29, సెప్టెంబర్ 2024, ఆదివారం

హరి విలాసము

 హరి విలాసము 


హరిలీలల లెక్కించగ 

హర బ్రహ్మలకైన కాదు, నటులుండు తరి

న్నరయగ నరులగు మనకిక 

తరమే తెలియంగ మిగుల తర్కించంగన్

      

ఖగవాహనుతనయుని కడ 

నిగమంబులు దొంగలించి నీరధి జేరన్ 

దెగటార్చియు నసురాధము

జగముల తా బ్రోచె మిగుల సంతసమొందన్ 


సుర లసురులు సుధకొఱకును 

తరియించుచు నుదధి నున్న తరుణము నందున్ 

గిరి క్రుంగగ పరమేశుడు 

కరుణను జూపించి మోయ కఛ్చప మయ్యన్ 


కడు క్రూరుడు కనకాక్షుడు 

పుడమిని వడితోడ బట్టి పోడిమితోడన్ 

గడలిలొ ముంచగ విష్ణువు 

వడితో వధియించె నతని వరలియు కిటిగన్ 


హరి ఎక్కడ ? చూపించుమ !

హరియించుదు ననుచు బలుకు హాటకకశిపున్ 

హరియించగ హరి యంతట 

నరహరి రూపంబు దాల్చి నఖముల జంపెన్ 


బలిదనుజుని మదమణచగ

పలు నమరులమొరలు వినియు పటు వటువుగ తా 

నిలమూడడుగుల నడిగియు 

పలు లోకము లెల్ల గొలిచె పాదము తోడన్ 


అరయగ రజ తమ గుణముల 

ధరనేలుచు బ్రతుకు చున్న దర్పపు నృపులన్ 

నిరువది మారులు దిరిగియు 

పరశువుతో నరికె విష్ణు భార్గవు డయ్యున్ 


వరబలుడగు దశకంఠుని 

ఖర ధూషను కుంభకర్ణు కడతేర్చుటకున్ 

నరునిగ బుట్టియు విష్ణువు 

ధరణిజపతి రాము డయ్యె ధరపులకింపన్ 


గోపాలునిగను బుట్టియు 

పాపాత్ముని కంసు జంపి పార్థుని సఖుడై 

"గో" పాలుడు శ్రీవిష్ణువు 

కాపాడెను ధర్మ నిరతి ఘనకృష్ణుండై 


కరి మకరిచె కఱువబడియు 

పరువంబును కోలుపోయి ప్రార్థించంగన్ 

హరి సరగున నరుదెంచియు 

మకరిని చక్రాన జంపి మఱి కాచె కరిన్ 


ఉత్తానపాద పుత్రుం

డుత్తముడా ధ్రువు డరయగ నుత్క్రుష్టు హరి

న్నుత్తమ పదవిని గోరగ 

నుత్తమ నక్షత్ర పదవి నునికిగ నిచ్చెన్ 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కామెంట్‌లు లేవు: