🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *81వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*బుధగ్రహ చరిత్ర - 8*
నారదుడు బ్రహ్మను దర్శించుకొనడానికి వెళ్ళాడు. 'ఇల' అనే పేరుతో స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడిని బుధుడు వివాహం చేసుకున్న విషయం చెప్పాడు.
బ్రహ్మ చిద్విలాసంగా నవ్వాడు. *"ఇలా , బుధుడూ కలుసుకోవడంలోనూ.. భార్యాభర్తలుగా రూపొందడంలోనూ నీ ప్రయత్నం ఎంత ఉందో నాకు తెలియదా. కుమారా !"*
*"సుద్యుమ్నుడు ఇంక శాశ్వతంగా స్త్రీగానే ఉండిపోవాలా జనకా ?"* నారదుడు అడిగాడు.
*“ఎవరి నుదుట ఏ భవిష్యత్తు లిఖించి ఉందో ఎవరికి తెలుసు నారదా ?"* బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు.
*“మీకు తెలియదా ?”* తండ్రీ కొడుకుల మాటలను వింటున్న సరస్వతి అడిగింది.
*"ఇంతకూ మీరు ఏం చేశారు ? ఒక పురుషుణ్ణి స్త్రీగా మార్చి బుధుడికి కట్ట బెట్టారా!”*
*"ఆ విచిత్రం మా పనితనం కాదు , దేవీ ! పార్వతీ పరమేశ్వరులది. వాళ్ళ శాపం , పాపం సుద్యుమ్నుడిని స్త్రీగా మార్చివేసింది. మన నారదకుమారుడు ఆ స్త్రీ రత్నాన్ని తెలివిగా బుధుడి ఆశ్రమం వైపు మళ్ళించాడు."*
*“ఇక వివాహం - అందులో ఈ బ్రహ్మచారి చేతి చలవ ఏమీ లేదు ! బుధుడు ఇలనూ , ఇల బుధుజ్జీ వివాహం చేసుకున్నారు అంతే !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.
*“ఒక వేళ భవిష్యత్తులో ఆ ఇల మళ్ళీ పురుషుడుగా మారిపోతే ?"* సరస్వతి సందేహం వెలిబుచ్చింది.
*“నారాయణ ! దానికి జనకపాదులే సమాధానం చెప్పాలి ,"* నారదుడు నవ్వుతూ అన్నాడు.
*"సమీప భవిష్యత్తులో జరగబోయేది ప్రధానం. 'ఇల'గా మారిన సుద్యుమ్నుడి ద్వారా బుధుడి సంతతిగా 'చంద్రవంశం' వృద్ధి చెందుతుంది."* బ్రహ్మ చిరునవ్వుతో సరస్వతిని చూస్తూ వివరించాడు.
ఇల సాహచర్యంలో , ఆమె సేవలో బుధుడి జీవితం ఆనందమయంగా సాగిపోతోంది. ఇల గర్భవతి అయింది. తమ అన్యోన్యతకు ఫలంగా సంతానం కలుగబోతోందన్న సూచన బుధ దంపతుల్ని సంతోష తరంగాల మీద ఊయలలూగించింది.
ఒక శుభదినాన ఇల పుత్రుణ్ణి ప్రసవించింది. శిశువు అన్ని శుభలక్షణాలనూ తనలో ఇముడ్చుకుని ఉన్నాడు. బుధుడు కుమారునికి 'పురూరవుడు' అని నామకరణం చేశాడు.
పురూరవుడు ఆరోగ్యంగా బలంగా ఎదుగుతున్నాడు. తల్లిదండ్రుల ఒడిలోంచి నేల మీదికి జారి ఆశ్రమంలో పాకడం ప్రారంభించాడు. కొన్నాళ్ళ అనంతరం పరుగు నటించే అమ్మనూ , నాన్ననూ దోగాడుతూ ఆశ్రమంలో తరిమాడు. కొన్నాళ్ళు గడిచాక తప్పటడుగుల్తో వాళ్ళను వెంటాడాడు.
పురూరవుడు అయిదేళ్ళ బాలుడయ్యాడు. ఆశ్రమ ప్రాంగణంలో లేళ్ళనూ , నెమళ్ళనూ వెంటాడుతూ ఉల్లాసంగా ఆడుకుంటున్నాడు.
భర్తతో , పుత్రుడితో హాయిగా జీవించడానికి అలవాటు పడిపోయిన ఇల - తన పురుష రూప గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. పురుష రూపంలో తన అనుభవానికి రాని జీవిత మాధుర్యం ఆమెకు ఇప్పుడు అరచేతిలో అమలకంలా ఉంది ! పురూరవుడికి తల్లి అయిన ఇల తన తల్లిదండ్రుల్ని మరిచిపోయింది.
వైవస్వత మహారాజూ , ఆయన ధర్మపత్ని శ్రద్దాదేవీ తమ ఏకైక పుత్రుడైన సుద్యుమ్నుడిని మరిచిపోలేకుండా ఉన్నారు. చారులచేతా , భటులు చేతా యువరాజు కోసం వైవస్వతుడు సాగిస్తున్న అన్వేషణ సాగుతూనే ఉంది.
పుత్రవియోగంతో క్షోభించిపోతున్న వైవస్వతుడు తన కుల గురువు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు. *"గురుదేవా ! మీరు సర్వజ్ఞులు ! అయిదు సంవత్సరాల క్రితం వేటకు వెళ్ళిన సుద్యుమ్నుడు పరివార సమేతంగా అంతర్థానమైపోయాడు. ఏకైక వారసుడి కోసం నేను సాగించిన అన్వేషణ నిష్పలమైపోయింది. నా బిడ్డడు సజీవంగా ఉన్నాడా ? మరణించాడా ? ఆ మాత్రం చెప్పి నాకు మనశ్శాంతి కలిగించండి !”*
*"మహారాజా ! ఇన్నేళ్ళూ కుమారుడి కోసం స్థూల పరిదిలో - అంటే దైహికంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండిపోయారు. యువరాజు సుద్యుమ్నుడు ఏమయ్యాడో సూక్ష్మ పరిధిలో అంటే ధ్యానంతో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను !"* అంటూ మాట ఇచ్చాడు వశిష్ఠ మహర్షి.
వైవస్వతుడికి చెప్పిన విధంగా వశిష్ఠ మహర్షి ధ్యాన నిమగ్నుడైపోయాడు. అంతర్నేత్రంతో సుద్యుమ్నుడి గురించి దర్శించాలన్న ఆయన సంకల్పం అచిరకాలంలోనే నెరవేరింది. ధ్యాన నిమగ్నుడైన వశిష్ఠ మహర్షి జ్ఞాననేత్రంతో తన మనోయవనిక మీద సుద్యుమ్నుడి గతాన్నీ , వర్తమానాన్నీ స్పష్టంగా చూడగలిగాడు.
రాజ దంపతులను కలుసుకుని వశిష్ఠుడు తాను దర్శించిన *"సుద్యుమ్నగాథ”* వివరించాడు. *"మహారాజా ! మీ సుపుత్రుడు సజీవంగా ఉన్నాడు...".*
*“గురుదేవా... !”* వైవస్వతుడు అడ్డుతగిలాడు ఆనందోద్రేకంతో *“ఎంత మధురవార్తో !”*
*"పూర్తిగా ఆలకించండి , మహారాజా !"* వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు. *"సుద్యుమ్నుడు ప్రస్తుతం సుద్యుమ్నుడిగా లేడు. స్త్రీగా మారిపోయాడు ! ఆశ్రమంలో ఒక యువకుడికి భార్యగా , ఒక బాలుడికి తల్లిగా జీవిస్తున్నాడు. పేరు ఇల !"*
*"గురుదేవా ! ఇది నిజమా గురుదేవా ?"* వైవస్వతుడు నమ్మలేకపోయాడు.
*"ప్రభూ ! మన పుత్రుడు మొదట పుత్రికగానే జన్మించాడు కద !"* మహారాణి శ్రద్ధ వైవస్వతుడికి గుర్తు చేసింది.
వైవస్వతుడు తలపంకించి , మళ్ళీ వశిష్ఠుని వైపు తిరిగాడు. *“మా పుత్రుణ్ణి మీరే మాకు అప్పగించాలి , గురుదేవా ! మాకు మరొకసారి పుత్రభిక్ష ప్రసాదించండి !"*
*"రేపే ఇల ఆశ్రమానికి వెళ్తాను !"* అంటూ వశిష్ఠుడు కూర్చున్న చోటు నుండి లేచాడు.
*"హు ! ఆడపిల్ల పుట్టింది. మగపిల్లవాడుగా మారింది. మళ్ళీ ఆడపిల్ల అయింది !"* వైవస్వతుడు విరక్తిగా అన్నాడు రాణి వైపు చూస్తూ.
**************************
*"అమ్మా ! నేను వశిష్ఠుడిని...”* ఆశ్రమం ముందు నిలుచుని , ద్వారం వద్ద నిలుచున్న ఇలను చూస్తూ , అమాయకత్వం నటిస్తూ అన్నాడు వశిష్ఠుడు.
ఇల ఆయనను చూడగానే కలిగిన కలవరపాటును అణచుకుంటూ , ఆహ్వాన సూచకంగా చిరునవ్వు నవ్వింది. *"ప్రణామం మహర్షీ ! దయచేయండి ! నా పతిదేవులు నివ్వరిధ్యానం కోసం వెళ్ళారు...”*
*"అలాగా !"* అంటూ వశిష్ఠుడు అప్పుడే లోపల నుంచి పరుగున వచ్చి , అమ్మ దగ్గరగా ఆగిన పురూరవుణ్ణి పరిశీలనగా చూశాడు. *"బాలుని ముఖంలో సార్వభౌమ లక్షణాలు ఉట్టిపడుతున్నాయి , సాధ్వీ !",*
లోపలకి వచ్చిన వశిష్ఠుడు ఇల వేసిన దర్భాసనం మీద కూర్చున్నాడు. ఇల వైపు చిరునవ్వుతో చూశాడు.
*“అయితే , నన్ను ఇంత వరకూ చూడలేదా అమ్మా , నువ్వు ?"*
వశిష్ఠుడి ప్రశ్న ఇలను చిన్నగా కుదిపింది. ఆమె రెప్పల్ని దించుకుంది. *"లే...లేదు... స్వామీ !”*
*"బాగా గుర్తుచేసుకో ! సుద్యుమ్నుడుగా ఉన్నప్పుడు నన్ను చక్కగా ఎరిగిఉండాలే !"*
*"స్వామీ...!"* ఇలా ఆశ్చర్యంగా అంది.
*"నాకు అంతా తెలుసు ! ధ్యానమార్గాన అన్వేషించి , నిన్ను కనుగొన్నాను. నీకు స్త్రీ రూపం ఎందుకు ప్రాప్తించిందో చెప్పు"* వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు.
ఇల బరువుగా నిట్టూర్చింది. తన ఉనికి తెలిసి పోయింది. వశిష్టమహర్షి ముందు దాచి ఉపయోగంలేదు. కుమారవనంలో ప్రవేశించాక జరిగిందంతా వివరించింది ఇల. పార్వతీ పరమేశ్వరుల శాపం వల్ల తన రూపం మారిపోయిందంది. ఆ కఠోర సత్యాన్ని చెప్పి , ఎవ్వర్నీ నమ్మించలేని నిస్సహాయ స్థితిలో బుధుడి ధర్మపత్ని అయ్యానంది.
అంతా విన్న వశిష్ఠుడు నిట్టూర్చాడు. *"నువ్వు పూర్వ రూపంలో యువరాజుగా రాజధానికి తిరిగి రావాలి ! వైవస్వత మహారాజు నుండి రాజ్యపాలనాధికారాన్ని స్వీకరించి , ప్రజలను పాలించాలి !"*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి