2, మే 2024, గురువారం

నిబద్దత ఉన్న నాస్తికుడు - శ్రీ శ్రీ

 నిబద్దత ఉన్న నాస్తికుడు - శ్రీ శ్రీ

(శ్రీ శ్రీ జన్మదినం సందర్బంగా )

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి


నాస్తికులు....

దేవుడిని...అతీత శక్తులను నమ్మనివాళ్ళు...! 

కనిపించేది వినిపించేది మాత్రమే నమ్మేవాళ్ళు....! 

మొత్తానికి - 

శాస్త్రీయతకు అందని ఏ అంశాన్ని అయినా విషయాన్ని అయినా తోసిచ్చేవాళ్ళు నాస్తికులు ! 

కానీ.... ఈ మధ్య కాలంలో సాంఘిక మాధ్యమాల్లో నాస్తికుడికి అర్థం మారిపోయి కనిపిస్తున్నది ! 


దేవుడిని గేలి చేసేవాళ్ళు .... ఇతరుల నమ్మకాలను అపహాస్యం చేసేవాళ్ళు...దేవతా స్త్రీల అంగంగాలని గూర్చి వెకిలిగా మాట్లాడేవాళ్లు.... పురాణాల్లో రాక్షస పాత్రలను వెనుకేసుకి వచ్చేవాళ్ళు... దేవుడు లేడు అంటూనే దేవుడిని తీవ్ర పదజాలంతో దుషించే వాళ్ళు... దేవతా ప్రతిమల్ని తొక్కుతూ వికృతానందం పొందేవాళ్ళు... నాస్తికులుగా కనిపిస్తుంటారు.


విప్లవ కవి ...అభ్యుదయ వాది ...అక్షరాలతో హడలెత్తించిన నిత్య చైతన్యశీలి.... పిడికిలెత్తిన నిప్పుకణిక...ముసలి తనం శరీరానికే మనసుకు కాదన్నట్టు చివరి శ్వాస వరకు గర్జించిన కవితా కేసరి.... మహాకవి శ్రీ శ్రీ - ఒక కరుడుగట్టిన నాస్తికుడు ! 


వస్తున్నాయ్ వస్తున్నాయ్

జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయ్

అంటూ పీడితులను తాడితులను కదిలించిన శ్రీ శ్రీ

దేవుడిని నమ్మలేదు కానీ వారి సతీమణి శ్రీమతి సరోజ గొప్ప దైవ భక్తురాలు. ఈ విషయమై శ్రీ శ్రీ స్పందన చూస్తే....

" కనిపించని దేవుడు కోసం ఇంట్లో ఒక గది కేటాయించుకుంది మా సరోజ. పోనీయ్....కనిపించే ప్రతి రాయికి రప్పకు మాత్రం మొక్కదు. తన నమ్మకం గొప్పది " అనేవాడు. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆయా ప్రాంతాలకు సభలు సమావేశాలకై వెళ్ళినప్ప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండే ప్రఖ్యాత దేవాలయాలను సరోజ గారు దర్శించుకునే వారు.

శ్రీ శ్రీ ఎటువంటి అభ్యంతరం చెప్పేవాడు కాదు.


ఈ విషయమై సరోజ గారు - " వారు నా నమ్మకాన్ని గౌరవిస్తారు " అని చెప్పుకోవడంలో శ్రీ శ్రీ ఉన్నత వ్యక్తిత్వం ప్రస్పుటమౌతుంది.


అట్లాగే - 

1.పిట్స్ బర్గ్ వేంకటేశ్వరుని మీద భక్తి గీతం

2. జై సంతోషి సంగీత విద్యాలయ

 3.కూతురు పెళ్ళిలో సాధారణ తండ్రిగా


 ఈ మూడు విషయాల్లో కూడా శ్రీశ్రీ హుందాతనం 

 ఒకసారి గమనిద్దాం..


▪️పిట్స్ బర్గ్ వేంకటేశ్వరుని మీద భక్తి గీతం


తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన వెంకటేశ్వర దేవస్థానం ఒకటి అమెరికాలోని పెన్సిల్ వేనియా రాష్ట్రంలో పిట్స్ బర్గ్ నగరంలో ఉంది. అమెరికాలోనే తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవస్థానాన్ని 1976 నవంబరు 17 న ప్రతిష్ఠాపన జరిపారు.మన శ్రీ శ్రీ ఈ వేంకటేశ్వరుడి మీద భక్తి గీతం ఒకటి రాశారు. నాస్తికుడు భక్తి గీతం రాయడంపై అందరూ ఆశ్చర్య పోయారు. ఈ విషయమై ఒక సంపాదకుడు శ్రీ శ్రీ గారిని ప్రశ్నించారు కూడా.


" శ్రీశ్రీగారూ ! మీరు దైవప్రార్థనంటూ ఇక్కడ పిట్స్బర్గ్ వేంకటేశ్వరుని మీద నిజంగా భక్తిగీతం రాశారా? లేక వెంకటేశ్వరా నువ్వు పిట్స్బర్గ్ వేంచేశావు . శ్రీరంగం శ్రీనివాసుని నేను వచ్చాను , నీకు పొగడ్తలు ఇష్టం గనుక ఒకటి అందుకో . విదేశంలో వున్న మనకెందుకులే తగవులాటని....అనుకున్నారా? " అనేది సంపాదకుడి ప్రశ్న శ్రీ శ్రీ భార్య సరోజ తన శ్రీ శ్రీ సంసార ప్రస్థానంలో స్పష్టంగా రాయడం జరిగింది.


ఇందుకు శ్రీ శ్రీ ఇచ్చిన సమాధానం కూడా ఆమె రాస్తూ.... " ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకోవటంలో నాకేమీ అభ్యంతరంలేదు . కానీ మిత్రులు కోరిన మాటను కాదనలేక వాళ్ళని కించపరచటం ఇష్టంలేక ఆ పాటను రాశానని మాత్రం నిశ్చయంగా చెప్పగలను.... " అని చెప్పినట్టుగా తెలిపారు.


ఇక్కడ

శ్రీ శ్రీ గారి ఉత్తమ తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించవచ్చు. నమ్మని నమ్మకం లేని విషయాల పట్ల నాస్తికులు వితండవాదం చేస్తారు. తమని తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ శ్రీ శ్రీ వాదనకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకరికి రుచించనిది మరొకరికి రుచిస్తుందనే భావనతోనే పెద్దరికం ప్రదర్శించారు. నాస్తికత్వానికి గౌరవం తెచ్చిపెట్టారు.


▪️ జై సంతోషి సంగీత విద్యాలయ


శ్రీ శ్రీ జీవన సహచరి సరోజమ్మ మంచి వెండితెర గాయని. తర్వాత శ్రీ శ్రీ గారికి అసిస్టెంట్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత అర్ధాంగి అయ్యింది .పెళ్లి తర్వాత కొన్నాళ్ళకు సినిమా రంగానికి దూరం అయ్యింది.


సరోజమ్మ సాధారణ గాయని కాదు.వీణ , మృదంగం , వయోలిన్ , హార్మోనియం వాయిద్యాలు వాయించగలదు. సంగీతంలో గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పరీక్షలన్నీ ఉత్తీర్ణత సాధించింది.ఓకల్ కూడా పాసయ్యింది.సంగీత విద్వాన్ సర్టిఫికేట్ పొంది ఉన్నది. అయినప్పటికి గృహిణిగా ఇంటికి అంకితం అయ్యింది.


శ్రీ శ్రీ గారికి ఇది నచ్చలేదు. ప్రతిభ ప్రజ్ఞ ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావడం ససేమిరా అంగీకరించలేదు. అందుకే ఒక మూడేండ్ల తర్వాత సరోజమ్మతో మాట్లాడుతూ -

" నా మాట విని హాయిగా స్కూలు పెట్టుకో . దానివల్ల నాలుగు డబ్బులు వస్తాయి , నువ్వు కష్టపడి నేర్చుకున్న విద్యలకి ప్రాణాలు వస్తాయి . ఒక్కొక్క సర్టిఫికేట్కీ ఎన్నేళ్ళు కష్టపడ్డావు?మూడేసి సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్య , సంపాదించిన సర్టిఫికేట్లు మూలనపడి మూలుగుతున్నాయి . నీకేమయినా బుద్ధుందా ? నేను చెప్పినట్టు చెయ్యి . ఇప్పటికయినా నా మాట విను . ఎంత డబ్బు ఖర్చయినా ఫరవాలేదు . ప్రస్తుతం నీకు మూడవేల రూపాయలు సేంక్షన్ చేస్తాను . మీ కాలేజీలో ప్రొఫెసర్స్ని , స్టూడెంట్స్ని పిలిచి మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చెయ్యి " అన్నాడు.


భర్త ప్రోత్సాహంతో " జై సంతోషి సంగీత విద్యాలయ" పేరుతో సంగీత పాఠశాల తెరిచింది. నాస్తికుడైన శ్రీ శ్రీ అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటూ కూడా ,, పరిపూర్ణ అస్తికత్వాన్ని కనబరుస్తున్న పేరు విషయంలో ఏ అభ్యంతరం చెప్పలేదు. అందుకేనేమో.... సరస్వతి మాత అతడికీ సారస్వతనిలయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చింది. ఏది ఏమైనా శ్రీ శ్రీ విశాల దృక్పథానికి.... సువిశాల మనస్తత్వానికి ఈ ఘటన ఒక గొప్ప నిదర్శనం.


 ▪️కూతురు పెళ్ళిలో సాధారణ తండ్రిగా


భావజాలం మనిషిని కట్టి పడేస్తుంది. శ్రీ శ్రీ తన భావజాలానికి కట్టుబడిన వాడే. కానీ తనదైన భావజాలాన్ని పక్కకు పెడుతూ ఒక తండ్రిగా 

సాధారణ మనిషిగా మారిపోయిన సందర్బం..శ్రీ శ్రీ ని ఒక కొత్త కోణంలో చూపెడుతుంది.


తను నివసిస్తున్న పరిసరాలు , తన చుట్టూ ఉన్న వ్యక్తులు, తన దేశంలో సాధారణంగా కుటుంబాల్లో నెలకొని ఉన్న ఆచార వ్యవహారాలు , వీటన్నిటి నేపథ్యం శ్రీ శ్రీ భావజాలానికి కొంత విరామం ఇచ్చింది. అది తన కూతురు పెండ్లి సందర్బం. తనకు ఆచార వ్యవహారాలు గిట్టకపోయినా పిల్లల కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.


పెండ్లిలో పెండ్లికూతురు గౌరీ పూజా చేయాల్సి వచ్చినప్పుడు అందరూ సరోజమ్మ ఒక్కతే కూర్చుని కూతురుతో గౌరీ పూజా చేయిస్తుంది అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న తండ్రి సామాన్యమైన వ్యక్తి కాదు.


పదండి ముందుకు

పదండి తోసుకు

పోదాం పోదాం పై పై పైకి

అంటూ తన కవితలతో ప్రపంచాన్ని కదిలించిన వాడు. వేలాది గుండెల్లో చైతన్యం నింపిన వాడు. విప్లవ సెగలతో స్ఫూర్తిని పంచి ఆదర్శంగా నిలిచిన వాడు. విటన్నీటికి తోడు దైవశక్తిపై ఏ మాత్రం నమ్మకం లేని నాస్తికుడు.

అందుకే పెండ్లి సంప్రదాయాల విషయంలో

శ్రీ శ్రీ ని ఎవ్వరు బలవంత పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు.

కానీ...

అనూహ్యంగా...

ఆకస్మికంగా....

" సరోజా గౌరీ పూజకు వెళ్ళాలి పదా " అంటూ భార్యని పిలిచిన శ్రీ శ్రీ ని చూసి అందరూ

ఆశ్చర్యపోయారు. సరోజమ్మ మాత్రం ఏకంగా అక్కడే పెళ్లి పందిట్లోనే భర్తను కౌగిలించుకుని ఏడ్చేసింది.


శ్రీ శ్రీ కవిగా ఎంతటి వాడయినప్పటికి తండ్రిగా మాత్రం అతి సున్నితమైన వాడు. అందరి తండ్రులలాగే పిల్లల కోసం పట్టు వీడి దిగివచ్చిన వాడు. 


గౌరీ పూజా తర్వాత అల్లుడికి సతి సమేతంగా కాళ్ళు కడికి కన్యాదానం కూడా చేసాడు.


ఇది శ్రీ శ్రీ జీవన ప్రస్థానంలో ఒక సందర్బం! నాస్తికుడిలో ఒక కారుణ్యమూర్తి దర్శనం ! నకిలీ నాస్తికులు శ్రీ శ్రీ ని చూసి నేర్చుకోవాలి.

కామెంట్‌లు లేవు: