారలు స్రవిస్తుండగా నేలకు వాలుతూ

"దత్తుడా! పరమేశ్వరుని భక్తుడైన ఇతడు వెళ్లేటప్పుడు ఇతనిని ఎవరూ

నిరోధించకుండా నీవు వీరిని జాగ్రత్తగా నగరం పొలిమేరల వరకు తీసుకు

వెళ్లి వదలిపెట్టు" అని ఆజ్ఞాపించాడు. 


తన చేతిలో పొడవాటి కరవాలాన్ని

ధరించిన దత్తుడు తాపసిని వెంట బెట్టుకొని తిరుక్కోవలూరు నగరం

పొలిమేరలకు చేరుకొని అక్కడ శత్రురాజైన ముత్తనాధుని వదలిపెట్టి

అంతఃపురానికి వచ్చాడు. 


శివభక్తునికి ఎలాంటి అపకారం రానీయక సురక్షిత

ప్రాంతంలో వదిలాడన్న వార్తను వినాలనే ఆకాంక్షతో కొట్టుమిట్టాడుతున్న

తన ప్రాణాలను పోనీయకుండా ఓర్చుకొని పడి ఉన్న మెప్పొరుళ్

నాయనారు దగ్గరికి వెళ్లి దత్తుడు “ముత్తనాథునికి ఎలాంటి అపకారం

లేకుండా పంపించాను" అని చెప్పాడు. మెయ్ పొరుళ్ నాయనారు

సంతోషించి పరమేశ్వరునికి భక్తితో నమస్కరించారు.


తనను హృదయంలో నిలపుకొని ధ్యానిస్తున్న మెయ్పిరుళ్

నాయనారుకు శివగామవల్లీ సమేతుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు.

దేవతలకు కూడ చేరరానిదైన తన తిరు చరణాల సన్నిధిలో తనను సదాసేవిస్తూ ఉండేలాగ నాయనారును అనుగ్రహించాడు.


     *నాల్గవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: