24, డిసెంబర్ 2023, ఆదివారం

మొదటిరోజు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మొదటిరోజు..*


2004వ సంవత్సరం సంక్రాంతి పండుగకు రెండురోజుల ముందు మా నాన్న శ్రీధరరావు గారు హఠాత్తుగా పక్షవాతం వచ్చి జబ్బున పడ్డారు..హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాము..హైదరాబాద్ లో మా అన్నయ్య నాగప్రదీప్ అడ్వకేట్ గా వున్నాడు.అన్నయ్య వదిన గార్లు నాన్నగారి బాగోగులు చూసుకుంటామనీ..ఏ విధమైన ఆలోచనా పెట్టుకోవద్దనీ నాకు అనునయంగా చెప్పినందున నేను తిరిగి వచ్చేసాను..


సంక్రాంతి పండుగ మూడురోజులూ అయిపోయిన మరుసటి రోజు నేను, నాభార్య  శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం లో అడుగుపెట్టాము..అంతకు ముందు కొన్ని వందలసార్లు శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించినా..ఆరోజు ఒక బాధ్యత తో వెళ్లడం కొంచెం కొత్తగా ఉంది..ముందుగా ఇద్దరమూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఆ సమాధి ముందు మోకరిల్లి.."స్వామీ!..నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మరలా కలిగించావు..ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కష్టపడతాము..నీవు కరుణించి అండదండగా ఉండాలి..అదే మాకోరిక.." అని  మనస్ఫూర్తిగా కోరుకున్నాము..


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణమంతా తిరిగాను..శ్రీ స్వామివారు జీవించి ఉండగా ఉన్న ఆశ్రమ రూపానికి..ఇప్పుడు ఆలయంగా ఉన్న రూపానికి పోలికే లేదు..శ్రీ స్వామివారు కట్టించుకున్న ఆశ్రమం లో అంతకు ముందున్న వంటగది ఇప్పుడు లేదు..అప్పుడున్న పందిరి స్థానం లో ఒక పెద్ద మంటపం నిర్మితమైంది..శ్రీ స్వామివారి సమాధి గది మీద గాలిగోపురం అలరారుతున్నది..శ్రీ స్వామివారు చెప్పిన మాటలు..ఆయన రూపం..హావభావాలు..అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి..శివాలయము, పార్వతీదేవి ఆలయము, నవగ్రహ మంటపం..మొదలైన ఉపాలయాలు ఏర్పాటై ఉన్నాయి..శ్రీ స్వామివారు స్వయంగా కట్టించుకున్న ఆశ్రమ ప్రాంగణం లోనే నైరుతీ మూల శ్రీ సాయిబాబా మందిరమూ వచ్చింది..(ఆ మందిరం లో ప్రతిష్టించిన శ్రీ సాయినాథుని ప్రతిమను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చాను..అదో అనిర్వచనీయ అనుభూతి..ముందు ముందు ప్రస్తావిస్తాను.)


పూజారులతోటి..ఇతర సిబ్బంది తోటి..ఆలయ నిర్వహణ గురించి కొద్దిసేపు చర్చించాను..ఎవరి వంతు సహకారం వారు అందిస్తామని చెప్పారు..కానీ ..ఈ మందిర నిర్వహణ అనుకున్నంత తేలిక కాదనీ..ముందు ముందు అనేక సమస్యలను నేను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ..ప్రతి సమస్య పరిష్కారం వెనుకా..ఆ అవధూత దత్తాత్రేయుడు సహస్రబాహువులతో మమ్మల్ని చుట్టుముట్టి రక్షిస్తాడనీ..మా దంపతులకు ఆరోజు తెలియలేదు..


శ్రీ స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలూ లేవు.... భక్తుల ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఎటువంటి వరుసలూ లేవు..అడ్డదిడ్డంగా నెట్టుకొస్తున్నారు.. ముందుగా ఇక్కడ నుంచే మనం ప్రక్షాళన మొదలుపెట్టాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను..ఆమాటే మా సిబ్బంది తో చెప్పాను..ఎందుకనో వాళ్ళు ఇబ్బందిగా మొహం పెట్టి..సంకోచిస్తూనే సరే అన్నారు..మందిరం వద్ద నుంచి తిరిగి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..అక్కడే కొద్దిసేపు కూర్చుని..నమస్కరించుకొని వచ్చేసాము..


శ్రీ స్వామివారి మందిరం వద్దనుంచి నేరుగా మొగలిచెర్ల లోని ఇంటికి వచ్చి..అమ్మ వద్ద జరిగిన విషయాలన్నీ చెప్పాను..అంతా విని.."ఏమైనా మార్పులు చేద్దామని అనుకుంటున్నావా?..ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయి.." అన్నది..అలాగే అన్నాను కానీ..అమ్మ ఎందుకు ఇంత సున్నితంగా హెచ్చరించిందీ అని ఆలోచిస్తూ ఉండిపోయాను..శ్రీ స్వామివారి మీదే భారం వేసి ఊరుకున్నాను..ఆరోజు అలా గడిచిపోయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: