*దేవాలయాలు - పూజలు 17*
సభ్యులకు నమస్కారములు.
*ప్రదక్షిణ (2)*
(పురాణ గాథ)
గణాధిపత్య షరతులతో
శ్రీమహా గణపతి యుక్తిగా జననీ జనకులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల ప్రదక్షిణ చేసి ఉన్న చోటనే ఈశ్వర ప్రదక్షిణ ద్వారా భూ ప్రదక్షిణ గావించిన ఫలితం పొందాడు.
ప్రదక్షిణ లోని కొన్ని విధానాలను పరిశీలిద్దాము.
1) ఆత్మ ప్రదక్షిణ
2) పాద ప్రదక్షిణ
3) దండ ప్రదక్షిణ
4) అంగ ప్రదక్షిణ
5) గిరి ప్రదక్షిణ.
ఈ *సదాచారము* దేవాలయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇంకా కొందరు మహానుభావులు అశ్వత్థ ప్రదక్షిణ, భూ ప్రదక్షిణ, కుల శైల ప్రదక్షిణ ,తులసీ ప్రదక్షిణ మరియు గో ప్రదక్షిణలు గూడా చేస్తూ ఉంటారు.
తండ్రికి, గురువుకు మరియు తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదానికంటే ఒకటి దశోత్తరమైన
(పది రెట్లు అధికము) ఫలితాలనిస్తాయి.
బ్రహ్మ చర్యం పాటించే వారికి, గృహస్థులకు మరియు సన్యసించిన వారికి ప్రదక్షిణలు వేర్వేరుగా ఉంటాయి.
*ప్రదక్షిణ ఫలితాలు* మొదటి ప్రదక్షిణ బ్రహ్మ హత్య లాంటి పాపాలను గూడా హరిస్తుంది. రెండవ ప్రదక్షిణ ఆరాధకుడిని అధికారిగా చేస్తుంది అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలకు అర్హత కల్గిస్తుంది. మూడవ ప్రదక్షిణ నైంద్ర సంపద సమకూరుస్తుంది అనగా జీవిత అంతంలో = చివరి విముక్తిలో ఆనందం పొందుపరుస్తుంది. *ఇంకొక భావన* మొదటి ప్రదక్షిణలో *తమో గుణం*, రెండవ ప్రదక్షిణలో *రజో గుణం*, మూడవ సారి *సత్వ గుణం* అనగా మనలో ఉన్న త్రిగుణాలను భగవంతునికి అర్పించి ఒక్కొక్క గుణం నుండి విముక్తి పొంది పరి శుద్ధాత్ములము కావడానికి సహకరిస్తుంది. సాధారణంగా దేవాలయాలలో కనీసము మూడు మార్లు, విష్ణు ఆలయాలలో నాలుగు సార్లు, ఆంజనేయ స్వామి ఆలయంలో అయిదు సార్లు, మొక్కుబడులు ఉంటే కనీసము పదకొండు మార్లు, అవకాశం ఉంటే 108 సార్లు చేయడం ఆనవాయితి.
*కనీస నియమాలు*
1)సవ్యదిశలో సరి సంఖ్య కంటే బేసి సంఖ్యలో ప్రదక్షిణలు ఉండాలి. విష్ణు ఆలయాలలో మినహాయింపు వర్తిస్తుంది.
2) ప్రదక్షిణలు మెల్లగా (నిదానంగా), *గజగమనము* లేదా నిండు చూలాలు ఏవిధంగా నెమ్మదిగా నడువగలదో ఆ ప్రకారంగా.... ఆలయ భగవంతుని నామాన్ని/ శ్లోకాలను ధ్యాన పూర్వకంగా ముకుళిత హస్తాలతో, శరీరం మరియు మనస్సు స్మరణ/భగవంతుని కీర్తిస్తూ/...తమయభీష్ట కోరికలపై దృష్టి ఉంచాలి.
*ప్రదక్షిణ మంత్రాలు*.
ప్రతి దేవాలయంలో సాధారణ ప్రదక్షిణ మంత్రం.
*యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే*
*పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః, త్రాహిమాం కృపయా దేవ శరణా గత వత్సల!*,
*అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర*
శక్తి (అమ్మవార్ల) దేవాలయాలకు వెళ్ళినప్పుడు మంత్రమును దిగువ విధంగా పల్కాలి. *దేవ* కు బదులు *దేవీ*, *వత్సల* బదులు *వత్సలే*, *మహేశ్వర* బదులు *మహేశ్వరి*.
*తులసి* ప్రదక్షిణ మంత్రము
*యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా, యదగ్రే సర్వ వేదాంశ్చ, తులసీత్వాం నమామ్యహం*.
శ్రీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలప్పుడు ఆ స్వామి వారి మంత్రం పఠించాలి.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి