విష్ణుచిత్తుని చరితము
(ఆముక్తమాల్యద )
సీ. చెంగల్వ కొలనులో నంగన లాపురిన్
బసపాడి యత్యంత పావనముగ
నచ్యుతు పూజకై యావస్యకంబైన
తీర్థమున్ బిందెల దీసికొనియు
ఘటియందు నటునిటు కమలముల్ కదలగా
కటియందు కీలించి కదలు చుండ
చనుదోయిభారాన తను మధ్య మల్లాడ
భవ్య ప్రబంధముల్ పాడుకొనుచు
ఆ. పాదకటకము లను పదభూష లను దాల్చి
నడచుచుందు రింతు లొడలు కదల
నడక సోయగముల నయనాల వీక్షించి
విల్లుపురము ప్రజలు విస్తు పోగ. 04*
సీ. ద్రవిడాంగనామణుల్ రత్నసోపానాల
పసుపు నరగదీసి పైన దాల్చి
జలకమ్ము లాడగా సాగి యా నీరమ్ము
పచ్చగా నేలపై పరచు కొనియె
సోపానముల క్రింద సుఖనిద్ర చెందెడి
హంసల పక్షమ్ము లయ్యె పసుపు
పసిడి సదృశమైన పక్షమ్ములను గూడి
యందాల నొప్పెనా యండజములు
తే. పసుపు పక్షంబులను గూడి పట్టణమున
సంచరించెడి హంసల సరళి గాంచి
'పసిడి రెక్కల వేలుపు పక్షు' లనుచు
భ్రమసి సంతస మందిరి ప్రజలు మదిని 05
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి