17, ఆగస్టు 2024, శనివారం

భగవంతుడు

 *నిన్ను సృష్టించిన భగవంతుడు  నీకు ప్రసాదించిన నీ మతం, నీ భాష, నీ రూపం, నీ వేషం, నీ దేశం నీకు గొప్ప.*


ఎంత దార్శనిక శ్రేష్టుణ్ణైనా  మన ధర్మాచరణ నా కర్తవ్యమే అని ఆచార్య శంకరులు అనుకున్నారు. వారితో సమానులు ఎవరూ కూడా ధర్మమార్గంలో తమకు మినహాయింపు ఉంది అని ఎవరూ అనుకోలేదు. అటువంటప్పుడు మనమంతా ఏరీతిగా ఉండాలి?. మనకు ఇంకొక దుర్దైవం ఏమి వచ్చింది అంటే...? పాశ్చాతుల అంధానుకరణ పద్ధతులు,  అనేటటువంటివి మనవాళ్లలో వస్తున్నది, అంటే...? గుడ్డిగా పాశ్చాతులను అనుసరించటం అని. ఆ పాశ్చాతులలాగా నేనుంటే నేను పెద్దమనిషిని అవుతాను, గొప్పవాడినినైతాను, బాగా డబ్బు సంపాదించవచ్చు.. అనే భ్రమలు మనవాళ్లలో వస్తున్నవి. అది చాలా పొరపాటు. పాశ్చాతులను మనం ఎన్నడూ అనుకరించకూడదు. వాళ్ల సంస్కృతి వాళ్లకు, వాళ్ల రీతి వాళ్లకు, అది మనకు అనుకరణీయం కాదు. అది తప్పా, సరా? అనేటటువంటి విమర్శ మనకు అక్కర్లేదు, కానీ మన భారతీయులకు అవి అనుకరణీయం కాదు.  

మనము ఏ పరంపరలో ఏవచ్చామో?! ఏ ధర్మ మార్గంలో వచ్చామో?! అదే మనకు అనుకరణీయంకాని, అన్యులది మనకు అనుకరణీయం కాదు. అది ఎప్పుడు అనుకరణీయం అవుతుంది అంటే? మనకు ఉన్న ధర్మమార్గం మనకు శ్రేయఃప్రదం కాకపోతే, వాళ్లయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం అనటానికి ఏమైనా ప్రమాణం  శాస్త్ర సమ్మతంగా ఉంటే, అప్పుడు వాళ్ళది మనకు అనుకరణీయం అవుతుంది. వాళ్ళది మనకు శ్రేయఃప్రదం అనటానికి మన వేదాల్లో, పురాణాల్లో, ఋషుల వాక్కుల్లో ప్రమాణంగా ఎక్కడా ఏవిధంగా లేదు. అంతే కాకుండా, మనయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం కాదు అనటానికి కూడా ప్రమాణం లేదు.

అలాంటప్పుడు మనం అన్యులధర్మాన్ని ఎందుకు అనుసరించాలి?. సర్వదా మనకు అది అనుకరణీయం కాదు. నిన్ను సృష్టించిన భగవంతుడు  నీకు ప్రసాదించిన నీ మతం, నీ భాష, నీ రూపం, నీ వేషం, నీ దేశం నీకు గొప్ప.అందులకే, ఏ విధంగా చూచినా మనయొక్క ధర్మాన్ని ఉపేక్షించటము తప్పు. అందువలన పాశ్చాతుల అంధానుకరణం మనకు పనికిరాదు. మన శాస్త్రప్రమాణమే మనకు సర్వదా శ్రీరామరక్ష.


--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతీతీర్థ మహాస్వామి వారు.*

కామెంట్‌లు లేవు: