21, ఆగస్టు 2024, బుధవారం

శంకరా

 శంకరా!

      (శతకము,)


1ఉత్పలమాల


శ్రీగిరి జాసతీ హృదయ చిన్మణి

          దీపక!లింగరూపకా!

నాగవిభూషకా!భువన నాశక!

         రక్షక!ఆదిభిక్షుకా!

యోగరహస్యబోధక! మహోష్ణ

        మహాంబక! క్ష్వేళభక్షకా!

రోగనిరోధకా! ఎడద రోచివి

       నీవయ గౌరి శంకరా!


 2.

చంపకమాల


హిమగిరి కందరాన వసియింతువు

         నిత్యము, వెండి కొండపై

హిమజనుగూడినాట్య మొనరింతువు,

        భీకర రుద్రభూమి లో

ఢమరుకమూని నొప్పెదవు, ధ్యానము

       చేసెడిగుండెలోన శ్రీ

రమణుడవౌచు నుందు,జన రంజకు

          డీవయ గౌరిశంకరా

3.

మత్తేభము.


జలముల్ పుక్కెడు చిల్కరించి దళముల్

         చక్కంగ పై వైచుచున్

వెలిబూదిన్ గొని పైనరాచి శివ నీవే

        దిక్కునాకంచు లో

పలుకన్ సాంబడు చేయిపట్టికొని నా

         ప్రారబ్ధకర్మంబులన్

తొలుగన్ జేయుచు సౌఖ్యమిచ్చునెపుడున్

            తోరంబుగా శంకరా!


4.శార్దూలము.

  

రారా !సాంబసదాశివా!మృగపతీ!

            రారా !జగన్నాయకా!

రారా!బాలశశాంక మౌళి! యభవా!

           రా!నాగ హారాన్వితా!

రారా!భిక్షుక!నీలకంఠ!ధవళా!

          రా యంచు గొంతెత్తి నో

రారా పిల్చిన చెంతనిల్చెదవుపో

        రాజేశ్వరా!శంకరా!


డా.ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

కామెంట్‌లు లేవు: