24, డిసెంబర్ 2023, ఆదివారం

శ్రీ శివమహాపురాణం

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - కైలాస సంహితా - అధ్యాయం - 3                                                                                                                                ఓంకార స్వరూపము - సన్న్యాస పద్ధతి


ఈశ్వరుడు ఇట్లు పలికెను -


ఓ దేవీ! వినుము. నీవు నన్ను ప్రశ్నించిన విషయమును చెప్పగలను. దీనిని విన్నంత మాత్రాన జీవుడు సాక్షాత్తుగా శివుడు అగును (1). ఓంకారముయొక్క అర్థమును తెలియుట యనగా నా స్వరూపమగు జ్ఞానమును పొందుటయే. ఓంకారము అనే మంత్రమునకు ప్రణవము అని పేరు. అది ఉపాసనలన్నింటికీ మూలము (2). అది మర్రిచెట్టు విత్తనము వలె మిక్కిలి సూక్ష్మమైనది మరియు గొప్ప అర్థము గలది. వేదమునకు కారణమైనది, వేదముల సారము అగు ఓంకారము విశేషించి నా స్వరూపమే యగుచున్నది (3). ప్రకాశస్వరూపుడను, సత్త్వరజస్తమోగుణములకు అతీతుడను, సర్వమునెరింగిన వాడను,సర్వమును సృష్టించిన వాడను, సర్వజగన్నాథుడను. సర్వవ్యాపకుడను, మంగళకరుడను అగు నేను ఓం అనే ఒకే అక్షరము గల మంత్రమునందు ప్రతిష్ఠితుడనై యున్నాను (4). సత్త్వరజస్తమోగుణముల కలయికలోని హెచ్చు తగ్గుల వలన ఈ జగత్తులోని సకలపదార్థములు నిర్మాణమై యున్నవి. ఈ సమస్తము, దానిలోని విభిన్నములగు అంశములతో సహా ఓంకారముయొక్క అర్థములో అంతర్గతమగునని మహర్షులు చెప్పుచున్నారు (5). కావున, ఈ అక్షరము సర్వజగత్తునకు అధిష్ఠానము, అవినాశియగు పరంబ్రహ్మమే యగుచున్నది. శివుడు సృష్ట్యాదియందు ఈ అక్షరముచే సకలజగత్తును సృష్టించును (6), శివుడే ఓంకారమనియు, ఓంకారమే శివుడనియు చెప్పబడినది. ఏలయనగా, వాచకమగు ఓంకారమునకు వాచ్యమగు శివునకు భేదము లేశ##మైననూ లేదు (7). కావున, ఓంకారస్వరూపుడనగు దేవునిగా నన్ను బ్రహ్మర్షులు తెలియుచున్నారు. విద్వాంసులు వాచకమగు ఓంకారమునకు వాచ్యమగు పరంబ్రహ్మతో ఐక్యమును భావన చేయుచున్నారు (8). కావున, ముముక్షువు మనస్సులో వికారములు లేనివాడై, సర్వజగత్కారణము, నిర్గుణుడను, పరమేశ్వరుడను అగు నేను ఓంకారస్వరూపుడనని తెలియవలెను (9). దేవతలకు ప్రభ్వియగు ఓ దేవీ! కావుననే, నేను జీవులు ముక్తిని పొందుట కొరకై కాశీలో సర్వమంత్రములలో శ్రేష్ఠమైన ఈ ఓంకారమును మాత్రమే ఉపదేశించెదను (10).


ఓ అంబికా! నీవు అడిగిన ప్రశ్నలలో ముందుగా ఓంకారముయొక్క ఉద్ధారము (మంత్రరహస్యములను బయటకు తీయుట, అనగా విడివిడిగా తెలసుకొనుట) ను చెప్పెదను. దీనిని తెలియుట చేతనే పరమసిద్ధి (మోక్షము) లభించును (11). ముందుగా నివృత్తి (ఆపివేయుట)ని, తరువాత క్రమముగా ఇంధనమును, కాలమును, దండము (నియమము) ను మరియు ఈశ్వరుని ఉద్ధారము చేయవలెను (12). ఈ విధముగా మూడు మాత్రలు, బిందువు, నాదము అను అయిదు వర్ణములతో కూడియున్న స్వరూపము గల ప్రణవమును ఉద్ధారము చేసి నిత్యము జపించువారికి అది ముక్తిని ఇచ్చును (13). బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు గల సకలప్రాణుల ప్రాణము ఈ ఓంకారమే. కావుననే, దీనికి ప్రణవమను పేరు వచ్చినది (14). ఓంకారమునకు ఆకారము మొదటి వర్ణము; తరువాతిది ఉకారము; మధ్యమునందు మకారము గలదు; అది నాదముతో అంతమగును (15). ఓ మహర్షీ! ఓంకారమునందు మొదటి వర్ణము దక్షిణదిక్కునందు గలదు. అది జలస్వరూపము. మధ్యమవర్ణమగు మకారము ఉత్తరమునందు గలదు. అది అగ్ని స్వరూపము (16). క్రమముగా అకార, ఉకార, మకారములు మూడు మాత్రలు. తరువాతి భాగము సగము మాత్ర అని చెప్పబడినది (17) ఓ మహేశ్వరీ! బిందువు, నాదము కలిసి అర్ధమాత్ర యగును. జ్ఞానులచే మాత్రమే తెలియబడే ఈ అర్ధమాత్రను సాక్షాత్తుగా వర్ణించుట శక్యము కాదు (18). ఓ ప్రియురాలా! వేదములు నానుండియే పుట్టుననే సత్యమును 'ఈశానస్సర్వవిద్యానామ్‌' మొదలైన శ్రుతివాక్యములు చెప్పుచున్నవి (19). కావున, వేదమునకు ఆదిలోనుండే (కారణమైన) ఓంకారము నన్ను బోధించును. నన్ను బోధించుచుండుట చేతనే ఓంకారముకూడ వేదమునకు ఆది (కారణము) అని వర్ణించబడుచున్నది (20).


అకారము సర్వజగత్తునకు బీజమగు మహత్తత్త్వమునకు, రజోగుణమునకు, సృష్టికర్తయగు బ్రహ్మగారికి, ఉకారము మహత్తత్త్వమునకు కూడ కారణమగు మాయాశక్తికి, సత్త్వగుణమునకు, జగత్పరిపాలకుడగు విష్ణువునకు ప్రతీక (21). మకారము మాయాశక్తిసమేతుడగు ఈశ్వరునకు, తమోగుణమునకు, సంహారకుడగు రుద్రునకు ప్రతీక. బిందువు ప్రకాశస్వరూపుడగు మహేశ్వరునకు, తిరోభావము (కార్యజగత్తు కారణరూపములోనికి విలీనము కాగా, ఆ కారణము కూడ పరమాత్మలో విలీనమగుట) నకు ప్రతీకయని చెప్పబడినది (22). సర్వము మరల అనుగ్రహించే సదాశివునకు నాదము ప్రతీకయని చెప్పబడినది. సర్కజగత్కారణమగు ప్రకృతికంటె పరుడగు శివుని నాదముయొక్క అగ్రమునందు భావన చేయవలెను (23). ఆయనయే సర్వమును తెలిసినవాడు, సర్వమును సృష్టించువాడు, సర్వమును పాలించువాడు. శుద్ధుడు, నాశము లేనివాడు, శబ్దములచే సాక్షాత్తుగా నిర్దేశింప శక్యము కానివాడు, కార్యకారణములకు అతీతుడు అగు పరబ్రహ్మ సాక్షాత్తుగా ఆ సదాశివుడే (24). ఈ ప్రణవములోని ఆకారము మొదలగు వర్ణములలో తరువాతి వర్ణము దానికి ముందుండే వర్ణమును వ్యాపించును. అనగా, పూర్వవర్ణము వ్యాప్యము కాగా, ఉత్తరవర్ణము వ్యాపకమగును. ప్రణవమంతటా ఈ విధముగా భావన చేయవలెను (25). సద్యోజాత, నామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అనే నా స్వరూపములై యున్న ఐదు బ్రహ్మలు అకారము మొదలగు అయిదు వర్ణములయందు క్రమముగా ప్రతిష్ఠితులై యున్నారు (26). ఓ పార్వతీ! ఆకారమునందు సద్యోజాతుని నుండి పుట్టిన ఎనిమిది కళలు, ఉకారమునందు వామదేవస్వరూపములగు పదమూడు కళలు గలవని చెప్పబడినది (27). మకారమునందు అఘోరస్వరూపములగు ఎనిమిది కళలు గలవు. బిందువునందు తత్పురుషస్వరూపములగు నాలుగు కళలు ఉద్భవించి యున్నవి (28). నాదమునందు ఈశానునినుండి పుట్టిన అయిదు కళలు గలవు. ఆరు విధముల ఐక్యమును అనుసంధానము (భావన) చేయుటచే ప్రణవము ప్రపంచమునకు ఆత్మయగునని చెప్పబడినది (29). మంత్రము, యంత్రము, దేవత, ప్రపంచము, గురువు, శిష్యుడు అనునవి ఆ ఆరు తత్త్వములు. ఓ ప్రియురాలా! ఈ ఆరు పదార్ధముల తత్త్వమును గురించి వినుము (30).


ఈ అయిదు వర్ణముల కలయికయే మంత్రమగునని పూర్వములో చెప్పియుంటిని. ఆ మంత్రమే యంత్రరూపమును దాల్చును. దాని మండలముల క్రమమును చెప్పెదను (31). యంత్రము దేవతయొక్క స్వరూపము. దేవత జగత్స్వరూపిణి. గురువు జగత్స్వరూపుడని చెప్పబడినది. శిష్యుడు గురువుయొక్క శరీరమని ఋషులు చెప్పుచున్నారు (32). ఈ సర్వము ఓంకారమే అనియు, సర్వము బ్రహ్మమేననియు వేదము చెప్పుచున్నది. కావున, ఓంకారము వాచకము, బ్రహ్మ వాచ్యము అనే సంబంధము కూడ ఇదే విషయమును చెప్పుచున్నది (33). దేవతలకు ప్రభ్వియగు ఓ పార్వతీ! ఆధారము, మణిపూరము, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ, శక్తి, శాంతి అనునవి క్రమముగా ఒకదానిపై మరియొకటి ఉండును. ఇవి స్థానములని చెప్పబడినవి. శాంతికి పైన పరాత్పరుడగు సదాశివుడు ఉండును. ఎవనికి దృఢమగు వైరాగ్యము కలుగునో, వాడే అధికారి (34, 35). జీవబ్రహ్మల ఏకత్వము భావన చేయబడును. కావున, ధ్యానమునకు విషయము నేనే అగుచున్నాను. దేవతలకు ప్రభ్వియగు ఓ పార్వతీ! విషయమును చక్కగా చెప్పియుంటిని. ఇపుడు సంబంధమును వినుము (36). జీవుడు, ఆత్మ అనువాటికి నాతో అభేదము వాచ్యము. ఓంకారము వాచకము. ఈ సందర్భములో ఇదియే సంబంధమని చెప్పబడినది (37). వ్రతము మొదలగు వాటియందు చాల ప్రీతి గలవాడు, శాంతస్వభావము గలవాడు, తపశ్శాలి, ఇంద్రియములను జయించినవాడు, శుచిశుభ్రతలు గలవాడు. సచ్ఛీలము గలవాడు, బ్రాహ్మణుడు, వేదమునందు నిష్ఠ గలవాడు (38). ఇహలోకమునందలి భోగములయందు మాత్రమే గాక పరలోకములో దేవతల భోగములయందు కూడ వైరాగ్యము గలవాడు, శివదీక్ష గలవాడు, మంచి బుద్ధి గలవాడు, శమదమాదిగుణసంపన్నుడు, సౌశీల్యము గలవాడు అగు శిష్యశ్రేష్ఠుడు సకలశాస్త్రముల సారమునెరింగినవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, సన్న్యాసి అగు ఆచార్యుని వద్దకు వెళ్లి, సాష్టాంగనమస్కారము మొదలగు వాటిచే ప్రయత్నపూర్వకముగా ఆయనను సంతోష పెట్టవలెను (39-41).


ఎవడు గురవో, వాడే శివుడు, ఎవరు శివుడో, వాడే గురువు అని మహర్షులు చెప్పిరి. ఈ విషయమును మనస్సులో నిశ్చయించుకొని తన మనస్సులోని భావమును గురువునకు నివేదించవలెను (42). సద్బుద్ధి గల బ్రాహ్మణుడగు సాధకుడు గురువుయొక్క అనుజ్ఞను పొంది పన్నెండు రోజులు పాలను మాత్రమే ఆహారముగా తీసుకొని, సముద్రతీరమునందు గాని, నదీతీరమునందు గాని, పర్వతమునందు గాని, శివాలయమునందు గాని, శుక్లపక్ష పంచమినాడు గాని, ఏకాదశి నాడు గాని, ఉదయమే స్నానమును చేసి పవిత్రమగు అంతఃకరణము గలవాడై నిత్యకర్మలను ఆచరించి, గురువును ఆహ్వానించి యథావిధిగా నాందీశ్రాద్ధమును చేసి, క్షౌరకర్మయందు కక్షములను గుహ్యమును విడిచిపెట్టి శిరోజములను గెడ్డమును మీసమును గోళ్లను తీసివేసి, తరువాత స్నానమును చేసి, ఏకాగ్రమగు మనస్సు గలవాడై, పిండిని భుజించి, తరువాత సాయంకాలమునందు స్నానమును చేసి సంధ్యావందనమును చేసి, గురువుతో కూడి సాయంకాల - ఔపాసనమును చేసి, గురువు రూపములోనున్న శివునకు శాస్త్రోక్తమగు దక్షిణను ఇచ్చి (43-47), హోమద్రవ్యములను సంపాదించి, స్వశాఖాసూత్రములో చెప్పిన విధముగా యథావిధిగా లౌకికాగ్ని మొదలగు విభేదములను అనుసరించి అగ్నిని ప్రతిష్ఠించవలెను (48). అహితాగ్నియగు బ్రాహ్మణుడు ప్రాజాపత్యేష్టిచే ఆధానము చేయబడిన శ్రౌతాగ్నియందు చక్కగా ఆహుతులను సమర్పించి సమస్తసంపదను దక్షిణగా ఇచ్చి, తరువాత ఆ అగ్నిని తన యందు ఆరోపించుకొని, ఇంటిని విడిచి సన్న్యసించవలెను. తరువాత, అతడు స్థిరచిత్తముగల వాడై చరువు (హోమద్రవ్యము) ను వండి ఆ అగ్నియందు సమిధలు, అన్నము, నెయ్యి మొదలగు వివిధద్రవ్యములను (49,50), పురుషసూక్తమును పఠిస్తూ ప్రతి ఋక్కునకు అంతమునందు హోమము చేసి స్వశాఖాసూత్రములో చెప్పబడిన విధముగా స్విష్టకృత్‌ హోమమును చేయవలెను (51).


తరువాత ఆ విద్వాంసుడు తంత్రోక్తవిధానముగా కూడ హోమమును చేసి, అగ్నికి ఉత్తర దిక్కునందు వస్త్రము, మృగచర్మము మరియు దర్భలతో రచింపబడిన ఆసనమునందు కూర్చుండి దృఢమగు చిత్తము గలవాడై బ్రాహ్మముహూర్తము వరకు గాయత్రిని జపించవలెను (52). తరువాత ఆ విద్వాంసుడు స్నానమును చేసి యథావిధిగా హోమము కొరకై అన్నమును వండి పురుషసూక్తముతో మొదలిడి విరజాసూక్తము వరకు హోమమును చేయవలెను (53). ఈ ప్రక్రియను వామదేవమహర్షి చెప్పిన విధముగా గాని, శౌనకాది మునులు చెప్పిన విధముగా గాని చేయవచ్చును. కాని వామదేవమహర్షి తల్లి గర్భమునందుండగనే జ్ఞాని యైనాడు గాన, ఆయన చెప్పిన పద్ధతి శ్రేష్ఠము (54). తరువాత శేషహోమమును పూర్తి చేసి, ప్రాతరౌపాసనమును చేయవలెను. తరువాత అగ్నిని తనయందు ఆరోపించుకొని, ప్రాతస్సంధ్యావందనమును చేసి (55), సూర్యోదయమైన తరువాత గాయత్రీమంత్రమును జపించవలెను. తరువాత క్రమముగా మూడు ఏషణలను (సంతానము, ధనము, పరలోకములయందు గల ఆసక్తి) విడిచి పెట్టి ప్రేష (సన్న్యసించే సమయములో చెప్పే) మంత్రములను ఉచ్చరించి (56). పిలక, యజ్ఞపవీతము, మొలత్రాడు మొదలగు వాటిని పరిత్యజించి, తూర్పు దిక్కు వైపునకు గాని, ఉత్తరము వైపునకు గాని వెళ్లవలెను (57). తరువాత లోకములో సంచరించుటకు తగిన దండమును, కౌపీనమును స్వీకరించవలెను. అతడు లోకవ్యవహారమునందు, లోకసంచారమునందు ఇష్టము లేని వాడైనచో, వాటిని స్వీకరించనక్కర లేదు (58). తరువాత అతడు గురువు వద్దకు వెళ్లి మూడు సార్లు సాష్టాంగ నమస్కారమును చేయవలెను. తరువాత గురువునకు సమీపములో నిలబడవలెను (59). అపుడు గురువు విరజాహోమము చేయగా మిగిలి యున్న తెల్లని భస్మను తీసుకొని, దానిని శిష్యునికి యథావిధిగా పూయవలెను (60).


తరువాత 'అగ్నిరితి' అని మొదలయ్యే మంత్రముతో త్రిపుండ్రమును ధరింపజేయవలెను. హృదయపద్మమునందు నీతో గూడి ప్రతిష్ఠితుడనై యున్న నన్ను ధ్యానించవలెను (61). ప్రీతితో నిండిన మనస్సు గల గురువు శిష్యుని శిరస్సుపై చేతిని ఉంచి వాని కుడి చెవిలో ఋషి మొదలగు వాటితో కూడియున్న ప్రణవమంత్రమును మూడు సార్లు చక్కగా ఉచ్చరించవలెను. ఆ గురుశ్రేష్ఠుడు తరువాత ఉపాసనా (స్వానుభవ) సహితముగా దాని ఆరు విధముల అర్థమును బోధించవలెను (62, 63). ఆ శిష్యుడు గురువునకు పన్నెండు సార్లు భూమిపై సాష్టాంగముగా ప్రణమిల్లి నిత్యము గురువునకు వశుడై యుండి, వేదాంతమును చక్కగా అభ్యసించవలెను (64). ఆతడు నిత్యము పరిశుద్ధమైన, వికారములు లేని మనస్సులో సాక్షిస్వరూపుడను, వినాశము లేనివాడను, పరంబ్రహ్మను, పరమాత్మను అగు నన్ను మాత్రమే ధ్యానించవలెను (65). శమదమాదిధర్మములయందు నిత్యము ప్రీతి గలవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, మాత్సర్యము లేనివాడు అగు ఆ యతి ఈధ్యానమునందు అధికారము గలవాడని చెప్పబడినది (66). దోషములు లేనిది, శోకము లేనిది, శ్రేష్ఠమైనది, ఎనిమిది పత్రములు గలది, కేసరములతో శోభిల్లునది, తొడిమకు పై భాగమునందు విరాజిల్లునది, మూలాధారశక్తితో మొదలిడి మూడు తత్త్వములకు పైన ఉండునది అగు హృదయపద్మమనే ఈశ్వరధామమును భావన చేసి దానిమధ్యలో దహరాకాశము (ఈశ్వరస్థానము) ను భావన చేయవలెను (67, 68). పరబ్రహ్మస్వరూపమైన ఓం అనే ఏకాక్షరమంత్రమును ఉచ్చరిస్తూ నీతో గూడియున్న నన్ను ఆ హృదయాకాశమధ్యములో నిత్యము స్థిరమగు మనస్సుతో ధ్యానించవలెను (69). ఓ ప్రియురాలా! ఈ విధముగా ఉపాసించు సాధకుడు నా లోకమును పొంది నానుండి విజ్ఞానమును పొంది నా సాయుజ్యము అనే ఫలమును పొందును (70).


శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసపద్ధతి వర్ణనము అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

కామెంట్‌లు లేవు: