ప్రవాస భారతి
గుప్పెడు కాసులున్, మిగుల గుండెల నిండుగ గంపెడాశలున్,
అప్పులు, ఆస్తులమ్ముకొని, ఆప్తుల పల్కులు, మూటగట్టి, నే
గొప్ప విమానమెక్కితిని కోర్కెలు తీర్చెడి పోరుబాటలో
ఎప్పుడు తప్పుజేయనని, ఇచ్చితి మాట ప్రవాస భారతీ..
చదువులఁ గోరుచున్ మరియుఁ జక్కని భావిని కోరి, దేశమున్
వదలగ నార్తితో, కడకు వాస్తవమిద్దను బాధకోర్చుచున్,
మదినిను నిల్పి నీస్మరణ మానక నిత్యము జేయు వారి, య
వ్వదనములందుఁజిందెఁబలు వన్నెలు నేడు ప్రవాసభారతీ..
నమ్మికలేనివానికిల నాశముఁ దప్పదు నష్టమౌను, ఆ
నమ్మకమున్న చాలునదె నాకము జేర్చును నాయదృష్టమై,
నమ్మితి తల్లినీవెయని నాడును, నేడును నామనస్సులో
నమ్మకమన్న ఆయుధము నాకును దక్కె, ప్రవాసభారతీ..
అమ్మను నమ్ముకొన్న బ్రతు కాటగు, పాటగునన్నివేళలన్,
అమ్మను నమ్ముకొన్న సరి యాదెస యీదెస ఆత్మరక్షయౌ,
అమ్మను నమ్ముకొన్న సుతునాకలి దీర్చెడి యన్నపూర్ణగా,
అమ్మయె వెంట వచ్చెనిదె ఆకృతి నీవు, ప్రవాసభారతీ..
నాటిరి దేశభక్తియను నాణ్యపు విత్తులు పెద్దలెందరో,
బూటక రాజకీయముల పుచ్చగ దేశము పూటపూటకున్,
నోటికి తాళముల్ మిగిలె నూటికి తొంబది మందికక్కటా,
నేటికి మేలుకొల్పితివి నీకిదె జోత ప్రవాస భారతీ..
🙏🕉️🙏
- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్
(2022లో ప్రచురించిన "ప్రవాసి" పద్యకావ్యమునందలి పద్యఖండిక, అందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి