*అవిద్య అంటే అజ్ఞానం, మాయ.*
మనస్సు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే ఒక యోగం. ఆ విధంగా ప్రయత్నం చేయటం వల్లనే మానవజీవితానికి సార్ధక్యం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఆ విధమైన నివృత్తి మార్గాన్ని పొందకలగటానికి సద్గురువు యొక్క కటాక్షం కావాలి. మార్గదర్శనాన్ని పొందాలి. నివృత్తి మార్గంలోనే ఆత్మజ్ఞానం పొందటానికి సమర్థులవుతారు. ఒక సందర్భంలో శంకరులవారు చెప్పారు - *నేను చేస్తున్నాను అనే భావన బంధానికి కారణమవుతుంది, నాది అనే భావనకూడా బంధహేతువే అవుతుంది.* అంటే అహంకార మమకారాలు విసర్జించిన వాడే సరైన మార్గంలో ఉన్నాడని అర్ధం.
అవిద్య అంటే అజ్ఞానం, మాయ. దీనివల్లనే మానవుడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. దేహమే తాను అనే భావనలో ఉన్నాడు. దేహానికి ఏదైనా కష్టం కలిగితే నాకు కష్టాలు కలుగుతున్నాయని బాధపడుతున్నాడు. తనది లేదా నాది అనుకున్న వస్తువుకు ఏదైనా నష్టం కలిగితే నా ఆస్థి నష్టమైనదని బాధపడుతున్నాడు. ఈ అనర్ధములన్నిటికీ అవిద్యతో ఏర్పడిన అహంకార మమకారములే కారణం. ఈ విధంగా దుఃఖం ప్రారంభమవుతుంది. అవతలివాడికి ఉన్నదనే దుఃఖం, తనకు లేదనే మరొక దుఃఖం. ఈ దుఃఖాలకు అవిద్యే కారణం. మనల్ని ఏమైనా అంటే చట్టుక్కున కోపం వస్తుంది, ప్రశంసిస్తే సంతోషం కలుగుతుంది. నిజమైన జ్ఞానికి ఏ స్పందన ఉండదూ.
ఏమయ్యా ! నీకు మానావమానాలు లేవా ? అంటే నాకు అంతా సమానమే అంటాడు. పైపెచ్చు నన్ను నిందిస్తే నాకు సంతోషమంటాడు. ఎందుచేతనంటే తనకు ఉన్న పాపం పోతుందట. జ్ఞానులు అటువంటివారు. వారి స్వభావంలో మార్పు ఉండదు. ఆ విధంగా మానవుడు సమదర్శనుడై ఎప్పుడు ఉంటాడో అప్పుడు అతడు సరైన మార్గంలో ఉన్నాడని అర్ధం.
*-శృంగేరీ జగద్గురువు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి