21, ఆగస్టు 2024, బుధవారం

శంకరా! (శతకము,)

 శంకరా!

      (శతకము,)


. 5

అంబురుహము

భభభభరసలగ.యతి 13.


బొమ్మలు సేతువుకుమ్మరి రీతిని

          మూడు రంగులు వేసెదో

దొమ్మినిగూర్చెదు బొమ్మల మధ్యను

            దుఃఖభాగులచేసెదో

కమ్మిన మాయల కన్నులు చూడని

            కారుచీకటి గుప్పెదో

ద్రిమ్మరి వెచ్చట నుండెదొ నీవని?

            తెల్పుమయ్యరొ?శంకరా!

6.

కరిబృంహితము

భనభనభనర .యతి 13.


పూలశరము లెడంద తగులగ

           మోద పులకిత గాత్రుడై

తూలి గిరిజను పట్టినిలచెను

        తోలు మడుగుల వాడు తా

కోలవిసిరిన వానిగనియెను

            కోపమొలయగ రుద్రుడై

జ్వాలలెగయగ మారుడణిగెను

              భస్మమగుచును శంకరా!

7

చంద్రశేఖర

నజరజర   యతి 13


నిరతము జీవనంపు సంద్రమందునిల్చియున్

గురుతరమైన నీతిబాధలందు గూరియున్

పరమపవిత్రమైన నీదుపాద భక్తితో

శరణము పల్కమోక్షమిత్తువయ్య శంకరా

8.

తరలి

భసనజనర. యతి 11


శ్రీకరుడవు చిన్మయుడవు

             శ్రీగళుడవు శ్రీశివా!

భీకరుడవు నాశకుడవు

             విశ్వదుడవు శ్రీభవా!

శోకభయ విమోచనుడవు

          సుందరుడవు శ్రీహరా!

లోకగతుల లోక విధుల

           లోగొనెదవు శంకరా!


డా.ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

        9550231590

కామెంట్‌లు లేవు: